ఇంపోర్టెడ్ బ్యాటరీలు భారతీయ పరిస్థితులకు సరైనవి కావు, అందుకే ప్రమాదాలు: సీనియర్ సైంటిస్ట్
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అగ్ని ప్రమాద ఘటనలు అధికం అవుతున్న నేపథ్యంలో, నీతి ఆయోగ్ సభ్యుడు మరియు సైంటిస్ట్ వి కె సరస్వత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం, దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్‌లు భారతీయ పరిస్థితులకు తగినవి కావని, దాని వలనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని చాలా కాలంగా నిపుణులు మరియు ఆటోమోటివ్ ఔత్సాహికులు కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఈ శాస్త్రవేత్త కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

గత రెండు నెలలుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో పలు బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. కొన్ని సందర్భాల్లో బ్యాటరీలు కూడా పేలిపోయాయి. ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈవీ తయారీదారులు మరియు ప్రభుత్వంపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో నీతి ఆయోగ్ సైంటిస్ట్ వి కె సరస్వత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అగ్ని ప్రమాదాలకు గురైన దాదాపు అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఉన్న ఏకైక సాధారణ అంశం, వాటిలో ఉపయోగించిన బ్యాటరీ సెల్స్. ఇవన్నీ కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్‌లే కావడం గమనార్గం. భారతదేశంలో ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ లో ఎవరూ బ్యాటరీ సెల్‌లను తయారు చేయడం లేదు. ఒకవేళ అరకొర కంపెనీలు ఇలాంటి సెల్స్ ను తయారు చేస్తున్నా, ఈవీ తయారీదారులు మాత్రం వీటిని విదేశాల నుండి దిగుమతి చేసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

మనదేశంలో విక్రయించబడే ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లలో వందలాది బ్యాటరీ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్‌ను ఒక సిరీస్ లో అమర్చి, పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేస్తారు. తయారీదారులు బ్యాటరీ ఖర్చును తగ్గించుకునేందుకు సెల్స్ ను విడిభాగాలుగా ఇక్కడి దిగుమతి చేసుకొని, బ్యాటరీ ప్యాక్‌లుగా అసెంబుల్ చేస్తారు. సరస్వత్ ప్రకారం, ఈ సెల్స్ విదేశాలలో తయారు చేయబడ్డాయి కాబట్టి, ఇవి అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే తయారు చేయబడి ఉంటాయి.

భారతదేశంలో సాధారణంగా కనిపించే ఉష్ణమండల ఉష్ణోగ్రతల కోసం ఈ సెల్స్ అభివృద్ధి చేయబడలేదనేది ఆయన అభిప్రాయం. ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడానికి ఇది ఓ మూల కారణంగా తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడానికి గల కారణాలను అన్వేషించడానికి భారత ప్రభుత్వం సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీకి ఈ బాధ్యతను అప్పగించింది.

విచారణ ఫలితాలు రాకముందే, దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్‌లు భారతీయ పరిస్థితులకు తగినవి కావని నీతి ఆయోగ్ సభ్యుడు వికె సరస్వత్ వ్యాఖ్యానించారు. "బ్యాటరీ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న సాంకేతికత. ప్రస్తుతం భారతదేశం బ్యాటరీ సెల్‌లను తయారు చేయడం లేదు. మన స్వంత తయారీ ప్లాంట్‌లను మనం త్వరగా ఏర్పాటు చేసుకోవాలి. మనం తయారు చేసిన సెల్‌లు భారతీయ అధిక ఉష్ణోగ్రత పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి" అని ఆయన అన్నారు.

వి కె సరస్వత్ ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త, అతను రక్షణ పరిశోధనలో, ప్రాథమిక మరియు అనువర్తిత శాస్త్రాలలో అపారమైన అనుభవం కలిగి ఉన్నాడు. ఈయన DRDO డైరెక్టర్ జనరల్‌గా మరియు రక్షణ మంత్రికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యం మరియు అతని అనుభవ స్థాయిని బట్టి చూస్తే, ఈ సీనియర్ సైంటిస్ట్ చేసిన ప్రకటన ఈ అంశంపై తగినంత జ్ఞానం మరియు పరిశోధన లేకుండా రాదని స్పష్టంగా తెలుస్తుంది.

భారతదేశం ఓ ఉష్ణమండల ప్రాంతం, మనదేశంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఈ బ్యాటరీ సెల్‌లు తయారయ్యే ఐరోపా లేదా ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, ఈ ఏడాది భారతదేశంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే ఎదుర్కొనే సమస్య కాదు, నాలుగు చక్రాల వాహనాల విషయంలో కూడా ఇదే పరిస్థితి.

అయితే, ఎలక్ట్రిక్ టూవీలర్లతో పోలిస్తే, ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు అధిక వేడిని ఎదుర్కోవడానికి పెద్ద మరియు మరింత అధునాతన శీతలీకరణ వ్యవస్థను (బ్యాటరీ కూలింగ్ సిస్టమ్) ను కలిగి ఉంటాయి. కానీ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో స్థలం అనేది ప్రధాన సమస్య కాబట్టి, వీటిలో బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ అంత సమర్థవంతంగా ఉండదు. అయితే, స్పేస్ ప్రీమియంతో ఉంటుంది కాబట్టి శీతలీకరణ వ్యవస్థ అంత సమగ్రంగా ఉండదు.

కాగా, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అగ్ని ప్రమాదాలకు సంబంధించి నిపుణుల బృందం ఓ నివేదికను సమర్పించిన తర్వాత అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ప్రకటించారు. ఈవీ తయారీదారులు ఈ విషయంలో తప్పు చేసినా లేదా నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, మన దేశంలోనే బ్యాటరీ సెల్స్ ని స్వయంగా తయారు చేసేందుకు లాగ్9 మెటీరియల్స్ అనే కంపెనీ తమ మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది మరియు ఈ బ్రాండ్ త్వరలో ఈ సెల్స్ ను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయనుంది. ఈ బ్యాటరీ సెల్ భారతీయ పరిస్థితులలో అభివృద్ధి చేయబడుతున్నందున, వీటిని ఇక్కడి పరిస్థితులుకు అనుగుణంగా పరీక్షించి మరియు ఉష్ణమండల ఉష్ణోగ్రతలకు అనుకూలంగా తయారు చేయనున్నారు. కాబట్టి, ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల బ్యాటరీ సమస్యలకు ఇది ఓ చక్కటి పరిష్కారం కావచ్చు.


Click it and Unblock the Notifications








