ఒక్క ఛార్జ్‌తో 60 కిమీ పరిధి అందించే 'Bounce Infinity E1' ఫస్ట్ రైడ్.. పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు బాగా పెరిగిపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టాయి. అంతే కాకుండా ఈ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం నిలుపుకోడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఒకటి బెంగుళూరుకి చెందిన స్టార్టప్ కంపెనీ బౌన్స్ (Bounce).

బౌన్స్ అనేది ప్రారంభంలో నిర్దిష్ట కస్టమర్‌లకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దెకు ఇచ్చే కంపెనీ. అయితే ఇప్పుడు స్వతంత్రంగా దేశీయ మార్కెట్లో ఒక ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1' (Bounce Infinity E1).
'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1' (Bounce Infinity E1) ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 60,000 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ కేవలం ఒకే వేరియంట్ లో అందుబాటులో ఉంటుంది. ఇటీవల మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేసాము, కావున ఈ స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 డిజైన్ మరియు స్టైల్:
'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1' ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది రెట్రో స్టైలింగ్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ యొక్క ముందు భాగంలో ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇందులో రెండు ప్రొజెక్టర్ యూనిట్లు హై మరియు లో బీమ్స్ నిర్వహిస్తాయి.

ఈ స్కూటర్ ప్రత్యేకమైన హ్యాండిల్‌బార్‌ను కూడా పొందుతుంది మరియు హెడ్‌ల్యాంప్ క్లస్టర్ హ్యాండిల్‌బార్‌ల పైన ఉంటుంది. బౌన్స్ E1 మినిమలిస్ట్ బాడీ లైన్‌లను కలిగి ఉంది, సైడ్ ప్యానెల్‌లలో కూడా అదే కనిపిస్తుంది. వెనుక వైపుకు వెళుతున్నప్పుడు, ఎలక్ట్రిక్ స్కూటర్ LED టైల్‌లైట్‌లను పొందుతుంది. ఇందులోని టర్న్ సిగ్నల్స్ ఇండికేటర్‌లు LED యూనిట్లు.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఫీచర్స్:
బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది స్కూటర్ గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. ఇది ట్రిప్ మీటర్స్, బ్యాటరీ లెవెల్, రేంజ్, స్పీడ్ మరియు టైమ్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్ స్వీకరించాడనికి అనుమతించే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుంది.

ఇందులోని డయల్ పెద్దదిగా ఉంటుంది, కావున చదవడానికి సులభంగా ఉండటమే కాకుండా, ఎక్కువ ఎండ సమయంలో మరియు రాత్రి సమయంలో కూడా స్పష్టంగా మరింత మెరుగైన రీడౌట్‌ల కోసం తెల్లటి బ్యాక్‌లైట్‌ని పొందుతుంది.

ఇందులో అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. కానీ ఇందులో ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ ఉంచలేరు. ఎందుకంటే ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ లో ఉంటుంది. అంతే కాకుండా, ఇది టైప్-A USB ఛార్జింగ్ సాకెట్‌ను కూడా పొందుతుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 మోటార్ పర్ఫామెన్స్, రేంజ్ మరియు రైడింగ్ ఇంప్రెషన్స్:
బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మోటార్ విషయానికి వస్తే, ఇది 2kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 2.2 kW ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని పంపుతుంది. ఈ స్కూటర్ 85 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టిపుల్ రైడ్ మోడ్‌లను పొందుతుంది. అవి పవర్, ఎకో మరియు డ్రాగ్ మోడ్స్. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో గంటకు 35 కిమీ మరియు పవర్ మోడ్‌లో గంటకు 65 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 65 కిమీ.

ఇందులోని డ్రాగ్ మోడ్ అనేది చాలా సహాయకరమైన రైడింగ్ మోడ్ మరియు మీకు పంక్చర్ అయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి డ్రాగ్ మోడ్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా మీరు స్కూటర్‌ను డ్రాగ్ చేయకుండా గంటకు 3 కిమీ వేగంతో రైడింగ్ చేయవచ్చు.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఛార్జింగ్ విషయానికొస్తే, ఇది స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా సుమారు 5 గంటల్లో ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో ఇది ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 100 నుంచి 120 నిముషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక పూర్తి ఛార్జ్ తో ఎకో మోడ్ లో 65 కిమీ మరియు పవర్ మోడ్‌లో 50 కిమీ పరిధిని అందిస్తుంది.

ప్రస్తుతం బౌన్స్ కంపెనీ బెంగళూరు నగరంలో బ్యాటరీ మార్పిడి స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా అలాంటి స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. స్వాపింగ్ సౌకర్యాలను ఉపయోగించడానికి, వినియోగదారులు దాదాపు రూ. 850 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. వినియోగదారులు సమీపంలోని స్వాపింగ్ స్టేషన్ కి వెళ్లి వినియోగించిన పాత బ్యాటరీని తీసివేసి, పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో భర్తీ చేసి, ఆపై రైడ్ చేయవచ్చు.

ఈ మొత్తం ప్రక్రియకు ఒక నిమిషం కంటే తక్కువ సమయం పడుతుంది, ఒక్క బ్యాటరీ స్వాప్ కోసం మీకు రూ. 35 మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే, కంపెనీ ఎక్కువ శ్రేణి కోసం ఫుట్‌బోర్డ్ కింద సెకండరీ బ్యాటరీని జోడించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇది రైడర్ యొక్క సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.

ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీటు విశాలంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, సీటు ముందు వైపు, సీటు సాధారణంగా ఉండే దానికంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది. కావున రైడర్ వారి కాళ్ళను కొద్దిగా వెడల్పు చేసి కూర్చోవలసి ఉంటుంది. ఇది రైడర్ కి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రైడింగ్ విషయానికి వస్తే, ఇది గట్టి సస్పెన్షన్ సెటప్ కారణంగా, స్కూటర్ రైడ్ అంత సౌకర్యంగా ఉండదు. మీరు వేగంతో వెళ్లే సమయంలో కూడా కొంత ఇబ్బందికర అనుభూతిని పొందుతారు.

హ్యాండిల్‌బార్ రైడర్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. కావున మీరు హ్యాండిల్‌బార్‌ను పూర్తిగా కుడి లేదా ఎడమ వైపుకు తిప్పినప్పుడల్లా అది మీ మోకాళ్లను తాకుతుంది. మీరు పొడవైన రైడర్ అయితే ఇది మరింత ఇబ్బందిగా ఉంటుంది. యాక్సలరేషన్ సున్నితంగా ఉంటుంది. ఇది ఇప్పటికే క్లెయిమ్ చేయబడిన గరిష్ట వేగాన్ని సులభంగా చేరుకుంటుంది.

ఇక్కడ మీరు గమనించవలసిన మరో అంశం ఏమిటంటే, మేము రైడ్ చేసిన ఈ స్కూటర్ ప్రీ-ప్రొడక్షన్ మోడల్స్. కావున కొన్ని నిగ్గల్స్ ఉన్నాయి. ఉదాహరణకు, మీరు వేగంతో ఎడమవైపు టర్న్ తీసుకుంటే సైడ్ స్టాండ్ రోడ్డు ఉపరితలాన్ని స్క్రాప్ చేస్తుంది. ఈ స్టాండ్‌ను కొత్త డిజైన్‌తో భర్తీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనితో పాటు ప్యానెల్ ఖాళీలను సరిచేయడం మరియు స్కూటర్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ వంటి వాటిని కూడా ఇది పొందుతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఎలక్ట్రిక్ వాహన యుగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ప్రజాదరణ ఉన్న సమయంలో కొనుగోలుదారులు కూడా కొంత క్రొత్తదనాన్ని కోరుకుంటారు. కావున ఇప్పుడు వాహనాల్లో కొత్తదనం అనేది ఎంతైనా అవసరం. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుత మార్కెట్ కి సరిపోయే విధంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం కొన్ని అప్డేట్స్ అవసరం,వాటిని కంపెనీ చూసుకుంటుంది.

ప్రస్తుతం బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, మంచి పనితీరుని అందిస్తుంది. అంతేహ్ కాకుండా ఛార్జింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. కావున ఇది అన్నివిధాలుగా కస్టమర్లకు అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








