టూవీలర్ల సేఫ్టీ కోసం అధునాతన టెక్నాలజీని రూపొందించిన కాంటినెంటల్.. అదేంటి? ఎలా పనిచేస్తుంది?
కార్లలో ప్రయాణించే వారికి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి మాత్రం, వారి గమ్యం చేరుకునే వరకు అడుగడునా గండాలే ఉంటాయి. మనదేశంలో కార్లలో తిరిగే వారి కన్నా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. సరసమైన ధరలు, అధిక మైలేజ్, రద్దీగా ఉండే రోడ్లు, పార్కింగ్ సమస్య ఇలాంటి అనేక కారణాల వలన ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలకే ప్రధాన్యత ఇస్తుంటారు.
మరి టూవీలర్లు మరియు వాటిని నడిపే రైడర్లకు సేఫ్టీ ఎలా? సరిగ్గే ఇదే ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్ కాంటినెంటల్ (Continental). అదేంటి మరియు ఎలా పనిచేస్తుందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఆటోమోటివ్ రంగంలో టెక్నాలజీకి పెద్దపీట వేయబడింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వలన ప్రస్తుతం మనం వినియోగిస్తున్న వాహనాలు కూడా చాలా అధునాతనంగా మరియు అత్యంత సురక్షితంగా మారాయి. కొన్ని ప్రీమియం ద్విచక్ర వాహనాలలో ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, స్లిప్ అసిస్ట్, ఏబిఎస్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, సాధారణ మోటార్‌సైకిళ్లను కూడా సురక్షితమైన మోటార్‌సైకిళ్లుగా మార్చేందుకు కాంటినెంటల్ ఇండియా (Continental India) ఓ అధునాతన టెక్నాలజీని అభివృద్ధి చేసింది మరియు దానిని మీడియాకు ప్రదర్శించింది.

మోటార్‌సైకిళ్ల వలన జరిగే ప్రమాద తీవ్రతలను బట్టి, వీటిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రవాణా మార్గాలలో ఒకటిగా పరిగణిస్తుంటారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే రైడర్ లేదా పిలియన్ రైడర్‌కు కార్ల మాదిరిగా బాహ్య షెల్ ద్వారా రక్షణ ఉండదు. అలాగే, ద్విచక్ర వాహనదారులు అన్ని సందర్భాలలో టూవీలరపై తమను తాము నిటారుగా ఉంచుకోలేరు. ఫలితంగా, ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే టూవీలర్ ప్రయాణీకులకు సేఫ్టీ అనేది చాలా అవసరం అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంలో కాంటినెంటల్ ఇండియా అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ చాలా గొప్పదని చెప్పవచ్చు.

కాంటినెంటల్ ఇండియా అనేది ఓ గ్లోబల్ ఆటోమోటివ్ టెక్ బ్రాండ్ మరియు OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్) సరఫరాదారు అయిన కాంటినెంటల్ ఏజి (Continental AG) యొక్క భారతీయ అనుబంధ సంస్థ. కాంటినెంటల్ దాని విప్లవాత్మక సాంకేతికతకు ప్రసిద్ధి చెందింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది తయారీదారులకు అనేక రకాల విడిభాగాలను సరఫరా చేస్తుంది. ఈ బ్రాండ్ గతంలో కూడా ద్విచక్ర వాహనాల కోసం అనేక భాగాలను ఉత్పత్తి చేసినప్పటికీ, ఇటీవలి కాలంలో టూవీలర్ల భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, కాంటినెంటల్ ఇండియా 2-వీలర్ టెక్‌డ్రైవ్‌ను నిర్వహించింది.

బెంగుళూరు శివార్లలోని హోసూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ విమానాశ్రయం తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్‌లో కాంటినెంటల్ ఇండియా ఈ టూ వీలర్ టెక్‌డ్రైవ్‌ను నిర్వహించింది. ఈ టెక్నాలజీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం రోడ్డుపై టూవీలర్ జారిపోకుండా ఉండటం మరియు వేగంతో కూడిన మలుపుల వద్ద కూడా రైడర్ కు మంచి బ్యాలెన్స్ అందించడం. ఇందులో భాగంగా, కాంటినెంటల్ ఇంజనీర్లు రూపొందించిన స్కిడ్‌ప్యాడ్‌తో, రన్‌వేపై తమ టూవీలర్ సేఫ్టీ టెక్నాలజీని దేశంలోని ప్రధాన ద్విచక్ర వాహన తయారీదారులకు ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.

ఈ టెక్ డ్రైవ్ ప్రదర్శనలో భాగంగా, రన్‌వే పక్కన ఏర్పాటు చేసిన పెద్ద పెవిలియన్‌లో, వివిధ ఉత్పత్తులపై పనిచేసిన కాంటినెంటల్‌కు చెందిన వివిధ బృందాలు, ఈ బ్రాండ్ అభివృద్ధి చేసిన మాడ్యూల్స్ మరియు హార్డ్‌వేర్‌లను కూడా ప్రదర్శించాయి. ఈ పెవిలియన్‌లో కాంటినెంటల్ టైర్ల నుండి సీట్ ఉపరితలాలపై ఉపయోగించే పదార్థాల వరకు మరియు ఈసియూ మాడ్యూల్స్ నుండి కార్బన్-ఇన్ఫ్యూజ్డ్ టైమింగ్ బెల్ట్‌ల వరకు అనేక రకాల విడిభాగాలను ప్రదర్శించారు.

వేసవి సీజన్ కోసం కాంటినెంటల్ సర్ఫేస్ సొల్యూషన్స్ ఒక ప్రత్యేకమైన సీట్ సర్ఫేస్ (సీటు పైభాగంలో ఉపయోగించే సీట్ కవర్ లాంటి మెటీరియల్)ను ప్రదర్శించింది. ఇది తక్కువ వేడిని మాత్రమే గ్రహిస్తుంది, ఇలాంటి ఫీచర్ ఎండలు ఎక్కువగా ఉండే వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశంలో ఇంకా విక్రయించబడని కొన్ని టైర్లను కూడా బ్రాండ్ ప్రదర్శించింది. చూడటానికి ఈ టైర్లు స్కూటర్‌లకు సరైన పరిమాణంలో ఉన్నట్లు కనిపించాయి. ఒకవేళ భారతదేశంలో టూవీలర్ తయారీదారులు వీటిపై ఆసక్తి చూపినట్లయితే, కంపెనీ వీటిని భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉంది.

ఇవే కాకుండా, కాంటినెంటల్ ఇండియా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ మరియు టూ-వీలర్ భాగాల శ్రేణిని కూడా ప్రదర్శించింది. ఇందులో సింక్రోఫోర్స్ కార్బన్ బెల్ట్, సింక్రోచైన్ కార్బన్ బెల్ట్, జెనరిక్ వెహికల్ కంట్రోల్ యూనిట్, టిఎఫ్‌టి డిస్‌ప్లే సొల్యూషన్స్, డయాగ్నస్టిక్ సొల్యూషన్స్, హైబ్రిడ్ డిస్‌ప్లే సొల్యూషన్స్, కీ సొల్యూషన్స్, ఇంజన్ స్పీడ్ సెన్సార్, వీల్ స్పీడ్ సెన్సార్‌లు మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంజి కాబట్టి, కాంటినెంటల్ ఇండియా దాని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు, టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్, డిజిటల్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్, డిఫ్లేషన్ డిటెక్షన్ సిస్టమ్ మొదలైనవాటిని కూడా ఈ టెక్ డ్రైవ్‌లో ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో మేము పరీక్షించిన సాంకేతికతల విషయానికి వస్తే, ఇందులో ABS, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఆప్టిమైజ్డ్ కర్వ్ బ్రేకింగ్, లేన్ చేంజ్ అసిస్ట్ మరియు అడ్వాన్స్‌డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ARAS) మొదలైవి ఉన్నాయి.

ఏబిఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్
ముందుగా మేము కాంటినెంటల్ యొక్క ABS మరియు ట్రాక్షన్ కంట్రోల్ టెక్నాలజీలను పరీక్షించాము. ప్రస్తుతం, మన మార్కెట్లో లభిస్తున్న అనేక మిడ్-రేంజ్ మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లలో కూడా ఇలాంటి ఏబిఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కాంటినెంటల్ ఇండియా మాత్రం ఈ టెక్నాలజీని తదుపరి స్థాయి (నెక్స్ట్ లెవల్)కి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా, ఈ బ్రాండ్ రెండు సాంకేతికతలను అనుసంధానించే ఓ కొత్త హార్డ్‌వేర్‌ను అభివృద్ధి చేసింది మరియు ఇది ద్విచక్ర వాహన ప్రపంచంలో ఇదివరకెన్నడూ చేయనిది.

కాంటినెంటల్ యొక్క అధునాతన ABS హార్డ్‌వేర్ మూడు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. అత్యంత ప్రాథమిక కాన్ఫిగరేషన్‌లో ఒకే-ఛానల్ సిస్టమ్ ఉంటుంది, అయితే టాప్-స్పెక్ మోడల్‌లో ఇంటిగ్రేటెడ్ ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటు అదే యూనిట్‌లో IMU (ఇనర్షియా మెజర్‌మెంట్ యూనిట్) కూడా ఉంటుంది. కాగా, మేము మిడ్-రేంజ్ యూనిట్‌ని పరీక్షించాము. ఇదొక డ్యూయెల్-ఛానల్ ABS యూనిట్ మరియు ఇందులో ట్రాక్షన్ కంట్రోల్‌ని కూడా విలీనం చేసారు. ఇది బాహ్య IMUని నిర్వహించగల సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది మరియు ఇది ABSని కార్నర్ చేయడం వంటి లక్షణాలను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది.

ఈ ఫీచర్‌ను పరీక్షించేందుకు మేము రన్‌వేపై ఓ శక్తివంతమైన (45 బిహెచ్‌పి పవర్ జనరేట్) చేసే 500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ కలిగిన ఓ స్కూటర్‌ను నడిపి చూశాము. ఈ ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్ ఫీచర్లను సమర్థవంతంగా పరీక్షించాలంటే, రోడ్డుపై వాహనం జారుతూ ఉండాలి కాబట్టి, ఆ పరిస్థితులను సృష్టించేందుకు నిర్వాహకులు రన్‌వేపై నిరంతరం నీటితో స్ప్రే చేశారు. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయడంతో, స్కూటర్ దాని వెనుక చక్రంలో ట్రాక్షన్ కోల్పోయి, నిరతంరం తిరుగుతూనే ఉంది. అయితే, కాంటినెంటల్ అభివృద్ధి చేసిన ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ని ఆన్ చేసి రోడ్డుపై జారకుండా ముందుకు సాగిపోయింది.

రోడ్డుపై నేరుగా వెళ్తున్నప్పుడు స్కూటర్ ఒక్కసారి కూడా ట్రాక్షన్ కోల్పోకుండా చాలా త్వరగా వేగాన్ని అందుకుంది. ఇక ఇందులో తదుపరిది ఏబిఎస్ పరీక్ష. ట్రాక్షన్ కంట్రోల్‌ని పరీక్షిస్తున్నప్పుడు, మేము నడిపిన మాక్సీ-స్కూటర్ ను చాలా సార్లు బ్రేక్‌లు వేసి చూశాము. ఏబిఎస్ ఫీచర్ ఆన్ లో ఉన్నంత వరకూ స్కూటర్ రోడ్డుపై ఎక్కడా జారలేదు. ఎప్పుడైతే, ఈ ఫీచర్ ను ఆఫ్ చేశామో ఆ వెంటనే స్కూటర్ రోడ్డు పైనుండి పక్కకు జారిపోవడం జరిగింది. ఏబిఎస్ ఆపివేయబడినందున, స్కూటర్ యొక్క బ్రేక్‌లు లాక్ చేయబడ్డాయి. ఇక ఈ రెండు ఫీచర్లను ఏకకాలంలో ఉపయోగించినప్పుడు ఎంతటి జారుడు రోడ్డు అయినా సరే, సురక్షితంగా ప్రయాణించవచ్చని ఇది రుజువు చేసింది.

కార్నరింగ్ ABS & ARAS
టూవీలర్లలో కార్నరింగ్ ఏబిఎస్ అనేది ఇప్పుడు లభిస్తున్న ఓ అధునాతన సేఫ్టీ ఫీచర్. పేరుకు తగినట్లుగానే ఈ ఫీచర్ మలుపులతో కూడిన రోడ్డుపై సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఉపయోగించబడుతుంది. కాంటినెంటల్ ఇండియా ఈ టెక్నాలజీని పరీక్షించడానికి, సాధారణ హైవేలను కాకుండా విమానాశ్రయాపు రన్‌వేని ఎందుకు ఎంచుకుందో మొదట్లో మాకు అర్థం కాలేదు. అయితే, హ్యాండిల్ బార్‌పై చేయివేసి, ఈ ఫీచర్ ను పరీక్షించడం మొదలుపెట్టినప్పుడు కాంటినెంటల్ యొక్క మోటో ఏంటో మాకు అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి సిస్టమ్‌ను నిజంగా పరీక్షించడానికి రైడర్‌లకు విశాలమైన రోడ్ అవసరం.

ఈ టెక్నాలజీలో మొదటిది కార్నరింగ్ ఏబిఎస్ సిస్టమ్ లేదా కాంటినెంటల్ భాషలో ఆప్టిమైజ్డ్ కర్వ్ బ్రేకింగ్. అంటే, మోటార్‌సైకిల్‌పై అధిక వేగంతో మలుపుల వద్ద ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే రైడర్ తన ద్విచక్ర వాహనంపై కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఈ టెక్నాలజీ టెస్టింగ్ కోసం కాంటినెంటల్ ఉపయోగించిన మోటార్‌సైకిల్ ఒక ప్రసిద్ధ సూపర్‌స్పోర్ట్ బైక్ మరియు దీనికి క్రాష్ జరగకుండా చూసేందుకు ఇరువైపులా ఓ రిగ్‌ను కూడా అమర్చారు.

సాధారణంగా ఎవరైనా మోటార్‌సైకిల్‌పై కార్నరింగ్ చేసేటప్పుడు (మలుపు వద్ద ప్రయాణించేటప్పుడు) వేగాన్ని తగ్గించేందుకు గేర్ డౌన్ చేసి, యాక్సిలరేటర్ తగ్గించి, క్లచ్ పట్టుకొని బ్రేక్ నొక్కడం జరుగుతుంది. అయితే, ఈ ఫీచర్‌ను పకరీక్షించేందుకు మేము మోటార్‌సైకిల్‌ను గంటకు 60-70 కిమీ వేగంతో నడుపుతూ, ఆపై క్లచ్‌ని లాగి, అదే వేగంతో కార్నర్‌లోకి ప్రవేశించి, ఆపై బ్రేకులను బలంగా నొక్కాల్సి ఉంటుంది. మొదటి రెండు మూడు ప్రయత్నాలలో మేము దీనిని సమర్థవంతంగా పరీక్షించలేకపోయాము. అయితే, కొన్ని ప్రయత్నాల తర్వాత, మేము కార్నర్ ఎంట్రీని సరిగ్గా చేయగలిగాము.

ఈ విషయంలో కాంటినెంటల్ యొక్క ఆప్టిమైజ్డ్ కర్వ్ బ్రేకింగ్ చేసిన వ్యత్యాసం మమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంది. మేము రైడ్ చేసిన బైక్ లో కాంటినెంటల్ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత లేకుండా ఉన్నట్లయితే, ఇంజన్ బ్రేకింగ్ మరియు బ్రేకింగ్ లేకుండా ఆ వేగంతో ఒక కార్నర్ లోకి ప్రవేశించడం కోసం చేసిన ప్రయత్నాలు ఖచ్చితంగా భారీ క్రాష్‌కు దారి తీస్తాయని మాత్రం చెప్పగలము. ఈ సిస్టమ్ జడత్వ కొలత (ఇనెర్షియల్ మెజర్) యూనిట్ సహాయంతో పనిచేస్తుంది మరియు మలుపు వద్ద బైక్ వాలే కోణాన్ని బట్టి బ్రేకింగ్ ఒత్తిడిని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. ఉదాహరణకు, దాదాపు బైక్ 40-డిగ్రీల లీన్ యాంగిల్‌లో ఉంటే, ఏబిఎస్ ద్వారా బ్రేకింగ్ ప్రెజర్ అత్యల్పంగా ఉంటుంది. అదే 30-డిగ్రీల వద్ద ఉంటే, బ్రేకింగ్ శక్తి పెరుగుతుంది మరియు 15-డిగ్రీల కంటే తక్కువ కోణంలో అయితే ఇది చాలా గరిష్టంగా ఉంటుంది.

ప్రస్తుతం, ఇలాంటి టెక్నాలజీలు పెద్ద, శక్తివంతమైన మరియు అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి తక్కువ సామర్థ్యంతో కూడా ద్విచక్ర వాహనాలలో కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరం. సరసమైన మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లలో ఇలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో కాంటినెంటల్ తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది.

అధునాతన రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్స్
మాస్ మార్కెట్లో ఎక్కువగా ఉపయోగించబడే మెయిన్ స్ట్రీమ్ మోటార్‌సైకిళ్లను టెక్నాలజీ పరంగా తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు కూడా కాంటినెంటల్ ఇండియా ప్రయత్నిస్తోంది. బ్లైండ్ స్పాట్‌లో వాహనాలు నడిపేవారిని హెచ్చరించడానికి ముందు మరియు వెనుక రాడార్‌తో కూడిన డుకాటి మల్టీస్ట్రాడా మరియు ట్రయంఫ్ టైగర్ వంటి లగ్జరీ మోటార్‌సైకిళ్ల గురించి మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా, కాంటినెంటల్ అటువంటి అధునాతన సాంకేతికతను సరసమైన భారతీయ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిళ్లలో కూడా విజయవంతంగా అమలు చేసింది మరియు ఈ సాంకేతికత వాస్తవ-ప్రపంచ హైవే వేగంతో ప్రదర్శించబడింది.

రియర్ వ్యూ మిర్రర్లపై అమర్చిన ఎల్ఈడి స్ట్రిప్స్ బ్లైండ్ స్పాట్‌లో వాహనం నడిపేవారిని హెచ్చరిస్తాయి.
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు సమీపంలో అమర్చిన ఎల్‌ఈడి స్ట్రిప్ తక్కువ వేగంతో వెళ్తున్న వాహనాన్ని నడిపేవారిని హెచ్చరిస్తుంది. అలాగే, వెనుక వైపున ఒక ప్రకాశవంతమైన ఎల్ఈడి లైట్ ఉంటుంది, అది వేగంగా వస్తున్న వాహనానల గురించి రైడర్‌ను హెచ్చరించడానికి చాలా వేగంగా మెరుస్తూ ఉంటుంది. ఇలాంటి అధునాతన టెక్నాలజీలు తప్పనిసరిగా రైడర్లకు మోటార్‌సైకిల్‌ను నడపడం మరింత సురక్షితంగా మారుస్తాయి. సాధారణ మోటార్‌సైకిళ్లలో ఈ సాంకేతికతలను అమలు చేయడంలో కాంటినెంటల్ ఇండియా ఇతర పోటీదారుల కంటే ఖచ్చితంగా ముందంజలో ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








