కొత్త 2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ మరియు 450 ప్లస్ (3వ తరం) ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల: ధర, ఫీచర్లు
బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy), భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త తరం మోడళ్లను విడుదల చేసింది. ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మరియు ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మోడళ్లలో కంపెనీ మూడవ తరం (Gen 3) మోడళ్లను పరిచయం చేసింది.

దేశీయ మార్కెట్లో బేస్ వేరియంట్ అయిన Ather 450 Plus Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 116,101 కాగా, టాప్-ఎండ్ వేరియంట్ అయిన Ather 450X Gen 3 ప్రారంభ రూ. 137,612 గా ఉంది. పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, అహ్మదాబాద్ మరియు ఫేమ్ 2 సబ్సిడీ, పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ మరియు ఏథర్ డాట్ హోమ్ ఛార్జర్‌తో కలిపి.

కొత్త తరం ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ల డిజైన్ పెద్దగా మార్చలేదు. అయితే, కంపెనీ ఇందులో మెకానికల్ మరియు ఎలక్ట్రిక్ మార్పులు మాత్రం చేసింది. ఇప్పుడు ఈ మూడవ తరం ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటాయి. ఫలితంగా, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ మునుపటి కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది.

ఇత మార్పులలో కొత్త సైడ్ మిర్రర్లు, ఎమ్ఆర్ఎఫ్ టైర్లు మరియు సైడ్ స్టెప్‌ల వంటి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. ఇందులో అతిపెద్ద మార్పు దాని బ్యాటరీ ప్యాక్ రూపంలో ఉంటుంది. ఏథర్ 450ఎక్స్ యొక్క బ్యాటరీ ప్యాక్ పరిమాణం ఇప్పుడు 25 శాతం పెరిగింది, ఇది 20 శాతం ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను అందించడంలో సహకరిస్తుంది.
మునుపటి తరం ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో కంపెనీ 2.9kWh బ్యాటరీ ప్యాక్ ను అందించేది. అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన జెన్ 3 ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లు దాని స్థానంలో పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటాయి. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ 19 కిలోల బరువును కలిగి ఉంటుంది మరియు పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 146 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇది ఎకో మోడ్‌లో 105 కిలోమీటర్ల నిజమైన పరిధిని (రియల్ టైమ్ రేంజ్) ను అందిస్తుందని ఏథర్ పేర్కొంది. అయితే, ఈ రైడ్ మోడ్‌లో ఈ రియల్ టైమ్ రేంజ్ 85 కిలోమీటర్లకు పడిపోతుంది. కాగా, స్పోర్ట్ మోడ్ లో ఈ రేంజ్ ఫిగర్ ఇప్పుడు 75 కిలోమీటర్లుగా ఉంటుంది. అదే సమయంలో వార్ప్ మోడ్‌లో రియల్ టైమ్ రేంజ్ ఇప్పుడు 65 కిలోమీటర్లుగా ఉంది. ఇది 450X వినియోగదారులలో 94 శాతం మంది ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దాని అత్యంత శక్తివంతమైన మోడ్‌లో మాత్రమే నడపడానికి అనుమతిస్తుంది అని ఏథర్ పేర్కొంది.

ఏథర్ 450ఎక్స్ జెన్ 3 మోడల్ రేంజ్ మునుపటి తరం స్కూటర్ యొక్క రేంజ్ తో పోలిస్తే గణనీయంగా మెరుగుపడింది. ఏథర్ 450ఎక్స్ జెన్ 2 మోడల్ స్కూటర్ ఎకో మోడ్‌లో 85 కిమీ, రైడ్ మోడ్‌లో 70 కిమీ, స్పోర్ట్ మోడ్‌లో 60 కిమీ మరియు వార్ప్ మోడ్‌లో 50 కిమీ రియల్ టైమ్ రేంజ్ ను కలిగి ఉండేది.

ఏథర్ 450ఎక్స్ యొక్క మూడవ తరం మోడల్ ఇప్పుడు స్టాండర్డ్‌గా 22 శాతం అధిక గ్రిప్ ను కలిగి ఉండే MRF టైర్‌లను కలిగి ఉంటుంది. ఏథర్ మరియు ఎమ్ఆర్ఎఫ్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ టైరును ప్రత్యేకించి ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం అభివృద్ధి చేశాయి. ఈ కొత్త టైర్లు మెరుగైన యాక్సిలరేషన్, కార్నరింగ్ మరియు బ్రేకింగ్ పనితీరులో సహాయపడతాయని ఏథర్ తెలిపింది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ ను కూడా కలిగి ఉన్నాయి. అలాగే, ఇందులో కొత్తగా అమర్చిన సైడ్ మిర్రర్లు మునుపటి కన్నా రెండు రెట్లు ఎక్కువ విజిబిలిటీని అందిస్తాయి. ఈ కొత్త మోడల్ లోని సైడ్ స్టెప్స్ ఇప్పుడు ధృడమైన కాస్ట్ అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి. అలాగే, ఇందులోని డిస్‌ప్లే యూనిట్ లో కూడా సాంకేతిక అప్‌గ్రేడ్స్ చేయబడ్డాయి. ఈ సెటప్ ఇప్పుడు రెట్టింపు ర్యామ్‌ని కలిగి ఉంది, ఇది ఆఫ్‌లైన్ మ్యాప్‌లతో సహా భవిష్యత్తులో మరిన్ని ఫీచర్‌లను అన్‌లాక్ చేయడంలో సహాయపడుతుందని ఏథర్ ఎనర్జీ పేర్కొంది.

మూడవ తరం ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం దేశవ్యాప్తంగా టెస్ట్ రైడ్ లు కూడా ప్రారంభమయ్యాయి. కంపెనీ త్వరలోనే వీటి డెలివరీలను కూడా ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే, దేశీయ మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తమ అతిపెద్ద తయారీ కర్మాగారాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఏథర్ ఎనర్జీకి తమిళనాడులోని హోసూర్‌లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్లు కలిసి వార్షికంగా 4 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగలవు.


Click it and Unblock the Notifications








