సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 vs కెటిఎమ్ 250 అడ్వెంచర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్, భారతదేశంలో తమ సరికొత్త "సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250" (Suzuki V-Storm SX 250) అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇది ఈ విభాగంలో నేరుగా కెటిఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure) బైక్‌తో పోటీ పడుతుంది. ఈ కంపారిజన్‌లో ఈ రెండు మోటార్‌సైకిళ్ల డిజైన్, ఇంజన్, ఫీచర్లు, హార్డ్‌వేర్ మరియు ధరల గురించి తెలుసుకుందాం. అలాగే, ఈ రెండు మోడళ్లలో ఏ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఎక్కువగా ధరకు తగిన ప్రయోజనాన్ని అందిస్తుందో చూద్దాం రండి.

సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 vs కెటిఎమ్ 250 అడ్వెంచర్: డిజైన్
ఇవి రెండూ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు కాబట్టి ఇవి, చాలా తక్కువ బాడీ ప్యానెళ్లను కలిగి ఉండి, సన్నగా మరియు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. టూవీలర్ డిజైన్ అనేది చాలా సబ్జెక్టివ్ మ్యాటర్, ఒక్కొక్క డిజైన్‌పై ఒక్కొక్కరి అభిప్రాయం చాలా భిన్నంగా ఉండొచ్చు. ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా చాలా ప్రత్యేకమైన మరియు ఐకానిక్ డిజైన్‌లను కలిగి ఉంటాయి. వీటిలో సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 కొత్తగా వచ్చి మోడల్ కాబట్టి దాని డిజైన్ చాలా రిఫ్రెష్డ్ గా కనిపిస్తుంది.

నిజానికి సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 మంచి రోడ్ ప్రజెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ డిజైన్ చాలా షార్ప్‌గా ఉంటుంది మరియు దాని అష్టభుజి ఆకారపు (ఆక్టాగనల్ షేప్) ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ ఈ మోటార్‌సైకిల్‌కు మరింత ప్రత్యేక స్టైలింగ్‌ను అందిస్తుంది. అలాగని, కెటిఎమ్ 250 అడ్వెంచర్ డిజైన్ తక్కువేమీ కాదు, ఇది చాలా షార్ప్ డిజైన్ లాంగ్వేజ్‌తో తయారు చేయబడింది. ఇందులో పాక్షికంగా కనిపించే ట్రెల్లిస్ ఫ్రేమ్ ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌కు మరింత ప్రీమియం అప్పీల్‌ని ఇస్తుంది.

సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 vs కెటిఎమ్ 250 అడ్వెంచర్: ఫీచర్లు
ఫీచర్ల విషయానికొస్తే, సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్. డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, ఫ్రండ్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, అల్లాయ్ వీల్స్, సుజుకి రైడ్ యాప్ కనెక్టివిటీతో కూడిన పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఈ లేటెస్ట్ అడ్వెంచర్ బైక్ సొంతం. ఇందులోని స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ సాయంతో టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, SMS అలర్ట్, WhatsApp అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్, హై స్పీడ్ అలెర్ట్, ఫోన్ బ్యాటరీ లెవల్ ఇండికేటర్ వంటి ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.

వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250లో లభించే ఫీచర్ల పరంగా పోల్చి చూస్తే, కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఈ రేసులో వెనుకబడి ఉంటుంది. ఇందులో సుజుకి V-Storm SX 250 బైక్‌లో లభించే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ లేదు. కెటిఎమ్ 250 అడ్వెంచర్ ఫుల్ కలర్ ఎల్‌సిడి డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు మరియు అల్లాయ్ వీల్స్ వంటి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.

సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 vs కెటిఎమ్ 250 అడ్వెంచర్: హార్డ్‌వేర్
హార్డ్‌వేర్ విషయానికొస్తే, ఈ సుజుకి అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు ఆఫ్-రోడ్‌కు అనుగుణంగా ఉండే 19 ఇంచ్ అల్లాయ్ వీల్ మరియు వెనుకవైపు 17 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది. అలాగే, ఇందులో ముందు వైపు కొంచెం పొడవైన వీల్ ట్రావెల్‌తో కూడిన టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుక వైపు 7-దశలగా ప్రీ-లోడ్‌ను సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

ఇక కెటిఎమ్ అందిస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇందులో ముందువైపు 43 మిమీ డబ్ల్యూపి అపెక్స్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లు, వెనుకవైపు సర్దుబాటు చేయగల డబ్ల్యూపి అపెక్స్ మోనోషాక్ సస్పెన్షన్, ధృడమైన ట్రెల్లిస్ ఫ్రేమ్ మరియు పెద్ద 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ (సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250లో 12 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది) వంటి భాగాలు ఉన్నాయి. మెకానికల్ హార్డ్‌వేర్ పరంగా ఈ పోటీలో కెటిఎమ్ 250 మెరుగైన హార్డ్‌వేర్‌తో మరింత ప్రీమియం మోటార్‌సైకిల్‌గా ఉంటుంది.

సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 vs కెటిఎమ్ 250 అడ్వెంచర్: ఇంజన్
ఇవి రెండూ కూడా 250సిసి సామర్థ్యం కలిగిన ఇంజన్లే. అంతర్జాతీయ మోడల్ సుజుకి వి-స్టార్మ్ 250 (Suzuki DL250 AL, Suzuki DL250 AM) బైక్‌లో విదేశీ మోడల్ అయిన సుజుకి ఇనాజుమా 250 బైక్‌లో ఉపయోగించిన పారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 24 బిహెచ్‌పి శక్తిని మరియు 22 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, భారతదేశంలో కొత్తగా విడుదల చేసిన సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 అడ్వెంచర్ బైక్‌లో కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న సుజుకి జిక్సర్ 250 బైక్‌లో ఉపయోగించిన అదే 249 సిసి, సింగిల్-సిలిండర్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు.

కాకపోతే, సుజుకి దీనిని వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 డిజైన్‌కి అనుగుణంగా రీట్యూన్ చేసింది. ఇప్పుడు ఈ ఇంజన్ 26.5 బిహెచ్‌పి శక్తిని మరియు 22.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఇక కెటిఎమ్ 250 అడ్వెంచర్ విషయానికి వస్తే, దీని ఇంజన్ మరింత శక్తివంతమైనదిగా ఉంటుంది. ఇందులోని అధునాతనమైన 249సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి ఇంజన్ 29.63 బిహెచ్‌పి శక్తిని మరియు 24 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది మరియు ఇందులో స్లిప్పర్ క్లచ్‌ను కూడా ఉంటుంది.

సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 vs కెటిఎమ్ 250 అడ్వెంచర్: ధరలు
చివరిగా ధరల విషయానికిస్తే, సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 ధర రూ. 2.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంటే, కెటిఎమ్ 250 అడ్వెంచర్ ధర రూ. 2.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంటుంది. ఇక ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే.. ధర మరియు ఫీచర్ల పరంగా సుజుకి అడ్వెంచర్ బైక్ ముందంజలో ఉంటే, హార్డ్‌వేర్ మరియు ఇంజన్ పరంగా కెటిఎమ్ అడ్వెంచర్ బైక్ ముందంజలో ఉంటుంది.


Click it and Unblock the Notifications








