కొత్త 2022 కవాసకి వెర్సిస్ 650 (Kawasaki Versys 650) విడుదల.. ధర రూ.7.36 లక్షలు
జపాన్ కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి ఇండియా (Kawasaki India) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ కవాసకి వెర్సిస్ 650 (Kawasaki Versys 650) లో కొత్త 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త మోడల్ ధర వెర్సిస్ 650 ధర రూ. 7.36 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కవాసకి ఇటీవలే తమ కొత్త 2022 నింజా 300 మరియు 2022 నింజా 400 బైక్‌లను విడుదల చేసిన తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన మూడవ మోడల్ ఈ కొత్త 2022 వెర్సిస్ 650 అడ్వెంచర్ బైక్.

పాత మోడల్ తో పోలిస్తే కొత్త 2022 మోడల్ కవాసకి వెర్సిస్ ధర రూ.21,000 అధికంగా ఉంది. గతంలో విక్రయించిన పాత మోడల్ ధర రూ.7.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. కొత్త 2022 కవాసకి వెర్సిస్ 650 (2022 Kawasaki Versys 650) బైక్‌ను కంపెనీ గతేడాది నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది భారత మార్కెట్ ను చేరుకోవడంలో కాస్తంత ఆలస్యమైంది. కవాసకి ఈ కొత్త మోడల్ లో కొన్ని చిన్నపాటి డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసింది.

కొత్త 2022 మోడల్ ఇప్పుడు చిన్నసైజులో ఉండే ఫ్రంట్ నోస్ డిజైన్ తో షార్ప్ గా ఉండే కొత్త ఫ్రంట్ హాఫ్ ఫెయిరింగ్ ను కలిగి ఉంటుంది. దీని ఓవరాల్ డిజైన్ దాని పెద్దన్న అయిన కవాసకి వెర్సిస్ 1000 ((Kawasaki Versys 1000) మాదిరిగానే కనిపిస్తుంది. ముందు వైపు 4-వే అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్‌తో కూడిన డ్యూయల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. సైడ్ ఫెయిరింగ్ ఇప్పుడు ఇంజన్ హెడ్‌ను కవర్ చేసే ట్రస్ లాంటి చాస్సిస్ మూలకాలతో అనుసంధానించబడి ఉంటుంది.

అలాగే, ఈ కొత్త మోడల్ మిడిల్ వెయింట్ అడ్వెంచర్ బైక్ ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ అయిన 2022 కవాకసి నింజా 300 (Kawasaki Ninja 300) మాదిరిగానే కొత్త బ్లాక్ డిజైన్ గ్రాఫిక్ లను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో మొదటిసారిగా కంపెనీ యొక్క ప్రసిద్ధ కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ (KTRC) ఫీచర్ ని జోడించారు. ఇందులో 2 మోడ్‌లు ఉన్నాయి, కావాలనుకుంటే రైడర్లు వీటిని స్విచ్ ఆఫ్ కూడా చేయవచ్చు.

ఈ కొత్త బైక్‌లో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టిఎఫ్‌టి డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ కూడా ఈ బైక్ లో మొదటిసారిగా పరిచయం చేశారు. ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినగా మెకానికల్స్ గా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే మునుపటి 649 సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 66 హెచ్‌పి శక్తిని మరియు 61 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్ లో చాలా మంది పోటీదారులు ఆఫర్ చేయని సర్దుబాటు చేయగల షోవా సస్పెన్షన్ హైలైట్ గా నిలుస్తుంది.

కొత్త 2022 మోడల్ కవాసకి వెర్సిస్ 650 ఇప్పుడు లైమ్ గ్రీన్ మరియు మెటాలిక్ ఫాంటమ్ సిల్వర్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఈ బైక్ లో ఇరు వైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనోషాక్, ముందువైపు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

భారతదేశంలో కవాసకి వెర్సిస్ 650 ఏప్రిల్ 2022 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ మరియు నింజా 300 తర్వాత అత్యధికంగా అమ్ముడైన మూడవ పెర్ఫార్మెన్స్ బైక్‌గా నిలిచింది. ఇది 262 శాతం వృద్ధితో 47 యూనిట్లను విక్రయించింది. కవాసకి వెర్సిస్ 650 ఈ విభాగంలో ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 మరియు సుజుకి వి-స్టోర్మ్ 650 ఎక్స్‌టి వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

కవాసకి నింజా 400 (Kawasaki Ninja 400) విడుదల..
ఇదిలా ఉంటే, కవాసకి గడచిన జూన్ నెలాఖరులో తమ కొత్త 2022 మోడల్ నింజా 400 ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కొత్త మోడల్ కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డ్యూయల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి డిఆర్ఎల్, కొత్త రియర్ వ్యూ మిర్రర్స్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, విండ్‌స్క్రీన్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ మరియు స్ప్లిట్-సీట్ వంటి డిజైన్ హైలైట్స్ ఉన్నాయి.

కొత్త 2022 కవాసకి నింజా 400 లైమ్ గ్రీన్ మరియు మెటాలిక్ కార్బన్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే స్థానంలో సెమీ-డిజిటల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉంటుంది. ఇది అనలాగ్ టాకొమీటర్, ఎడమవైపున వార్నింగ్ లైట్ ఉంటాయి, కుడివైపు మల్టీ ఫంక్షన్ ఎల్‌సిడి స్క్రీన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ బైక్ లో అదే పాత 399 సిసి, లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్, డిఓసిహెచ్, 8 వాల్వ్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 44.7 బిహెచ్‌పి పవర్ మరియు 37 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








