డుగ్గు డుగ్గు బుల్లెట్ ఇప్పుడు సరికొత్త రూపంలో రాబోతోంది.. 2022 మోడల్ కొనడానికి మీరు సిద్ధమేనా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350), భారత టూవీలర్ మార్కెట్ కు పరిచయం అవసరం లేని క్లాసిక్ మోటార్‌సైకిల్ ఇది. భారతదేశంలో మనుగడలో ఉన్న అత్యంత పురాతనమైన మోటార్‌సైకిల్ నేమ్‌ప్లేట్లలో ఒకటైన బుల్లెట్ 350 కి దేశంలో చాలా నమ్మకమైన అభిమానుల సంఖ్య చాలానే ఉంది. ఈ మోటార్‌సైకిల్ ఎంతగా పాపులర్ అయిందంటే, ఇప్పటికీ చాలా మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 'బుల్లెట్' బైక్ కంపెనీగా పిలిచేంత. బుల్లెట్ అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేసిన ఓ మోటార్‌సైకిల్ మాత్రమే, అయితే చాలా మంది ఇదే పేరుతో ఆ కంపెనీ పిలుస్తుంటారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో ఎన్ని కొత్త మరియు అధునాతన మోటార్‌సైకిళ్లను విడుదల చేసినప్పటికీ, బుల్లెట్ 350 (Bullet 350) బైక్ కి ఉండే క్రేజే వేరు. కాలం మారుతూ వచ్చిన ఈ బైక్ రూపం మాత్రం పెద్దగా మారలేదు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ బుల్లెట్ మోటార్‌సైకిల్‌కు, రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్పులు చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఈ 1931 నాటి మోటార్‌సైకిల్ చరిత్రలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎప్పటికప్పుడు బుల్లెట్ 350ని అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కంపెనీ ఇందులో ఓ కొత్త తరం మోడల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ భారత రోడ్లపై టెస్టింగ్ దశలో ఉండగా కెమెరాకు చిక్కింది. క్యామోఫ్లేజ్ లేకుండా ఈ మోడల్ ను టెస్టింగ్ చేయడాన్ని చూస్తుంటే, తదుపరి తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్పై చిత్రాలను గమనిస్తే, కొత్త తరం బుల్లెట్ 350 లోని సింగిల్-పీస్ స్టెప్డ్ సీట్, రెట్రో-స్టైల్ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్‌లు మరియు విస్తృత హ్యాండిల్ బార్ వంటి క్లాసిక్ డిజైన్ ఎలిమెంట్స్ ను చూస్తుంటే, ఇవన్నీ దాని పాత తరం మోడళ్ల నుండి అలానే కొనసాగిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఈ ఫొటోని సరిగ్గా గమనించినట్లయితే, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ చాలా కమాండింగ్ గా అప్‌రైట్ సీటింగ్ పొజిషన్‌ను (నిటారుగా ఉండ్ సీటింగ్ స్థానాన్ని) కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ యొక్క ప్రధానమైన మరియు విశిష్టమైన లక్షణం. అంతేకాకుండా, ఈ కొత్త తరం మోటార్‌సైకిల్ అవుట్‌గోయింగ్ క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350 మోటార్‌సైకిళ్ల మాదిరిగానే సరికొత్త డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ మరియు ఇంజన్‌ను కూడా కలిగి ఉంటుందని సమాచారం.

ఈ అధునాతన 349సీసీ, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి శక్తిని మరియు 27 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ ఈ బైక్ డిజైన్ విషయంలో భారీ మార్పులు చేయకుండా, దాని క్లాసిక్ లెగసీని అలానే కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకుంది. గత కొంత కాలంగా భారతదేశంలో కొత్త తరం బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ విడుదల చేయబడుతుందని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

కాగా, ఈ లేటెస్ట్ స్పై ఫొటోలను మరియు ఈ బైక్ లుక్‌ను బట్టి చూస్తే, ఈ మోటార్‌సైకిల్ దాదాపు విడుదల సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుల్లెట్ బైక్ అంటే దాని సైలెన్సర్ చేసే డుగ్గు డుగ్గు శబ్ధానికి చాలా పాపులర్. అయితే, కొత్తగా వచ్చిన కాలుష్య నిబంధనలతో ఇది అదే రకమైన శబ్ధాన్ని చేస్తుందో లేక తుస్సుమంటుందో వేచి చూడాలి.

ఓసారి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ చరిత్రను తిరగేసి చూస్తే, ఇది తొలిసారిగా 1931లో సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌గా పరిచయం చేయబడింది. ఈ మోటార్ సైకిళ్లను రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం కూడా ఉపయోగించడం విశేషం. 1939లో, బ్రిటీష్ వాహన తయారీ సంస్థ, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను హైడ్రాలిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ఫుల్లీ ఇన్‌కార్పొరేటెడ్ స్వింగ్-ఆర్మ్ ఫ్రేమ్ రియర్ సస్పెన్షన్ మరియు కొన్ని కాస్మెటిక్ మార్పులతో అప్‌డేట్ చేసింది. ఈ మార్పులు బుల్లెట్ బైక్ కు ప్రజల్లో మంచి అదరణను లభించేలా చేశాయి మరియు బుల్లెట్ బైక్ మరింత మెరుగుపరచాయి.

1949 సంవత్సరం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆ సమయంలో సరిహద్దు గస్తీ విధుల కోసం భారత సైన్యం రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లను ఆర్డర్ చేసింది. అదే సమయంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా బుల్లెట్ మోటార్‌సైకిల్‌లో పెద్ద మార్పులను ప్రవేశపెట్టింది మరియు ఈ మార్పులలో కొన్ని అల్లాయ్ హెడ్ మరియు అధిక కంప్రెషన్‌తో కూడిన అప్‌రేటెడ్ ఇంజన్, పూర్తి స్ప్రింగ్ డిజైన్, కొత్త టెలిస్కోపిక్ సస్పెన్షన్, 4-స్పీడ్ అల్బియాన్ గేర్‌బాక్స్ మరియు హెడ్‌లైట్ అసెంబ్లీ స్పీడోమీటర్ లోపల ఉంచబడింది.

1955లో, ఈ మోడల్ ఉత్పత్తి మద్రాసు (చెన్నై)లో ప్రారంభమైంది మరియు ఆ తర్వాత ఇందులో అనేక మార్పులు లేకుండానే 1995 వరకు ఉత్పత్తిలో కొనసాగింది. దీని తర్వాత సిద్ధార్థ లాల్ ఈ కంపెనీని యాజమాన్య పగ్గాలు చేపట్టారు. అతని నాయకత్వంలో, బుల్లెట్ బైక్ రెండుగా విభజించబడింది. వాటిలో బుల్లెట్ స్టాండర్డ్ మరియు బుల్లెట్ ఎలక్ట్రా ఉన్నాయి. ఎలక్ట్రా కలర్ ఆప్షన్లు, సిడిఐ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ మరియు గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండేది. ఈ మోడల్ అతి తక్కువ సమయంలోనే మంచి వియజాన్ని సాధించింది, కంపెనీ మొత్తం అమ్మకాలలో 50 శాతానికి పైగా ఈ వేరియంట్ నుండే వచ్చేవి.

ఆ తర్వాతి కాలంలో 'ఏవిఎల్' ఇంజన్ లెఫ్ట్ ఫుట్ గేర్ షిఫ్ట్ మరియు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో బుల్లెట్ బైక్ పరిచయం చేయబడింది. ఈ ఇంజన్ మునుపటి కంటే చాలా మృదువైనదిగా ఉండేది. అయితే, ఈ ఇంజన్ లో మునుపటి వైబ్రేషన్ ఫీల్ లేకపోవడంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఔత్సాహికులకు దీనిని పెద్దగా ఆదరించలేదు. దీంతో కంపెనీ 2007లో, యూనిట్ కన్‌స్ట్రక్షన్ ఇంజన్ (UCE)ని పరిచయం చేసింది. ఈ మోడల్ కూడా మొదట్లో కొంత విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, త్వరలోనే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 350సీసీ మోటార్‌సైకిళ్లలో బుల్లెట్ 350 కూడా ఒకటిగా నిలిచేలా చేసింది.


Click it and Unblock the Notifications








