ఏథర్ ఎనర్జీ నుండి సరికొత్త మూడవ తరం 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. జులై 19న విడుదల!
బెంగుళూరుకి చెందిన ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy), భారత మార్కెట్లో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ గత నెలలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు కంపెనీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ తమ కొత్త మోడల్ ను రేపు (జూలై 19, 2022వ తేదీన) మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబధించి కంపెనీ ఓ కొత్త టీజర్ ను కూడా విడుదల చేసింది.

ఏథర్ ఎనర్జీ నుండి రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మోడల్ ఆధారంగానే తయారు చేసింది. అయితే, ఇది పాత మోడల్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండబోతోందని కంపెనీ తమ టీజర్ లో వెల్లడించింది. సమాచారం ప్రకారం, ఈ కొత్త మోడల్ స్కూటర్ ను ఏథర్ 450ఎక్స్ జెన్3 (Ather 450X Gen) పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది మరియు ఇది ప్రస్తుతం 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కన్నా ఎక్కువ రేంజ్ ను ఆఫర్ చేసే పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది.

ఇంతకుముందు, ఏథర్ ఎనర్జీ తమ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంగ్-రేంజ్ వెర్షన్‌పై పనిచేస్తోందని నివేదించబడింది. ఈ నేపథ్యంలో, కంపెనీ నుండి రాబోయే ఈ కొత్త ఏథర్ 450ఎక్స్ జెన్3 ఎలక్ట్రిక్ స్కూటరే ఈ లాంగ్-రేంజ్ వెర్షన్ అని భావిస్తున్నారు. అలాగే, ఈ 'లాంగ్-రేంజ్' వెర్షన్ కు సంబంధించి కొన్ని కీలకమైన పత్రాలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి. ఈ పత్రాలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన కీలకమైన వివరాలను వెల్లడించాయి.

ఈ లీకైన పత్రాల ప్రకారం, ఏథర్ ఎనర్జీ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రెండు వేరియంట్‌లను పరిచయం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ పత్రాల ప్రకారం, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంగ్-రేంజ్ వెర్షన్ ప్రస్తుత మోడల్‌కు శక్తినిచ్చే 2.9kWh బ్యాటరీ ప్యాక్‌కు బదులుగా పెద్ద 3.66kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ లీక్ చేయబడిన డాక్యుమెంట్ ల ప్రకారం అప్‌డేట్ చేయబడిన 450ఎక్స్ జెన్3 వేరియంట్ పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 146 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని పేర్కొనబడింది.

కొత్త ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బహుళ రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుందని కూడా ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త స్కూటర్ లో ఎకో మోడ్, స్మార్ట్ ఎకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్ మరియు వార్ప్ మోడ్‌లు ఉన్నాయి. అయితే, ఇందులో రెండవ మరియు లో-స్పెక్ వేరియంట్ మోడల్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అదనపు పనితీరును అందించే వార్ప్ మోడ్ వంటి కొన్ని ఫీచర్లను కోల్పోయే అవకాశం ఉంది.

కొత్త ఏథర్ 450ఎక్స్ లో-స్పెక్ వేరియంట్ కేవలం 4 రైడ్ మోడ్‌లను మాత్రమే కలిగి ఉంటుంది. వీటిలో ఎకో మోడ్, స్మార్ట్ ఎకో మోడ్, రైడ్ మోడ్ మరియు స్పోర్ట్ మోడ్ ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఎంట్రీ లెవల్ వేరియంట్ యొక్క క్లెయిమ్ రేంజ్ 108 కిలోమీటర్లుగా రేట్ చేయబడింది. అలాగే, ఈ కొత్త వేరియంట్లలోని కొత్త బ్యాటరీ ప్యాక్ నికెల్ కోబాల్ట్-ఆధారిత లిథియం-అయాన్ యూనిట్ గా ఉంటుందని మరియు 19 కిలోల బరువు కలిగి ఉంటుందని మరియు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6.4kW పీక్ పవర్‌తో 3-ఫేజ్ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారుతో పనిచేస్తుందని లీక్ అయిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.

లీకైన పత్రాల ప్రకారం, ఏథర్ ఎనర్జీ నుండి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గ్రాస్ వెహికల్ వెయిట్ (GVW) 243 కేజీలుగా ఉంటుంది. ఇది 1,837 మిమీ పొడవు, 739 మిమీ వెడల్పు మరియు 1,114 మిమీ ఎత్తును కలిగి ఉండి,1,296 మిమీ వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మరియు ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మోడళ్లు ఉన్నాయి. అయితే, కొత్త వేరియంట్లను విడుదల చేసిన తర్వాత కంపెనీ ప్రస్తుత వేరియంట్లను డిస్‌కంటిన్యూ చేస్తుందా లేక వాటిని అలానే కొనసాగిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ ఇటీవలే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త స్మార్ట్ ఎకో (SmartEco) మోడ్ ను ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా విడుదల చేసింది. ఈ కొత్త ఎకో మోడ్ ఇప్పటికే ఆయా స్కూటర్లలో అందుబాటులో ఉన్న మునుపటి ఎకో (Eco) మోడ్‌ను రీప్లేస్ చేస్తుంది. ఈ కొత్త ఎకో మోడ్‌ని ఉపయోగించడం వలన రైడర్లు ఇతర మోడ్‌లలో కన్నా ఎక్కువ రేంజ్‌ను పొందుతారని కంపెనీ చెబుతోంది. రైడర్లు తమ స్కూటర్‌ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా OTA ద్వారా ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








