HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ నుండి సరికొత్త OXO ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది.. టీజర్ విడుదల!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility) మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కూడా ఉండబోతోంది. తాజాగా, కంపెనీ ఇందుకు సంబంధించి ఓ టీజర్ ను కూడా విడుదల చేసేంది. హాప్ ఆక్సో (HOP OXO) పేరుతో ఈ ఎలక్ట్రిక్ మోటార్ మార్కెట్లోకి రానుంది.

హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది. ఫలితంగా, ఈ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని, కంపెనీ భవిష్యత్తులో దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. అయితే, తొలిసారిగా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను విడుదల చేయబోతోంది. అంతకంటే, ముందుగా కంపెనీ తమ అవుట్‌లెట్‌ల సంఖ్యను దేశవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని 12 రాష్ట్రాల్లోని 54 నగరాల్లో సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ని కలిగి ఉంది. అదనంగా, హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇటీవలే 10 కొత్త ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను కూడా ప్రారంభించింది.

హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను మరిన్ని కొత్త నగరాలకు విస్తరించాలని చూస్తోంది. దీని కోసం కంపెనీ చాలా అగ్రెసివ్ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా, భవిష్యత్తులో 300 కొత్త నగరాల్లో హాప్ ఎలక్ట్రిక్ స్టోర్లు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. ఈ దిశగా కంపెనీ తమ పనులను కూడా ప్రారంభించింది.

కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ త్వరలోనే ఓ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ రాకను నిర్ధారించడానికి కంపెనీ కొన్ని టీజర్ చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ చిత్రంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ముందు భాగం ఉంది. ఇది హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ ముందు భాగాన్ని ప్రతిబింబించే శైలిని కలిగి ఉంది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ ను హాప్ ఆక్సో (HOP OXO) పేరుతో విడుదల చేయనున్నట్లు సమాచారం మరియు ఇది లాంచ్‌కు సిద్ధంగా ఉందని తెలియజేసేందుకు కంపెనీ ఈ కొత్త టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన అన్ని నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు సరికొత్త హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా అమ్మకానికి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రస్తుతానికి, ఇంకా పేరు నిర్ధారించబడిన ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ లో పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. అయితే, Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ మాత్రం తక్కువ రేంజ్ సామర్థ్యంతో వస్తుందని భావిస్తున్నారు. ఇది పూర్తి ఛార్జింగ్ పై సుమారు 120 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేయగలదని సమాచారం. ఇది ఈ విభాగంలో రివోల్ట్ ఆర్‌వి300/400 వంటి ఎలక్ట్రిక్ బైక్ లకు పోటీగా ఉంటుందని భావిస్తున్నారు.

హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పటికే భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. కంపెనీ దేశీయ విపణిలో హాప్ లియో (HOP LEO) మరియు హాప్ లైఫ్ (HOP LYF) అనే పేర్లతో ఈ రెండు కొత్త స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి రెండూ కూడా అధిక పనితీరు గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లతో అందుబాటులోకి రానున్నాయి. ఇవి రెండూ కూడా స్టాండర్డ్ మరియు హై-రేంజ్ సామర్థ్యాలతో విక్రయానికి ఉన్నాయి.

హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఆటోమేటిక్ లాకింగ్, సెన్సార్, రివర్స్ గేర్, యూఎస్‌బి ఛార్జింగ్, రిమోట్ కీ, యాంటీ-థెఫ్ట్ అలారం మరియు యాంటీ-థెఫ్ట్ వీల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటికి అదనంగా, ఇవి ఇంటర్నెట్ మరియు జిపిఎస్ కనెక్టివిటీతో కూడా లభిస్తాయి. ఈ ఫీచర్ల సాయంతో కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ ను స్కూటర్ తో అనుసంధానం చేసుకోవచ్చు మరియు జియో ఫెన్సింగ్, లైవ్ లొకేషన్ వంటి వివిధ రకాల ఫీచర్లను కూడా పొందవచ్చు.

ప్రస్తుతానికి హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కు సంబంధించిన సమాచారం చాలా తక్కువగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే కంపెనీ దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ-బైక్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇదే రకమైన ఫీచర్లు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ త్వరలోనే దేశవ్యాప్తంగా బ్యాటరీ ఛార్జింగ్ మరియు మార్పిడి నెట్‌వర్క్ (Swapping Network) ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








