మార్చి 24న ఒకినావా ఒకి 90 (Okinawa Oki 90) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. చాలా విచిత్రమైన డిజైన్!
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒకినావా (Okinawa), ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లలోని అగ్రగామి కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ బ్రాండ్ నుండి లో-స్పీడ్ మరియు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూవీలర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం కమ్యూటింగ్ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, కార్గో మరియు బి2బి అవరాల కోసం కూడా ఒకినావా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు ఈ బ్రాండ్ మరొక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఈనెల మార్కెట్లోకి రాబోతోంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

ఒకినావా ఎలక్ట్రిక్ మార్చ్ 24వ తేదీన తమ సరికొత్త ఒకి 90 (Okinawa Oki 90) ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఒకినావా ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి ఓ మాక్సీ స్టైల్ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. మనదేశంలో ఇప్పటి వరకూ ఇలాంటి ఎలక్ట్రిక్ టూవీలర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే, పెట్రోల్ పవర్డ్ మాక్సీ స్కూటర్ల విషయానికి వస్తే, సుజుకి మరియు యమహా కంపెనీలు ఈ విభాగంలో మాక్సీ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. కానీ, ఎలక్ట్రిక్ విభాగంలో ఒకినావా మొదటిగా మాక్సీ స్టైల్ ఇ-స్కూటర్ ను పరిచయం చేస్తోంది.

ఒకినావా ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. గతంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్ దశలో ఉండగా, కొన్ని స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ఈ స్పై చిత్రాల ప్రకారం, ఒకినావా ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెద్ద 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు మరియు వెనుక భాగంలో స్టైలిష్ ఎల్ఈడి లైట్లు మరియు క్రోమ్ ప్యానెల్లు అమర్చబడ్డాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో, ట్రెడిషనల్ హబ్ మౌంటెడ్ మోటర్ కు బదులుగా సెంటర్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉండే అవకాశం ఉంది మరియు బెల్ట్ డ్రైవ్ సాయంతో పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇది మాక్సీ స్టైల్ బాడీ టైప్ ను కలిగి ఉండొచ్చని సమాచారం. కంపెనీ ప్రస్తుతానికి, ఈ ఇ-స్కూటర్ యొక్క అంచనా రేంజ్ మినహా ఇతర సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు. సమాచారం ప్రకారం, ఇందులో తొలగించగల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని తెలుస్తోంది.

మార్కెట్లోని ఇతర హై-స్పీడ్/హై-రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే ఒకినావా ఒకి 90 కూడా స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. పూర్తి చార్జ్ పై ఇది సుమారు 150 నుండి 180 కిలోమీటర్ల రేంజ్ ను అందించవచ్చని అంచనా వేయబడింది. అలాగే, దీని గరిష్ట వేగం గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇది ఈ విభాగంలో Ola S1 Pro, Ather 40X, Simple One, Bajaj Chethak మరియు TVS i-Cube వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది.

ఒకినావా ఒకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ లో అందించబోయే ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ ఇందులో యాప్ ఆధారిత మొబైల్ కనెక్టివిటీ, బ్లూటూత్, జియో ఫెన్సింగ్, నావిగేషన్, సెల్ఫ్ డయాగ్నస్టిక్స్, కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ అలారం, మొబైల్ ఛార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన వివరాలా చాలా పరిమితంగా ఉన్నాయి. ఇక దీని అంచనా ధర విషయానికి వస్తే, ఒకినావా మార్కెట్లో దీనిని రూ. 1 లక్ష నుండి రూ. 1.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమేనని గమనించగలరు.

ఒకినావా ప్రైస్ ప్రో (Okinawa Praise Pro) గురించి క్లుప్తంగా..
ప్రస్తుతం, ఒకినావా ప్రోడక్ట్ లైనప్ లో బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఒకినావా ప్రైస్ ప్రో (Okinawa Praise Pro) ముందంజలో ఉంది. ఇదొక హై-స్పీడ్, లాంగ్ రేంజ్ సిటీ కమ్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్. మార్కెట్లో ఒకినావా ప్రైస్ ప్రో ధర సుమారు రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలపై వివిధ రాష్ట్రాలు అదించే సబ్సిడీల కారణంగా, దీని ధర ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అధునాతన ఫీచర్లు మరియు పరికరాలతో అందిస్తోంది.

ఒకినావా ప్రైస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులోని షార్ప్ డిజైన్ యాంగిల్స్, హై పొజిషన్ హెడ్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లతో ఇది ముందు వైపు అగ్రెసివ్ స్టైలింగ్ ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వేరు చేయగల (డిటాచబల్) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీని స్కూటర్ నుండి విడిగా తీసి, సాధారణ హోమ్ వాల్ అవుట్‌లెట్ సాయంతో చార్జ్ చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్ లలో నివసరించే వారికి ఈ ఫీచర్ చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఒకినావా ప్రైస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పీడ్ మరియు రేంజ్ అంశాలను పరిశీలిస్తే, ఇందులో విభిన్న రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి. రైడర్ ఎంచుకునే మోడ్ ను బట్టి దాని గరిష్ట వేగం మరియు రేంజ్ మారుతూ ఉంటాయి. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 45 కిమీ వేగంతో పరుగులు తీస్తే, స్పోర్ట్ మోడ్‌లో 65 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. ఇంకా ఇందులో టర్బో బటన్ కూడా ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 88 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సర్టిఫై చేయబడింది.


Click it and Unblock the Notifications








