రూ. 77,430 లకే 'హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్'.. ఇది మరింత సూపర్ లుక్ గురూ..!!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన స్ప్లెండర్ విభాగంలో ఒక కొత్త బైక్ లాంఛ్ చేసింది. కంపెనీ లాంఛ్ చేసిన ఆ బైక్ పేరు 'హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్'. ఈ లేటెస్ట్ బైక్ ప్రారంభ ధర రూ. 77,430 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ డిజైన్ మరియు ఇతర వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) యొక్క 'సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్' రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి డ్రమ్ వేరియంట్ కాగా, మరొకటి డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 77,430 మరియు రూ. 81,330. కంపెనీ ఈ కొత్త బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో లేదా హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

కంపెనీ యొక్క ఈ కొత్త బైక్ దాదాపు దాని స్టాండర్డ్ సూపర్ స్ప్లెండర్‌తో సమానంగా ఉంటుంది, కానీ డిజైన్ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది. ఈ డిజైన్ మొదటగా గమనించదగ్గది ఎక్కువ భాగం బ్లాక్ కలర్ లో ఉండటం. అయితే ఫ్యూయెల్ ట్యాంక్ మీద క్రోమ్ తో ఫినిష్ అయిన 'సూపర్ స్ప్లెండర్' లోగో ఉంది. అదే విధంగా సైడ్ ప్రొఫైల్ లో హీరో బ్యాడ్జ్ కూడా క్రోమ్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.

హెడ్ లైట్ దగ్గర మరియు ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్ మీద మరిన్ని క్రోమ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. మిగిలినవన్నీ కూడా ఎక్కువ భాగం బ్లాక్ పెయింట్ థీమ్ పొందుతాయి.
సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ సింగిల్-పాడ్ హెడ్ లైట్, టింటెడ్ వైజర్, సింగిల్-పీస్ సీట్, అల్లాయ్-వీల్స్ మరియు సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్ వంటివి కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఈ బైక్ ఇంజిన్, అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్, హ్యాండిల్‌బార్ వంటివి మ్యాట్ బ్లాక్ పెయింట్‌లో చూడచక్కగా ఉన్నాయి.

ఇక ఇందులోని ఇంజిన్ లో మాత్రమే ఎటువంటి మార్పులు జరగలేదు, కావున దాని స్టాండర్డ్ మోడల్ లోని ఇంజిన్ ఈ కొత్త బైక్ లో ఉపయోగించబడుతుంది. కావున 'హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్' బిఎస్ 6 124.7 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మరియు వెనుక వైపు ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ రియర్ స్ప్రింగ్ వంటివి ఉన్నాయి. అదే విధంగా బ్రేకింగ్ సిస్టం గమనించినట్లయితే రెండు వీల్స్ పైన 130 మిమీ డ్రమ్ బ్రేకులు ఉంటాయి. అంతే కాకుండా సైడ్-స్టాండ్ కట్ ఆఫ్ మరియు యుఎస్బి ఛార్జర్ వంటివి దాని స్టాండర్డ్ మోడల్ నుంచి తీసుకోవడం జరిగింది.

దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఈ మోడల్ యొక్క స్టాండర్డ్ బైక్ రూ. 77,200 (డ్రమ్) మరియు రూ. 81,100 (డిస్క్) కి లభిస్తున్నాయి. కావున ప్రస్తుతం మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త 'హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్' స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఖరీదైనదిగా ఉంది.

ఇదిలా ఉండగా హీరో మోటోకార్ప్ ఇటీవల మార్కెట్లో హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల చేసింది. దేశీయ విఫణిలో ఈ బైక్ ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త బైక్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారభించింది. కావున కొనుగోలు చేయాలనుకునే వారు జూన్ 29 లోపు బుక్ చేసుకోవచ్చు. ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించబడుతుంది.
కొత్త 2022 హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్, దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 199.6 సీసీ, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.9 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ యొక్క టూవీలర్స్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త వాహనాలను విడుదల చేస్తోంది . ఇందులో భాగంగానే ఇప్పుడు 'హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్' లాంఛ్ చేసింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలైంది కావున మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








