కొత్త 2022 ఏథర్ 450ఎక్స్ స్కూటర్ కొంటున్నారా..? అయితే, ముందుగా ఈ 5 విషయాలు తెలుసుకోండి!
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) దేశీయ విపణిలో విక్రయిస్తున్న 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇటీవలే కొత్త తరం (థర్డ్ జనరేషన్) మోడల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ తమ పాత మోడల్‌లో ఇప్పుడు మరిన్ని పెర్ఫార్మెన్స్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్‌లను కొత్తగా విడుదల చేసింది. ఈ స్కూటర్ విషయంలో వివిధ కస్టమర్ల నుండి అందుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ ఇందులో మార్పులు చేసింది. ఒకవేళ మీరు కూడా ఈ కొత్త 2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 (Ather 450X Gen 3) మోడల్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకోండి!

1. ఎక్కువ రేంజ్‌ను అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్
ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో కస్టమర్లు ఎక్కువగా ఫిర్యాదు చేసిన అంశం దాని బ్యాటరీ యొక్క రేంజ్. ఈ నేపథ్యంలో కంపెనీ తమ కొత్త 2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 లో మరింత ఎక్కువ రేంజ్ ను అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించింది. మీ సమాచారం కోసం పాత మోడల్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.9kWh బ్యాటరీ ప్యాక్ ను అందించేది. ఇది పూర్తి చార్జ్ పై 85 కిమీ రియల్ టైమ్ రేంజ్‌ను మాత్రమే ఆఫర్ చేసేది.

అయితే, కంపెనీ ఇప్పుడు తమ కొత్త 2022 ఏథర్ 450ఎక్స్ జెన్ 3 మోడల్ పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించింది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ 19 కిలోల బరువును కలిగి ఉంటుంది మరియు పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 146 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. కాగా, ఎకో మోడ్ లో దీని రియల్ టైమ్ రేంజ్ పూర్తి ఛార్జ్‌పై 105 కిలోమీటర్లు ఉంటుంది. ఏథర్ 450ఎక్స్ యొక్క బ్యాటరీ ప్యాక్ పరిమాణం ఇప్పుడు 25 శాతం పెరిగింది. ఫలితంగా, ఇది 20 శాతం అదనపు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

2. మరింత ఎక్కువ శక్తి
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెంచిన బ్యాటరీ సామర్థ్యానికి అనుగుణంగా కంపెనీ దీని ఎలక్ట్రిక్ మోటార్‌లో కూడా చిన్నపాటి మార్పులు చేసింది. ఏథర్ 450ఎక్స్ జెన్ 3 లోని ఫ్యాన్-కూల్డ్ మోటార్ గతంలో 6kW గరిష్ట పవర్ ను జనరేట్ చేస్తే, ఇప్పుడు అది 6.2 kW గరిష్ట పవర్ ను జనరేట్ చేస్తుంది. ఈ గరిష్ట శక్తిలో పెరుగదల నామమాత్రమే అయినప్పటికీ, దాని పవర్ అవుట్‌పుట్ మాత్రం 3.3kW వద్ద అలాగే ఉంది. ఎలక్ట్రిక్ మోటార్ పీక్ పవర్‌లో చేసిన మార్పుల కారణంగా, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్ల నుండి గంటకు 90 కిలోమీటర్లకు పెరిగింది.

3. కొత్త పరికరాలు మరియు ఫీచర్లు
ఏథర్ 450ఎక్స్ జెన్ 3 మోడల్ యొక్క ఓవరాల్ డిజైన్‌లో కంపెనీ ఎలాంటి మేజర్ మార్పులు చేయనప్పటికీ, దీని పరికరాలు మరియు విడిభాగాలలో మాత్రం కొన్ని చెప్పుకోదగిన మార్పులు చేసింది. వీటిలో మొదటిది కొత్తగా అమర్చిన సైడ్ మిర్రర్లు, ఇవి మునుపటి కన్నా రెండు రెట్లు ఎక్కువ విజిబిలిటీని అందిస్తాయని కంపెనీ చెబుతోంది. అలాగే, ఇందులో చేసిన మరొక మార్పు కొత్త సైడ్ స్టెప్స్, ఇవి ఇప్పుడు ధృడమైన కాస్ట్ అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి మరియు వీటి నాణ్యత మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

ఈ కొత్త మోడల్ లో కంపెనీ చేసిన మరొక అతిపెద్ద మార్పు వీటి టైర్లు. ఏథర్ 450ఎక్స్ యొక్క మూడవ తరం మోడల్ ఇప్పుడు స్టాండర్డ్‌గా 22 శాతం అధిక గ్రిప్ ను కలిగి ఉండే MRF టైర్‌లతో వస్తుంది. ఈ టైర్లను ఏథర్ మరియు ఎమ్ఆర్ఎఫ్ సంస్థలు ప్రత్యేకంగా తయారు చేశాయి. ఇవి మెరుగైన యాక్సిలరేషన్, కార్నరింగ్ మరియు బ్రేకింగ్ పనితీరులో సహాయపడతాయని ఏథర్ తెలిపింది. ఈ టైర్లు ఇప్పుడు టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (TPMS) ను కూడా సపోర్ట్ చేస్తాయి.

4. డిస్‌ప్లే ఇన్‌పుట్‌పై వేగవంతమైన ప్రతిస్పందన
ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్‌ప్లే యూనిట్ లో కూడా సాంకేతిక అప్‌గ్రేడ్స్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్ ఇప్పుడు రెట్టింపు ర్యామ్‌ని కలిగి ఉంటుంది. ఈ 7 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్ లో RAM సైజును 1GB నుండి 2GB కి పెంచారు. ఫలితంగా, ఇది యూజర్ ఇన్‌పుట్‌లకు చాలా వేగంగా ప్రతిస్పందిస్తుంది. భవిష్యత్తులో ఇందులో వాయిస్ కమాండ్‌లు మరియు బహుళ-భాషా (మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్) తో సహా అనేక కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ మార్పులు మినహా, మునుపటి తరం ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ అందించిన అన్ని ఇతర ఫీచర్లు మరియు పరికరాలు యధావిధిగా ఇందులో కూడా కొనసాగుతాయి.

5. ధరలో పెరుగుదల
దేశ రాజధాని ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ప్రారంభ ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ, అన్ని సబ్సిడీల తర్వాత) గా ఉంది. వివిధ రాష్ట్రాలలో పాత మోడల్ తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ ధర సుమారు రూ. 1,000 నుండి దాదాపు రూ. 7,000 వరకు పెరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ఇలా ఉన్నాయి:
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు:
- Ather 450 Plus Gen 3 - రూ. 1,34,095
- Ather 450X Gen 3 - రూ. 1,55,605
- Ather 450 Plus Gen 3 - రూ. 1,35,892
- Ather 450X Gen 3 - రూ. 1,57,402
హైదరాబాద్‌లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు:
(గమనిక - పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, సిటీ మరియు ఫేమ్ 2 సబ్సిడీ, పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ మరియు ఏథర్ డాట్ హోమ్ ఛార్జర్‌తో కలిపి, జులై 20, 2022 నాటికి).


Click it and Unblock the Notifications








