మార్చి 25న కోమకి డిటి 3000 (Komaki DT 3000) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల, వివరాలు
దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కోమకి ఎలక్ట్రిక్ (Komaki Electric) త్వరలోనే తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ తమ కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ "కోమకి డిటి 3000" (Komaki DT 3000) ని మార్చి 25, 2022వ తేదీన దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఈ ఏడాది కంపెనీకి ఇది మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది. భారత మార్కెట్లో Komaki DT 3000 ధర సుమారు రూ.1,15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉండొచ్చని అంచనా.

కొత్త కోమకి డిటి 3000 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్చి 25వ తేదీ నుండి అన్ని కోమకి డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లేటెస్ట్ టెక్నాలజీని మరియు అధునాతన ఫీచర్లతో అభివృద్ధి చేసింది. ఈ స్కూటర్‌లో 3000 వాట్ల బిఎల్‌డిసి (BLDC) ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 62V 52AH లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. పూర్తి చార్జ్ పై కోమకి డిటి 3000 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 180 కిమీ నుండి 220 కిమీల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

కోమకి డిటి 300 ఒక హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది గంటకు గరిష్టంగా 90 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో విభిన్న రైడింగ్ మోడ్స్ కూడా ఉండనున్నాయి, రైడర్ ఎంచుకునే మోడ్ ను బట్టి దాని రేంజ్ మారుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ మూడు రంగులలలో విడుదల చేయనుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో రిపేర్ స్విచ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ స్విచ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

అంతేకాకుండా, ఇందులో సెల్ఫ్ డయాగ్నసిస్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, సైడ్ స్టాండ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, డ్యూయల్ స్టోరేజీ బాక్స్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉండనున్నాయి. కోమకి డిటి 3000 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ మార్చి 25వ తేదీన వెల్లడించనుంది.

ఇదిలా ఉంటే, కోమకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ ఏడాది జనవరి లో రేంజర్ (Komaki Ranger) అనే ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ ను మరియు వెనిస్ (Komaki Venice) అనే ట్రెడిషనల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లను మార్కెట్లో విడుదల చేసింది. కోమకి రేంజర్ మరియు కోమకి వెనిస్ మోడళ్ల లాంచ్‌తో, ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఐదు హై-స్పీడ్ వాహనాలను కలిగి ఉంది. ఈ బ్రాండ్ నుండి మొత్తం 16 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

కోమకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇది 4000 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు దేశంలోని ఏ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలోనూ ఉపయోగించని అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ను ఇందులో అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. లాంజ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ కారణంగా కోమకి రేంజ్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 250 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. ఈ బైక్ ధర అన్ని ఉపకరణాలతో కలిసి రూ. 1.68 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ లో క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్ మరియు బ్లూటూత్ సౌండ్ సిస్టమ్ మరియు అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రేంజర్ రూపకల్పన మరియు అభివృద్ధి కోసం కోమకి దాదాపు రూ. 7 కోట్లకు పైగా పెట్టుబడిని వెచ్చించినట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో కోమకి రేంజ్ మొట్టమొదటి క్రూయిజ్ మోటార్‌సైకిల్ అవుతుంది.

ఇదిలా ఉంటే, కోమకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ ఏడాది ఒక లాంగ్ రేంజ్ బ్యాటరీని తయారు చేసినట్లు పేర్కొంది. ఈ లాంగ్ రేంజ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే, దాని సాయంతో దాదాపు 220 కిమీల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ లాంగ్ రేంజ్ బ్యాటరీపై పరిశోధన మరియు అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) పూర్తిగా భారతదేశంలోనే జరిగిందని కంపెనీ తెలిపింది.

కోమకి తయారు చేసిన ఈ అధునాతన బ్యాటరీ ప్యాక్ ను కంపెనీ విక్రయించే మూడు హై-స్పీడ్ కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇన్స్టాల్ చేయనున్నారు. వీటిలో ఎక్స్‌జిటి-కెఎమ్ (XGT-KM), ఎక్స్-వన్ (X-One) మరియు ఎక్స్‌జిటి-ఎక్స్4 (XGT-X4) స్కూటర్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఈ స్కూటర్ శ్రేణి ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఇందులోని కొత్త బ్యాటరీ ప్యాక్ ను కేవలం 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
(గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన ఫొటోలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే అని గమనించండి)


Click it and Unblock the Notifications








