భారతదేశంలో 250 'Atum Charge' సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు; తెలంగాణాలోనే అత్యధికం!
సౌరశక్తితో పనిచేసే ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ ను అందించే సంస్థ ఆటమ్ ఛార్జ్ (Atum Charge) కేవలం ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 250 యూనివర్సల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ మొత్తం 250 చార్జింగ్ స్టేషన్లలో తెలంగాణా రాష్ట్రంలోనే అత్యధికంగా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమిళనాడులో 44, మహారాష్ట్రలో 36, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఒక్కొక్కటి 23, ఉత్తరప్రదేశ్‌లో 15, హర్యానాలో 14, ఒడిశాలో 24 స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

టైర్ 2 మరియు టైర్3 పట్టణాలు మరియు నగరాలపై దృష్టి సారించే కంపెనీ వ్యూహంలో భాగంగా, ఈ సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాబోయే నెలల్లో, కంపెనీ మరిన్ని అదనపు నగరాలు మరియు రాష్ట్రాలలో తమ సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ మరింత వేగవంతం కాదలదని కంపెనీ ధీమాగా ఉంది.

ఆటమ్ చార్జ్ గత ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో తొలిసారిగా ఇలాంటి సోలార్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఛార్జింగ్ సొల్యూషన్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్‌ని ఉపయోగిస్తుంది మరియు ఇది మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ కు సరిపోయే విద్యుత్ ను 100 శాతం సోలార్‌కి మార్చడానికి వీలు కల్పిస్తుంది. సాంప్రదాయ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు థర్మల్ పవర్‌ని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, ఇవి పవర్ గ్రిడ్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. కానీ, సోలార్ ఈవీ చార్జింగ్ విషయంలో ఈ సమస్య ఉండదు.

ఆటమ్ ఛార్జ్ ఏర్పాటు చేసిన ఈ సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ప్రస్తుతం రోజుకు 10 నుండి 12 ఎలక్ట్రిక్ వాహనాల వరకు ఛార్జ్ చేయగల 4 KW సామర్థ్యం గల ప్యానెల్‌లను కలిగి ఉంటాయి. కంపెనీ భవిష్యత్తులో రోజుకు 25 నుండి 30 వాహనాలను ఛార్జ్ చేయడానికి సరిపడా 6 KW సామర్థ్యంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఆటమ్ ఛార్జ్ అనేక ఇతర ఛార్జింగ్ స్టేషన్ యజమానులతో కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. తమ భాగస్వాములకు కంపెనీ ఆటమ్ సోలార్ రూఫ్‌ను సరఫరా చేస్తుంది, తద్వారా ఇవి థర్మల్ విద్యుత్ వనరులకు బదులుగా సహజంగా లభించే సౌరశక్తిని ఉపయోగిస్తాయి.

ఈ సందర్భంగా, ఆటమ్ ఛార్జ్ వ్యవస్థాపకుడు వంశీ గడ్డం మాట్లాడుతూ, థర్మల్ విద్యుత్ కేంద్రాలను స్థిరంగా తొలగించడం మరియు వాటి స్థానంలో సహజంగా లభించే సౌరశక్తితో నడిచే స్టేషన్‌లను ఏర్పాటు చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని, దేశంలో సున్నా ఉద్గారాలను సాధించడం, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టడం, స్థిరమైన నెట్‌వర్క్‌ను అందించడం మరియు పర్యావరణాన్ని ఎప్పటికీ పచ్చగా ఉంచడానికి తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

భారతదేశంలో 250 ATUM Charge EV ఛార్జింగ్ స్టేషన్‌లను ప్రారంభించడంతో, దేశంలో ఈవీ పర్యావరణ వ్యవస్థకు మద్దతునిస్తామని తాము చేసిన ప్రతిజ్ఞను రుజువు చేశామని వంశీ చెప్పారు. ప్రస్తుతం, ఆటమ్ చార్జ్ ఏర్పాటు చేసిన 4 KW కెపాసిటీ సోలార్ ప్యానెళ్లు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యాన్ని అందించగలవు. అంటే, ఈ చార్జింగ్ స్టేషన్ల వద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలను (ఎలక్ట్రిక్ కార్లను) ఛార్ చేయవచ్చు. ఈ ప్యూర్ సోలార్ పవర్ తో ఈవీలను పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 6-8 గంటల సమయం పడుతుందని అంచనా.

కేవలం రూ.54,999 లకే ఆటమ్ 1.0 (ATUM 1.0) ఎలక్ట్రిక్ బైక్..
హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ కంపెనీ ఆటమ్మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ గడచిన 2020 చివరి భాగంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ "ఆటమ్ 1.0" ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ ధర కేవలం రూ.54,999 గా ఉంది. ఆటమ్ 1.0 ఒక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్. కాబట్టి, దీనిని నడపడానికి రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటి అవసరం లేవు.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అంటే, దీని రన్నింగ్ కాస్ట్ ప్రతి 100 కిలోమీటర్లకు సుమారు రూ.7-10 మాత్రమే ఉంటుంది. పెట్రోల్ వాహనాలతో పోల్చుకుంటే, ఇది దాదాపు 97 శాతం తక్కువ మెయింటినెన్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 వోల్ట్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటారును అమర్చబడి ఉంటుంది. ఇది పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క గరిష్టం వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంటుంది.

ఈ మోటార్‌సైకిల్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుందని, దీనిని స్టాండర్డ్ 3-పిన్ సాకెట్ ఉపయోగించి ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ చాలా సింపుల్ డిజైన్ ని కలిగి ఉంటుంది. చూడటానికి, ఇది పాతకాలపు కేఫ్-రేసర్ బైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ, ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఆటమ్ 1.0 బైక్ లో కంపెనీ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడి టెయిల్ లైట్, ఎల్‌ఈడి టర్న్ ఇండికేటర్స్, సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీట్, పెద్ద టైర్లు, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ (280 మి.మీ) ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కేవలం రూ.999 మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








