మార్కెట్లో NIJ Accelero+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర రూ.53,000, రేంజ్ 190 కిలోమీటర్లు!
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ ధరాఘాతానికి బెంబేలెత్తిపోతున్న ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ ఒక్కసారిగా జోరందుకుంది. గతేడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ దాదాపు రెట్టింపు అయింది. పెరుగుతున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు కొత్త ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి.

తాజాగా, ఆగ్రాకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎన్ఐజే ఆటోమోటివ్ (NIJ Automotive) భారత మార్కెట్లో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఎన్ఐజే యాక్సెలెరో ప్లస్ (NIJ Accelero+) పేరుతో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఎన్ఐజే ఆటోమోటివ్ యాక్సిలెరో+ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 53,000 నుండి ప్రారంభమవుతాయి.
ఎన్ఐజే యాక్సెలెరో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ను పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. కస్టమర్ ఎంచుకునే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ను బట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 53,000 నుండి రూ. 98,000 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.

ఎన్ఐజే యాక్సిలెరో ప్లస్ - పవర్‌ట్రైన్
ఎన్ఐజే ఆటోమోటివ్ ప్రవేశపెట్టిన ఈ యాక్సిలెరో ప్లస్ ఇ-స్కూటర్ లో కంపెనీ వాల్వ్ రెగ్యులేటెడ్ లీడ్-యాసిడ్ (VRLA) లేదా లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్ లను ఉపయోగిస్తుంది. లీడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో ఉన్నది ఒక్క వేరియంట్ మాత్రమే అయినప్పటికీ, LFP బ్యాటరీ ప్యాక్ ను మాత్రం కంపెనీ మూడు రూపాల్లో అందింస్తోంది. వీటిలో 1.5kW (48V), 1.5kW (60W) మరియు 3kW (48V) డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి.

ఎన్ఐజే యాక్సిలెరో ప్లస్ - రేంజ్
ఎన్ఐజే యాక్సిలెరో ప్లస్ మూడు రైడింగ్ మోడ్ లను కలిగి ఉంటుంది. ఇందులోని లాంగ్ రేంజ్ వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 190 కిలోమీటర్ల వరకూ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ క్లెయిమ్ చేయబడిన రేంజ్ ను ఎకో మోడ్‌లో డ్యూయల్ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ సెటప్‌తో మాత్రమే సాధించవచ్చు. కాగా, ఇందులోని సిటీ రైడింగ్ మోడ్ తో రేంజ్ కేవలం 120 కిలోమీటర్ల వరకే ఉంటుంది.

ఎన్ఐజే యాక్సిలెరో ప్లస్ - చార్జింగ్ టైమ్
చార్జింగ్ సమయం విషయానికి వస్తే, ఇందులోని లీడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్‌ను 3A పవర్ సాకెట్‌లో ప్లగ్ చేయడం ద్వారా ఛార్జ్ చేయవచ్చు. దీని సాయంతో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అదే, లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ను 6A సాకెట్‌లో ప్లగ్ చేసి చార్జ్ చేసినప్పుడు, దానిని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.

ఎన్ఐజే యాక్సిలెరో ప్లస్ - మెకానికల్స్
యాక్సిలెరో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉపయోగించిన సింగిల్ బ్రష్‌లెస్ డిసి మోటార్ పవర్ మరియు టార్క్ గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇందులోని స్కూటర్ మోటార్ కోసం సైన్ వేవ్ కంట్రోలర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 180 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది.

ఎన్ఐజే యాక్సిలెరో ప్లస్ - కొలతలు
ఎన్‌ఐజే ఆటోమోటివ్ నుండి వచ్చిన ఈ కొత్త యాక్సెలరో+ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,720 మిమీ పొడవును, 690 మిమీ వెడల్పును మరియు 1,100 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వీల్‌బేస్ 1,280 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిమీ గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 86 కిలోగ్రాములుగా ఉంటుంది మరియు ఇది గరిష్టంగా 150 కిలోగ్రాముల లోడింగ్ సామర్థ్యాన్ని మోయగలదు.

ఎన్ఐజే యాక్సిలెరో ప్లస్ - డిజైన్, ఫీచర్లు
యాక్సిలెరో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంప్రదాయ ఐసిఈ స్కూటర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎన్ఐజే ఆటోమోటివ్ నుండి వచ్చిన ఈ ఇ-స్కూటర్ హ్యాండిల్‌బార్ కౌల్‌పై పెద్ద ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ మరియు డ్యూయెల్ ఎల్ఈడి హెడ్‌లైట్‌లు, బూమరాంగ్ ఆకారంలో ఉండే టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. ఇక ఇందులో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, NIJ Accelero+ లో డిజిటల్ స్పీడోమీటర్, USB ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ అసిస్ట్ మరియు సులభంగా యాక్సెస్ చేయగల ఛార్జింగ్ పోర్ట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఎన్ఐజే ఆటోమోటివ్ యాక్సిలెరో+ ఎలక్ట్రిక్ స్కూటర్ పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం
ఎన్ఐజే ఆటోమోటివ్ యాక్సిలెరో+ అనేది ఆగ్రాకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ నుండి వచ్చిన సరికొత్త మోడల్. కంపెనీ ఇందులో వివిధ రకాల బ్యాటరీ ప్యాక్ లను మరియు లాంగ్ రేంజ్ కోసం డ్యూయల్ ప్యాక్‌లను కూడా అందిస్తుంది. కాబట్టి, సిటీ ప్రయాణాలకే కాకుండా దీనిపై చిన్నపాటి దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








