భారత మార్కెట్లో ఒడిస్సే వి2 మరియు వి2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల.. పూర్తి చార్జ్ పై 150 కిమీ రేంజ్!
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విషయంలో ఈ డిమాండ్ తారాస్థాయిలో ఉంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విషయంలో అక్కడక్కడా అగ్ని ప్రమాద ఘటనలు నమోదవుతున్నప్పటికీ, పెరిగిన పెట్రోల్ ధరల బాధ నుండి తప్పించుకునేందుకు కొనుగోలుదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా, వాహన తయారీదారులు కూడా కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

తాజాగా, ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒడిస్సే (Odysse) భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఒడిస్సే వి2 (Odysse V2) మరియు ఒడిస్సే వి2 ప్లస్ (Odysse V2+) అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. వీటిలో Odysse V2 ధర రూ. 75,000 (ఎక్స్-షోరూమ్) కాగా, Odysse V2+ ధర రూ. 97,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఒడిస్సే వి2 మరియు వి2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర‌్ల విడుదలతో, కంపెనీ ఇప్పుడు తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 6 ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంది.

సమాచారం ప్రకారం, ఒడిస్సే ఈ సంవత్సరం చివరి నాటికి మరో రెండు మోడళ్లను పరిచయం చేయాలని చూస్తోంది. అంతేకాకుండా, రాబోయే నెలల్లో తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ను కూడా 100 కి పైగా విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త వాహనాలను విడుదల చేసిన తర్వాత తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు ఒడిస్సే తెలిపింది.

ఒడిస్సే వి2 మరియు ఒడిస్సే వి2 ప్లస్ రెండూ కూడా ఒకేరకమైన ఫ్యూచరిస్టిక్ డిజైన్ ను కలిగి ఉంటాయి. ఈ రెండింటిలో బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు వేరుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఫ్రంట్ ఆప్రాన్‌పై మినిమలిస్టిక్ డిజైన్ ను కలిగి ఉండి దీర్ఘచతురస్రాకారపు ఎల్ఈడి హెడ్‌లైట్ సెటప్‌ను కలిగి ఉంటాయి. దీని ఫ్లోర్‌బోర్డ్ ఫ్లాట్‌గా మరియు కొంత లగేజ్ ను ఉంచడానికి విశాలంగా ఉంటుంది. ఇందులో ఇరువైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ముందు డిస్క్ బ్రేక్ మరియు బెటర్ రైడ్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ వెనుక భాగం చాలా పెద్దదిగా కాకుండా, ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒడిస్సే వి2 మరియు వి2 ప్లస్ రెండు కూడా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో కూడిన IP67 సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తాయి. ఇందులో పాసివ్ బ్యాటరీ కూలింగ్, యాంటీ-థెఫ్ట్ లాక్, మెయిన్ స్టాండ్, వెనుక బ్యాక్‌రెస్ట్ సపోర్ట్ మరియు పెద్ద బూట్ వంటి కొన్ని ఇతర ముఖ్యమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఒడిస్సే వి2 (Odysse V2) ఫీచర్లు..
ఒడిస్సే వి2 ఒక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లకు మించదు. ఇందులో 250 వాట్ 60 వోల్ట్స్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 1.3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఫిక్స్డ్ యూనిట్ గా ఉంటుంది మరియు దీనిని తొలగించి చార్జ్ చేసుకోవడానికి వీలు ఉండదు. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 3.5 గంటల సమయం పడుతుంది మరియు పూర్తి చార్జ్ పై ఇది గరిష్టంగా 75 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

ఒడిస్సే వి2 ప్లస్ (Odysse V2+) ఫీచర్లు..
ఒడిస్సే వి2 ప్లస్ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే, ఇది వి2 కన్నా డబల్ బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ కూడా 250 వాట్ 60 వోల్ట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 2.6 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ కూడా ఫిక్స్డ్ యూనిట్ గా ఉంటుంది మరియు దీనిని తొలగించి చార్జ్ చేసుకోవడానికి వీలు ఉండదు. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది మరియు ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

ఇదిలా ఉంటే, ఒడిస్సే తమ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా అహ్మదాబాద్, ముంబై మరియు హైదరాబాద్‌తో పాటు మరిన్ని కొత్త ప్రదేశాలలో సౌకర్యాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఒడిస్సే విడుదల చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు కాకుండా, కంపెనీ ఇప్పటికే తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో నాలుగు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఒడిస్సే ఇ2గో (Odysse E2go), ఒడిస్సే హాక్+ (Odysse Hawk+), ఒడిస్సే రేసర్ (Odysse Racer) మరియు ఒడిస్సే ఎవోకిస్ (Odysse Evoqis) మోడళ్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








