ఫ్లాష్.. ఫ్లాష్.. 3,215 ప్రైస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసిన ఓకినావా
ఇటీవల తమిళనాడులో ఓ ఇంటి లోపల చార్జింగ్ చేసిన ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హఠాత్తుగా మంటలు వ్యాపించడంలో ఓ తండ్రీ కూతురు మరణించిన సంగతి తెలిసినదే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఒకినావా సంస్థ ఇప్పుడు స్వచ్ఛంద రీకాల్‌ను ప్రకటించింది. కంపెనీ మొత్తం 3,215 యూనిట్ల ప్రైజ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. ఒకినావా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్ల నుంచి రీకాల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ ఓసారి క్షుణ్ణంగా తనిఖీ చేయనుంది.

ఈ రీకాల్ పూర్తిగా స్వచ్ఛందమైనది మరియు రీకాల్ కోసం కంపెనీ కస్టమర్‌లపై ఎలాంటి ఒత్తిడి చేయదు. ఒకినావా ఈ రీకాల్ గురించి తమ కస్టమర్లకు తెలియజేస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు ఒకినావా అధీకృత సర్వీస్ సెంటరును సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ రీకాల్‌లో భాగంగా, కంపెనీ సర్వీస్ సెంటర్లకు కస్టమర్లు తీసుకువచ్చే వాహనాలను తనిఖీ చేసి, స్కూటర లో మంటలు రావడానికి గల కారణాన్ని అన్వేషిస్తుంది.

ఒకినావా ప్రైస్ ప్రో రీకాల్ ప్రోగ్రామ్ లో భాగంగా, కంపెనీ ఈ స్కూటర్లలో ఉపయోగించిన బ్యాటరీ, కనెక్టర్లు మరియు వైరింగ్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ భాగాలను పరిశీలిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రైస్ ప్రో కస్టమర్లకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా నిర్వహించబడుతుంది. రీకాల్ కోసం కస్టమర్ ఒకినావాలోని సమీప డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.

ఒకినావా పేర్కొన్న ఒక అధికారిక ప్రకటన ప్రకారం, "కంపెనీ తమ కస్టమర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది మరియు ఈ విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదని అనుకుంటిది. ఈ స్వచ్ఛంద రీకాల్ ప్రచారం ఒకినావా ప్రైస్ ప్రో ఇ-స్కూటర్‌లను పరీక్షించడానికి మరియు వాటిని మరింత సురక్షితంగా చేయడానికి నిర్వహించబడుతోందని" పేర్కొనబడి ఉంది.

ఒకినావా మాదిరిగానే, ఇతర తయారీదారులు కూడా తమ ప్రభావిత ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లపై కస్టమర్ నమ్మకాన్ని ఉంచడానికి రీకాల్‌ను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. గత రెండు వారాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ఐదుకి పైగా ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్నిప్రమాద సంఘటనలు జరిగాయి. ఓలా, ఒకినావా, ప్యూర్ ఈవీ, జితేంద్ర ఈవీ మరియు అనేక ఇతర ఇ-స్కూటర్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ఈవీలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్ని ప్రమాద సంఘటనలు నివేదించబడ్డాయి.

ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమకు ఇలాంటి సంఘటనలు పెను సవాలుగా మారే అవకాశం ఉంది. కస్టమర్లు ఇప్పుడిప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకొని, పెట్రోల్ టూవీలర్ల నుండి ఎలక్ట్రిక్ టూవీలర్ల వైపుకు మరళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటరీ వాహనాలు తగలబడటం వంటి సంఘటనలు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇ-టూవీలర్ కంపెనీలు ఇలాంటి స్వచ్ఛంద రీకాల్స్‌ను ప్రకటించడం ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది, ఈవీలలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించాలని ఓ ప్రత్యేక బృందాన్ని ఆదేశించింది. ఎలక్ట్రిక్ వాహనాల అగ్ని ప్రమాదాలపై ఓ నివేదికను సమర్పించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు సీఎఫ్‌ఈఈఏ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు కూడా పంపించినట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ వాహనాలలో అగ్ని ప్రమాదాలకు దారితీసిన పరిస్థితులను పరిశోధించాలని మరియు అందుకు తగిన నివారణ చర్యలను సూచించాలని కోరింది కూడా ప్రభుత్వం CFEES ని కోరింది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు మంటలు అంటుకున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు మరియు ప్రస్తుతం వాటిని వినియోగిస్తున్న వారిలో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి.

ప్రాధమిక సమాచారం ప్రకారం, ఈ అగ్ని ప్రమాదాలకు గల ప్రధాన కారణంగా లిథియం-అయాన్ బ్యాటరీలలోని థర్మల్ రన్‌అవే అని చెబుతున్నారు. గత నెలలో పూణెలో ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు, కానీ ఓలా స్కూటర్ మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ నేపథ్యంలో, ఓలా ఎలక్ట్రిక్ సిఈఓ భవీష్ అగర్వాల్ తమ వాహనాల భద్రత గురించి కేంద్రానికి వివరించేందుకు రోడ్డు రవాణా మరియు రాహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.

పూనేలో జరిగిన ఓలా ఈవీ అగ్ని ప్రమాద విషయంపై గతంలో స్పందించిన ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, "ఓలా కంపెనీలో వాహనాల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని, తమ ఉత్పత్తులు అత్యధిక నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటాయని, కబట్టి, తాము ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని మరియు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓలా తరహాలోనే ఇప్పుడు ఒకినావా కూడా తమ స్కూటర్లపై కస్టమర్లలో నమ్మకాన్ని పెంచేందుకు ఈ స్వచ్చంద రీకాల్‌ను ప్రకటించింది.


Click it and Unblock the Notifications








