భారత రోడ్లపై తిరుగుతూ కెమెరాకి చిక్కిన బిఎస్ఏ గోల్డ్‌స్టార్ 650.. మరి అఫీషియల్ లాంచ్ ఎప్పుడో..?
భారతదేశంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జావా (Jawa), యెజ్డి (Yezdi) మోటార్‌సైకిల్ బ్రాండ్లను తిరిగి మన భారతీయులకు కొత్తగా పరిచయం చేసిన క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends), ఇప్పుడు అలాంటి ఓ ఐకానిక్ క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఏఎస్ (BSA) ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. క్లాసిక్ లెజెండ్స్ గతేడాది యూకేలో ఆవిష్కరించిన 'బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650' (BSA Gold Star 650) మోటార్‌సైకిల్ ను వీలైనంత త్వరగా భారతదేశంలో విడుదల చేయాలని కంపెనీ చూస్తోంది. తాజాగా బిఎస్ఏ గోల్డ్‌స్టార్ 650 మరోసారి భారతదేశంలో పరీక్షిస్తున్నట్లు గుర్తించబడింది.

ఇటీవల గుర్తించబడిన ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్ ను కంపెనీ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా పరీక్షిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే, ఈ బైక్ టెస్టింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్పై చిత్రాలను చూస్తుంటే, ఈ మోటార్‌సైకిల్ కంపెనీ గతంలో యూకేలో ప్రారంభించబడిన అదే బిఎస్ఏ గోల్డ్ స్టార్ మోటార్‌సైకిల్ అని స్పష్టంగా తెలుస్తుంది. క్లాసిక్ లెజెండ్స్ ఈ కొత్త మోటార్‌సైకిల్ యొక్క లెజెండ్రీ క్లాసిక్ లుక్ ని అలానే కొనసాగిస్తూ అధునాతన టెక్నాలజీతో తమ కొత్త గోల్డ్ స్టార్ 650 ని పరిచయం చేసింది.

బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650 భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలో నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ మోటార్‌సైకిళ్లన్నీ 650 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ, బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మాత్రం రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ మాదిరిగా కాకుండా సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. బిఎస్ఏ గోల్డ్‌స్టార్ 650లో 652సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 44.27 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 55 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇందులో అధునాతన 6-స్పీడ్ యూనిట్‌కు బదులుగా 5-స్పీడ్ యూనిట్‌ని ఉపయోగించడం ద్వారా ఈ మోటార్‌సైకిల్ మరియు ఇంజన్ యొక్క రెట్రో స్టైల్ స్వభావాన్ని సజీవంగా ఉంచాలని కంపెనీ భావిస్తోంది. డిజైన్ అనేది వ్యక్తిగత విషయం అయినప్పటికీ, ఈ క్లాసిక్ బైక్ లుక్ చూపరుల మతి పోగడుతుంది. మనల్ని ఒక్కసారిగా ఇది చరిత్ర వైపుకు తీసుకువెళ్తుంది. ఈ క్లాసిక్ లుకింగ్ గోల్డ్ స్టార్ 650 మోటార్‌సైకిల్ రెట్రో-స్టైల్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

మొదటి చూపులోనే ఇది పాత కాలపు ఏబిఎస్ మోటార్‌సైకిళ్లను గుర్తుకు తెస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 1960 కాలం నాటి ఒరిజినల్ బిఎస్ఏ గోల్డ్‌స్టార్ బైక్ ని పోలి ఉంటుంది. ఈ 650 సిసి రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ యొక్క కొన్ని కీలకమైన డిజైన్ హైలైట్‌లను గమనిస్తే, బీహైవ్ సైడ్ ప్యానెల్‌లు, సింగిల్ పీస్ హ్యాండిల్‌బార్లు, సింగిల్ పీస్ బెంచ్ సీట్, గుండ్రటి హెడ్‌ల్యాంప్ మరియు టర్న్ ఇండికేటర్స్, ఫోర్క్ గేటర్స్, క్రోమ్ తో మెరిసిపోయే స్టీల్ స్పోక్ వీల్స్, పెద్ద రేడియేటర్ గ్రిల్ మరియు గుండ్రటి సైడ్ మిర్రర్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్ కు మరింత అందాన్ని జోడిస్తాయి.

ఈ మోటార్‌సైకిల్ లో ముందువైపు 18 ఇంచ్ స్పోక్ వీల్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ స్పోక్ వీల్ తో దీని రెట్రో లుక్ మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రీమియం లుక్ కోసం గోల్డ్ స్టార్ 650 మోటార్‌సైకిల్ చుట్టూ ఎక్కువగా క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. హెడ్‌ల్యాంప్ మొదలుకొని టెయిల్ పైప్ (సైలెన్సర్) వరకూ ఈ క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. దాని టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్ మరియు విశాలమైన ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్ ఈ బైక్ రెట్రో అప్పీల్‌ను మరింత పెంచుతాయి. ఈ డిజైన్ అంశాలలో చాలా వరకు క్లాసిక్ బోన్నెవిల్ ట్విన్స్ నుండి ప్రేరణ పొందినట్లు కూడా అనిపిస్తుంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే, బిఎస్ఏ గోల్డ్‌స్టార్ మోటార్‌సైకిల్ డ్యూయల్-క్రాడిల్, ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్ ఛాసిస్ తయారైంది. ఇందులో ముందువైపు 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో ట్విన్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్ ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్ సెటప్ మరియు వెనుకవైపు 255ఎమ్ఎమ్ సింగిల్ డిస్క్ బ్రేక్ సెటప్ ఉంటుంది మరియు రెండు వైపులా బ్రెంబో కాలిపర్‌లు ఉంటాయి.

బిఎస్ఏ గోల్డ్ స్టార్ రెట్రో లుక్స్ కలిగి ఉన్నప్పటికీ, కంపెనీ ఇందులో ప్రస్తుత తరానికి అవసరమైన అన్ని అధునాతన ఫీచర్లను అందిస్తోంది. ఇందులో ఎల్‌సిడి డిస్‌ప్లే, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, స్లిప్పర్ క్లచ్, యూఎస్‌బి ఛార్జర్, ఎల్ఈడి టెయిల్‌లాంప్ మరియు మరెన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ బ్రిటిష్ టూవీలర్ బ్రాండ్‌ను క్లాసిక్ లెజెండ్స్ (భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా యాజమాన్యంలో ఉన్న అనుబంధ సంస్థ) నిర్వహిస్తోంది.

బిఎస్ఏ బ్రాండ్ విషయానికి వస్తే, ఈ కంపెనీ ప్రారంభంలో ఆయుధాలు మరియు సాధనాల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత ఇది ద్విచక్ర వాహన పరిశ్రమలో అతిపెద్ద పేర్లలో ఒకటిగా మారింది. అయితే, బ్రిటీష్ కంపెనీ పేలవమైన నిర్వహణ కారణంగా ఈ బ్రాండ్ దేశంలో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. దీంతో భారీ నష్టాల బాట పట్టింది, ఇక చేసేది లేక ఈ కంపెనీ తట్టాబుట్టా సర్దేసుకుని లండన్ వెళ్లిపోయింది. మహీంద్రా మరియు క్లాసిక్ లెజెండ్స్ సంస్థలు కలిసి ఇప్పుడు ఈ పురాతన టూవీలర్ బ్రాండ్లకు జీవం పోస్తున్నాయి. మరి ఇది భారత మార్కెట్లో ఎంత మేర సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
Source:zigwheels


Click it and Unblock the Notifications








