కొత్త 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
భారతదేశంలో ఆఫ్-రోడింగ్ ప్రేమికులు పెరుగుతున్న తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా మార్కెట్లో ఆఫ్-రోడ్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ విఫణిలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉన్న 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు తన కొత్త 'ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' (Xpulse 200 4V Rally Edition) విడుదల చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక డిజైన్ మరియు పరికరాలను పొందుతుంది.
అయితే దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దీని గురించి తప్పకుండా 5 విషయాలను తెలుసుకోవాలి. ఆ 5 విషయాలు గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

1) డిజైన్ మరియు స్టైల్:
'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' మంచి డిజైన్ కలిగి చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అప్డేట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ప్రత్యేకమైన ర్యాలీ కోడ్ గ్రాఫిక్స్, ఫ్రంట్ ఫెండర్‌పై ర్యాలీ ఎడిషన్ డెకాల్ మరియు ఫ్యూయెల్ ట్యాంక్ పైన 'సిఎస్ సంతోష్' ఆటోగ్రాఫ్ వంటివి ఉన్నాయి.

అయితే ఈ బైక్ స్టాండర్డ్ బైక్ లోని కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటుంది. అవి ముందుభాగంలో ఉన్న రౌండ్ హెడ్‌లైట్, పొడవైన-సెట్ ఫ్రంట్ ఫెండర్, సింగిల్-పీస్ సీటు, ఎగ్జాస్ట్ కోసం హై పొజిషన్ మరియు వెనుక భాగంలో ఒక కాంపాక్ట్ లగేజ్ రాక్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

2) కలర్:
'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' బ్లాక్ మరియు రెడ్ కలర్ గ్రాఫిక్స్‌తో పాటు వైట్ కలర్ బేస్ పెయింట్ పొందుతుంది, కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే దీని స్టాండర్డ్ మోడల్ మాత్రం మూడు పెయింట్ తీమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మాట్ నెక్సస్ బ్లూ, పోలెస్టార్ బ్లూ మరియు స్పోర్ట్స్ రెడ్ కలర్స్.

3) అప్డేటెడ్ ఫీచర్స్:
కొత్త 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' ముందు వైపున ఒక పొడవాటి మరియు పెద్ద 37 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ ఫోకస్ సస్పెన్షన్ పొందుతుంది. అంతే కాకూండా వెనుక వైపున మోనో-షాక్ యూనిట్ ఉంది. ఈ కొత్త బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువగా ఉంది. అంటే ఇప్పడు ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 270 మిమీ వరకు ఉంది.

ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ యొక్క సీటు ఎత్తు 885 మిమీ కాగా, హ్యాండిల్‌బార్ రైజర్‌లు 40 మిమీ కంటే ఎక్కువ పొడవు పొందాయి. ఇవి మరింత ఉత్తమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతే కాకుండా ర్యాలీ ఎడిషన్ లో పొడిగించబడిన గేర్ లివర్, పొడవాటి సైడ్ స్టాండ్ మరియు డ్యూయల్ పర్పస్ టైర్స్ కూడా ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ యొక్క బరువు (కర్బ్) 160 కేజీలు. కావున ఇది రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

4) ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:
హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ యొక్క ఇంజిన్ లో ఎటువంటి మార్పులు లేదు, కావున ఇది 199.6 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.9 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

5) ధర మరియు బుకింగ్స్:
హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ. 1,52,100 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే దీని స్టాండర్డ్ మోడల్ ధర రూ. 1,35,978 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీన్ని బట్టి చూస్తే కొత్త ఎడిషన్ దాని మునుపటి ఎడిషన్ కంటే కూడా ఖరీదైనదని స్పష్టంగా తెలుస్తోంది.

ఇక బుకింగ్స్ విషయానికి వస్తే, కొత్త ర్యాలీ ఎడిషన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు జూన్ 22వ తేదీ మధ్యాహ్నం హీరో యొక్క eShop ప్లాట్‌ఫారమ్‌లో బుక్ చేసుకోవచ్చు. అది కూడా బుకింగ్స్ కేవలం జూన్ 29 వరకు మాత్రమే కొనసాగుతాయి. కావున కొనుగోలుదారులు త్వరగా బుక్ చేసుకోవాలి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ యొక్క బైకులకు మంచి ఆదరణ ఉంది, అందులోనూ ప్రస్తుతం మార్కెట్లో ఆఫ్ రోడ్ వాహనాలకు మరింత ఎక్కువ డిమాండ్ ఉంది. కావున ఈ కొత్త 'హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








