ఇ-స్కూటర్ల కొనుగోలుపై ఉచితంగా యాక్ససరీలను అందిస్తున్న హాప్ ఎలక్ట్రిక్ (Hop Electric)
రాజస్థాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility), దేశీయ విపణిలో హాప్ లియో (HOP LEO) మరియు హాప్ లైఫ్ (HOP LYF) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం మార్చి నెలాఖరు వరకు ఉచిత యాక్సెసరీలను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండింటిలో ఏదైనా ఒక స్కూటర్ కొత్తగా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

హాప్ ఎలక్ట్రిక్ గతేడాది జూన్ నెలలో భారత మార్కెట్లో లియో, లైఫ్ ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఇవి రెండూ కూడా ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటారుతో లభిస్తాయి. ఇవి 72 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 125 కి.మీ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో హాప్ లియో స్కూటర్ ధర రూ. 72,500, కాగా హాప్ లైఫ్ స్కూటర్ ధర రూ. 65,000 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. వీటిలో 19.5 లీటర్ల బూట్ స్పేస్, ఇంటర్నెట్, జిపిఎస్, మొబైల్ యాప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్లు 180 కిలోల లోడింగ్ సోమర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కలిగి ఉన్నాయి. ఇంకా వీటిలో ఆటోమేటిక్ లాకింగ్, సెన్సార్, రివర్స్ గేర్, యూఎస్‌బి ఛార్జింగ్, రిమోట్ కీ, యాంటీ-థెఫ్ట్ అలారం మరియు యాంటీ-థెఫ్ట్ వీల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

వీటికి అదనంగా, ఇవి ఇంటర్నెట్ మరియు జిపిఎస్ కనెక్టివిటీతో కూడా లభిస్తాయి. ఈ ఫీచర్ల సాయంతో కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ ను స్కూటర్ తో అనుసంధానం చేసుకోవచ్చు మరియు జియో ఫెన్సింగ్, లైవ్ లొకేషన్ వంటి వివిధ రకాల ఫీచర్లను కూడా పొందవచ్చు. ఇదిలా ఉంటే, రానున్న వారాల్లో కంపెనీ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్తగా అప్‌డేట్ చేయబడిన వెర్షన్లను విడుదల చేయాలని చూస్తోంది. ఇవి రెండూ కూడా మరింత మెరుగైన బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉండనున్నాయి.

హాప్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల రన్నింగ్ ఖర్చు ప్రతి కిలోమీటరుకు కేవలం 20 పైసలు మాత్రమే ఉంటుందని, ఇది పెట్రోల్ తో నడిచే స్కూటర్లతో పోలిస్తే, చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మరికొద్ది రోజుల్లోనే మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కూడా ఉండబోతోంది. వచ్చే 3 ఏళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

తాజాగా, కంపెనీ తమ సరికొత్త హాప్ ఆక్సో (HOP OXO) ఎలక్ట్రిక్ మోటార్ కోసం ఓ టీజర్ ను కూడా విడుదల చేసేంది. ఈ టీజర్ చిత్రాలను బట్టి చూస్తుంటే, ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగం ఇది హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ ముందు భాగాన్ని ప్రతిబింబించే శైలిని కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన అన్ని నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని కంపెనీ ప్రకటించింది.

హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు సరికొత్త హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా అమ్మకానికి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి, ఇంకా పేరు నిర్ధారించబడిన ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ లో పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. అయితే, Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ మాత్రం తక్కువ రేంజ్ సామర్థ్యంతో వస్తుందని భావిస్తున్నారు. ఇది పూర్తి ఛార్జింగ్ పై సుమారు 120 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేయగలదని సమాచారం. ఇది ఈ విభాగంలో రివోల్ట్ ఆర్‌వి300/400 వంటి ఎలక్ట్రిక్ బైక్ లకు పోటీగా ఉంటుందని అంచనా.

హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తమ ఇ-టూవీలర్ బిజినెస్ ప్రయాణాన్ని 2019లో ప్రారంభించింది. దాదాపు రెండు సంవత్సరాల పరిశోధన మరియు అభివృద్ధి తర్వాత, కంపెనీ జైపూర్‌లో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. హాప్ ఎలక్ట్రిక్ ఉత్పత్తి సౌకర్యం కూడా ఈ పింక్ సిటీలోనే ఉంది. దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయబడి ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని 12 రాష్ట్రాల్లోని 54 నగరాల్లో సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ని కలిగి ఉంది.

అదనంగా, హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇటీవలే 10 కొత్త ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను కూడా ప్రారంభించింది. హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను మరిన్ని కొత్త నగరాలకు విస్తరించాలని చూస్తోంది. దీని కోసం కంపెనీ చాలా అగ్రెసివ్ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా, భవిష్యత్తులో 300 కొత్త నగరాల్లో హాప్ ఎలక్ట్రిక్ స్టోర్లు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. ఈ దిశగా కంపెనీ తమ పనులను కూడా ప్రారంభించింది.


Click it and Unblock the Notifications








