కొత్త 2022 ఎమ్‌టి-15 మోటార్‌సైకిల్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను లాంచ్ చేసిన యమహా
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha), ఇటీవల భారత మార్కెట్లో తమ కొత్త 2022 మోడల్ ఎమ్‌టి-15 బైక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ మార్కెట్లో ఈ కొత్త 2022 యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) బైక్ ధర రూ. 1,59,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో కంపెనీ కొన్ని ముఖ్యమైన డిజైన్ అప్‌డేట్‌లు మరియు మెకానికల్ అప్‌గ్రేడ్స్ చేసింది. తాజాగా, కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం అధికారిక యాక్ససరీల జాబితాను కూడా విడుదల చేసింది.

కొత్త 2022 యమహా ఎమ్‌టి-15 కొత్త కలర్ ఆప్షన్స్ మరియు కొత్త ఫీచర్లతో పరిచయం చేయబడింది. ఇందులో గోల్డెన్ ఫినిషింగ్‌తో అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, కొత్త డిజైన్ మరియు గేర్ షిఫ్ట్ ఇండికేటర్‌తో కూడిన పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్‌లో బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ ఫీచర్లు, అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్, అప్‌డేట్ చేయబడిన 155 సిసి ఇంజన్, ఎల్ఈడి టెయిల్ లైట్, బలమైన మడ్‌గార్డ్‌తో కూడిన కొత్త డిజైన్ మరియు అప్‌డేట్ చేయబడిన బాడీ గ్రాఫిక్స్ కూడా మార్పులు కూడా ఉన్నాయి.

కాగా, ఈ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్‌ను రైడర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకు కంపెనీ ఇప్పుడు ఈ మోటార్‌సైకిల్ కోసం అనేక రకాల ఉపకరణాలను (యాక్ససరీలను) కూడా పరిచయం చేసింది. యమహా ఈ యాక్ససరీల జాబితా మరియు వాటి ధరలను వెల్లడించింది. కస్టమర్‌లు ఈ యాక్సెసరీలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు మరియు వాటిని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల నుండి పొందవచ్చు.

కాక్‌పిట్ విస్తీర్ణాన్ని పెంచడానికి, వినియోగదారులు రూ.350కి అందుబాటులో ఉన్న ట్యాంక్ ప్యాడ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లూ / బ్లాక్ మరియు బ్లాక్ / గ్రే అనే రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేయబడింది. కొత్త Yamaha MT-15 యొక్క ట్యాంక్ ప్యాడ్ అధిక నాణ్యత కలిగిన ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. ఇది స్క్రాచ్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ మరియు ఎక్కువ కాలం ఉండేలా డిజైన్ చేయబడిందని కంపెనీ పేర్కొంది.

ఇదివరకు చెప్పుకున్నట్లుగా కొత్త 2022 Yamaha MT-15 బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ తో వస్తుంది, కాబట్టి కస్టమర్‌లు, రైడర్లు తమ మొబైల్ ఫోన్ ను బైక్ పై ఉంచేందుకు ఈ మొబైల్ హోల్డర్ మరియు USB ఛార్జర్ వంటి ఉపకరణాలతో తమ రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. వీటిలో USB ఛార్జర్ ధర రూ.750 కాగా, మొబైల్ హోల్డర్ ధర రూ.350 గా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే వారికి మరియు మొబైల్ ను అత్యవరంగా చార్జ్ చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.

ఇందులోని మొబైల్ హోల్డర్ స్టాండర్డ్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది మరియు ఇది దృఢమైన ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేయబడింది. ఇది వివిధ రకాల సైజులలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఉంచడానికి వీలుగా సర్దుబాటు చేయగల డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇకపోతే, యూయఎస్‌బి ఛార్జర్‌ను హ్యాండిల్‌బార్‌పైనే సులువుగా అమర్చుకోవచ్చు. ఇది దుమ్ము, చెత్త మరియు నీటి నుండి రక్షణ కోసం టాప్ కవర్‌తో కూడా లభిస్తుంది. ఈ USB ఛార్జర్ కిట్‌లో USB స్లాట్ మరియు వైరింగ్, నట్ బోల్ట్ మరియు జిప్ టైలు ఉంటాయి.

ఈ మోటార్‌సైకిల్ యొక్క యాక్సెసరీస్ జాబితాలో చౌకైన యాక్ససరీ ఏంటంటే, అది యమహా బ్రాండ్ స్టిక్కర్, దీని ధర రూ.80 గా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ డిజైన్ ను కలిగి ఉండి, మంచి క్వాలిటీ ఫినిషనింగ్ ను కలిగి ఉంటుంది. ఇది బైక్, రైడర్ హెల్మెట్ పై కానీ లేదా బైక్ పై కానీ ఉపయోగించవచ్చు. రైడర్లు తమ ఎమ్‌టి-15 కోసం మరింత స్పోర్టీ లుక్ ను అందించడానికి రూ. 1,490 ధర కలిగిన ఎల్ఈడి ఫ్లాషర్‌ను కూడా ఎంచుకోవచ్చు. అప్పీరల్స్ అంటే ఇష్టపడే వారికి రూ.900 ధరతో కంపెనీ యమహా ఎమ్‌టి బ్రాండ్ పోలో టీ-షర్ట్‌ను కూడా విక్రయిస్తోంది. ఇతర బ్రాండెడ్ దుస్తులలో MT బ్లాక్ బైకింగ్ జాకెట్ మరియు యమహా బ్లాక్ బైకింగ్ జాకెట్ లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 6,500 మరియు రూ. 6,990.

పిలియన్ రైడర్ సౌకర్యం కోసం, వినియోగదారులు రూ.500 ధర వద్ద టెన్డం ఫుట్‌రెస్ట్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే, బైక్‌ను ఎండ నుండి రక్షించడానికి సీటు కవర్ ను కొనుగోలు చేయవచ్చు మరియు దాని ధర రూ.400 గా ఉంది. ఈ సీట్ కవర్ స్టాండర్డ్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది మరియు ఇది వాటర్ రెసిస్టెంట్ మరియు డస్ట్ ప్రూఫ్‌గా ఉంటుంది. అలాగే, స్కిడ్ ప్లేట్ ను కంపెనీ రూ.500 ధరతో అందిస్తోంది.

యమహా ఎమ్‌టి-15 వి2.0 బైక్ విషయానికి వస్తే, ఇది కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్ యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 (Yamaha YZF-R15) స్పోర్ట్స్ బైక్ యొక్క నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ వెర్షన్. ఆర్-15 తో పోల్చుకుంటే, ఎమ్‌టి-15 ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు కొన్ని ప్రీమియం భాగాలను కోల్పోవడం వలన ఇది చాలా తేలికైన మరియు వేగవంతమైన నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్‌గా ఉంటుంది. యమహా ఎమ్‌టి-15 బైక్ లో నిటారుగా ఉన్న రైడింగ్ పొజిషన్, అద్భుతమైన పవర్-టు-వెయిట్ రేషియో మరియు అతి చురుకైన హ్యాండ్లింగ్ వంటి ఫీచర్లతో ఈ మోటార్‌సైకిల్ ఓ మంచి ఫన్ టూ రైడ్ బైక్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








