ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపటానికి అయ్యే ఖర్చు కిలోమీటరుకు 14 పైసలు మాత్రమే.. అమేజింగ్ కదూ..!!
మనదేశంలో దాదాపు 137 రోజుల తర్వాత మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరల పెంపు జోలికి రాని చమురు కంపెనీలు, ఇప్పుడు ఒక్కసారిగా వినియోగదారుల జేబులను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 2021 తర్వాత పెట్రోల్ ధరలను పెంచడం ఇదే మొదటిసారి. తాజాగా లీటరు పెట్రోల్ పై 80 పైసలు ధర పెరిగింది. దీంతో చాలా రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.111 దాటిపోయింది. ఇది ఇంతటితో ఆగదని, రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత నుండి పెట్రోల్ ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి. దీంతో వినియోగదారులు ఇప్పుడు పెట్రోల్ ద్విచక్ర వాహనాలకు స్వస్తి పలికి, ఎలక్ట్రిక్ టూవీలర్లపై వైపు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఒక్కసారిగా జోరందుకుంది. ఈ డిమాండ్ కు తగినట్లుగా తయారీదారులు కూడా కొత్త కొత్త ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు.

తాజాగా, క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) అనే ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ సంస్థ "క్రేయాన్ ఎన్వీ" (Crayon Envy) పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 64,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (గంటకు 25 కిమీ టాప్ స్పీడ్) అని, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపటానికి రిజిస్ట్రేషన్ కానీ లేదా లైసెన్స్ కానీ అవసరం లేదని కంపెనీ తెలిపింది.

క్రేయాన్ మోటార్స్ ఇదివరకు క్రాయన్ స్నో ప్లస్ (Crayon Snow+) అనే లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. కాగా, కంపెనీ ఇప్పుడు తమ ప్రోడక్ట్ లైనప్ ను మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త క్రేయాన్ ఎన్వీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టింది. క్రేయాన్ ఎన్వీ ఈవీ (Crayon Envy EV) కంపెనీ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసింది, ఇందులో వైట్, బ్లాక్, బ్లూ మరియు సిల్వర్ కలర్స్ ఉన్నాయి.

క్రేయాన్ ఎన్వీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెద్ద బూట్ స్పేస్, కీలెస్ స్టార్ట్ మరియు రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫార్వర్డ్ మరియు బ్యాక్‌వర్డ్ స్వింగ్ కూడా ఉంటుంది, ఈ ఫీచర్ సాయంతో టూవీలర్ ను పార్కింగ్ నుండి సులువుగా తీసేందుకు సహాయపడుతుంది. క్రేయాన్ ఎన్వీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ మరియు కంట్రోలర్ పై కంపెనీ 24 నెలల వారంటీని కూడా అందిస్తోంది. దీనిపై ప్రోడక్ట్ వారంటీ కంపెనీ పాలసీ ప్రకారం ఉంటుంది.

క్రేయాన్ మోటార్స్ కు ప్రస్తుతం దేశంలో 100 కు పైగా రిటైల్ లొకేషన్లు ఉన్నాయి. తమ రిటైల్ లొకేషన్స్ ద్వారా కంపెనీ ఈ ఇ-స్కూటర్ ను డెలివరీ చేయనుంది. క్రేయాన్ ఎన్వీ ఇ-స్కూటర్ రన్నింగ్ కాస్ట్ కిలోమీటరుకు 14 పైసలుగా మాత్రమే ఉంటుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఇందులో అందిస్తున్న టెక్నికల్ ఫీచర్లను గమనిస్తే, క్రేయాన్ ఎన్వీలో జియో ట్యాగింగ్, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంకా ఇందులో డిజిటల్ స్పీడోమీటర్ మరియు మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వబడింది. ఇక డిజైన్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ హెడ్‌లైట్లు ఉపయోగించబడ్డాయి మరియు దీని డిజైన్ మృగరాజు అయిన సింహం నుండి ప్రేరణ పొందిందని కంపెనీ తెలిపింది. లైట్ మొబిలిటీ అవసరాల కోసం రూపొందించబడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ కు సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ను కూడా అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇక అసలు విషయానికి వస్తే, అదేనండీ ఇ-స్కూటర్ రేంజ్ విషయానికి వస్తే, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, ఇది వాస్తవ ప్రపంచంలో 100-120 కిలోమీటర్ల మధ్యలో ఉండొచ్చని అంచనా. క్రేయాన్ ఎన్వీ యొక్క గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఇందులో 250 వాట్ బిఎల్‌డిసి (బ్రష్ లెస్ డిసి) మోటార్ ఉపయోగించబడింది.

క్రేయాన్ ఎన్వీ ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. క్రేయాన్ మోటార్స్ కు ప్రస్తుతం ఘజియాబాద్ లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ప్లాంట్ ఉంది. ఇదే ప్లాంట్ లోనే స్నో ప్లస్ మరియు ఎన్వీ మోడళ్లు తయారవుతున్నాయి. భవిష్యత్తులో ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ నుండి మరిన్ని ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

క్రేయాన్ స్నో ప్లస్ (Crayon Snow+) ధర రూ.64,000
క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) విడుదల చేసిన కొత్త స్నో ప్లస్ (Snow+) ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా కంపెనీ రూ. 64,000 (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయిస్తుంది. ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉండి, ట్రెడిషనల్ వెస్పా స్కూటర్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్‌తో సెంట్రల్ లాకింగ్, మొబైల్ కోసం యూఎస్‌బి ఛార్జింగ్, యాంటీ థెఫ్ట్, జియో ట్యాగింగ్ మరియు జిపిఎస్ నావిగేషన్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








