రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పోటీగా మే 17న వస్తున్న కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్
హంగేరియన్ బైక్ బ్రాండ్ కీవే (Keeway) భారతదేశంలో తమ తొలి బైక్ కె-లైట్ (K-Lite) ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కంపెనీ తమ కీవే కె-లైట్ (Keeway K-Lite) క్రూయిజర్ బైక్ ను మే 17, 2022వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కీవే బ్రాండ్ హంగేరికి చెందినది అయినప్పటికీ, ప్రస్తుతం ఈ బ్రాండ్ చైనీస్ ఆటో దిగ్గజం కియాన్‌జియాంగ్ గ్రూప్ (Qianjiang Group)లో భాగంగా ఉంది. ఇదే గ్రూప్ ప్రస్తుతం ఇటీలకి చెందిన బెనెల్లీ (Benelli) మోటార్‌సైకిల్స్ బ్రాండ్ ను కలిగి ఉంది.

భారతదేశంలో విక్రయించబడుతున్న బెనెల్లీ మోటార్‌సైకిళ్లన్నీ కూడా ప్రస్తుతం కియాన్‌జియాంగ్ గ్రూపుకు చెందినవే. కియాన్‌జియాంగ్ అనేక కొత్త ఇంజన్‌లు మరియు మోటార్‌సైకిళ్ల కోసం పేటెంట్ లను కూడా దాఖలు చేసింది, ఇవి కెటిఎమ్ బైక్‌ల నుండి ప్రేరణ పొందినవిగా ఉంటాయి. కీవే బ్రాండ్ చిన్న ఇంజన్ తో కూడిన క్రూయిజర్ బైక్‌లు, స్కూటర్లు, నేక్డ్ స్ట్రీట్ బైక్‌లు మరియు 125 సిసి వరకు ఇంజన్ సామర్థ్యాలతో కూడిన అడ్వెంచర్ బైక్‌లను తయారు చేస్తుంది.

ఈ హంగేరియన్ బ్రాండ్ యొక్క క్రూయిజర్ బైక్‌లు ఇంజన్ సామర్థ్యం పరంగా చాలా చిన్నవే అయినప్పటికీ, వాటి డిజైన్ మాత్రం అమెరికన్ ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ హార్లే డేవిడ్‌సన్ బైక్‌ల నుండి ప్రేరణ పొందినవిగా ఉంటాయి. భారత మార్కెట్లో విడుదల కాబోయే కీవే కె-లైట్ క్రూయిజర్ బైక్ చిత్రాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ బైక్‌లో డ్యూయల్ సైలెన్సర్ సెటప్ కనిపిస్తుంది మరియు ఇది 125 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కొన్ని నివేదికల ప్రకారం, కీవే ఈ క్రూయిజర్ బైక్ లో 125 సీసీకి బదులుగా బెనెల్లీ 502సి మోడల్ నుండి గ్రహించిన పెద్ద 500 సిసి, ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ను కలిగి ఉంటుదంని సమాచారం. బెనెల్లీ మోడల్‌లోని ఈ ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్ ను మరియు 46 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, కీవే నుండి రాబోయే క్రూయిజర్‌లో, ఇదే బెనెల్లీ ఇంజన్ కాస్తం భిన్నమైన పవర్, టార్క్ గణాంకాలను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ బైక్ లో ఉపయోగించబోయే ఇంజన్ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

మరో నివేదిక ప్రకారం, బెనెల్లీ ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న బెనెల్లీ ఇంపీరియల్ క్లాసిక్ 400 మోటార్‌సైకిల్ లో ఉపయోగిస్తున్న 374 సిసి, సింగిల్-సిలిండర్ ఇంజన్ ని కూడా కీవే కె-లైట్ క్రూయిజర్ బైక్ లో ఉపయోగించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కాగా, ఈ చిన్న ఇంజన్ గరిష్టంగా 20.7 బిహెచ్‌పి పవర్ ను మరియు 29 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

హంగేరికి చెందిన కీవే బ్రాండ్ చిన్న సైజు క్రూయిజర్‌లు, స్కూటర్లు, నేక్డ్ స్ట్రీట్ బైక్‌లు మరియు అడ్వెంచర్ టూరర్‌ల తయారీకి చాలా ప్రసిద్ధి చెందిన బ్రాండ్. ఈ కంపెనీ అందించే క్రూయిజర్‌లన్నీ కూడా దాదాపుగా హార్లే డేవిడ్‌సన్ నుండి వచ్చిన రోడ్‌స్టర్‌ల డిజైన్ ను పోలి ఉంటాయి. అయితే హంగేరియన్ బ్రాండ్ అందించే క్రూయిజర్లు హార్లే డేవిడ్సన్ బైక్స్ కన్నా చాలా చిన్నవిగా ఉంటాయి. కీవే నుండి కొత్తగా రాబోయే క్రూయిజర్ బైక్ విషయానికి వస్తే, ఇది డిజైన్ పరంగా కీవే కె-లైట్ సిరీస్ నుండి ప్రేరణ పొందింది మరియు ఇది పెద్ద పెద్ద పారలల్-ట్విన్ ఇంజన్ ను కలిగి ఉన్నప్పటికీ, అదే తరహా స్టైలింగ్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.

కీవే కె-లైట్ సింగిల్-పీస్ సీటుతో సాంప్రదాయమైన లో-స్లంగ్ క్రూయిజర్ స్టైల్ ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ పై సన్నగా ఉండే ఇంధన ట్యాంక్, దానికి ఇరువైపులా సైడ్ ప్యానెల్స్, ముందు భాగంలో చిన్న మడ్‌గార్డ్, హార్లే యొక్క రెట్రో స్టైలింగ్‌ను అనుసరించి రూపొందించిన గుండ్రటి హెడ్‌లైట్ మరియు రెండు చివర్లలో గుండర్టి టర్న్ ఇండికేటర్లు మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపెనీ విడుదల చేసిన టీజర్ స్కెచ్ లో స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ మరియు రియర్ టైర్ హగ్గర్‌తో ఫ్లాట్ టెయిల్ సెక్షన్ ను కూడా వెల్లడించింది.

ఓవరాల్ గా చూస్తే, కీవే కె-లైట్ సౌకర్యవంతమైన రైడింగ్ ఎర్గోనామిక్ లను అందిస్తుందని తెలుస్తోంది. రైడర్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచేందుకు ఇందులో ఫ్లాట్ హ్యాండిల్‌బార్ మరియు మిడ్-సెట్ ఫుట్‌పెగ్‌లు కూడా ఉంటాయని సమాచారం. ఈ బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే, మే 17 వరకూ ఆగాల్సిందే. అయితే, ఈ బైక్ భారతదేశంలోకి విడిభాగాలుగా దిగుమతి చేసుకొని, ఇక్కడే అసెంబుల్ చేయబడుతుందా లేక పూర్తిగా విదేశాలలో తయారైన మోడల్ నే ఇక్కడికి దిగుమతి చేసుకుంటారా అనే విషయం తేలాల్సి ఉంది. భారత మార్కెట్లో, కీవే బైక్‌లు రాయల్ ఎన్‌ఫీల్డ్, జావా, బెనెల్లీ మరియు యెజ్డీ వంటి బ్రాండ్లతో పోటీ పడనున్నాయి.


Click it and Unblock the Notifications








