మార్కెట్లోకి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు (Poise Scooters) వచ్చాయ్.. ధరలు, ఫీచర్లు
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల హవా అధికమవుతోంది. ప్రస్తుతం, భారీగా పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో, సాంప్రదాయ పెట్రోల్ టూవీలర్లతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు చాలా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. దీంతో కస్టమర్లు ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ టూవీలర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిజానికి, ఇవి పెట్రోల్ వాహనాల కన్నా అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ, ధీర్ఘకాలంలో వాటి మెయింటినెన్స్ ఖర్చు తక్కువగా ఉండటంతో, మొదటిసారిగా టూవీలర్ కొనేవారు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ టూవీలర్‌నే ఎంచుకుంటున్నారు.

ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతన్న డిమాండ్ కు తగినట్లుగానే తయారీదారులు కూడా వివిధ విభాగాలలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా, ఈ సెగ్మెంట్లో మునుపెన్నడూ వినని బ్రాండ్లు మరియు కొత్త తయారీదారులు కూడా పుట్టుకొస్తున్నారు. తాజాగా, బెంగుళూరుకు చెందిన నిసికి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Nisiki Technologies Pvt Ltd) యొక్క అనుబంధ సంస్థ అయిన పోయెస్ స్కూటర్స్ (Poise Scooters), భారత మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

పోయెస్ స్కూటర్లు - ధరలు
పోయెస్ స్కూటర్స్ విడుదల చేసిన స్కూటర్లలో పోయెస్ ఎన్ఎక్స్-120 (Poise NX-120) మరియు పోయెస్ గ్రేస్ (Poise Grace) మోడళ్లు ఉన్నాయి. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* Poise NX-120 - Rs. 1,24,000
* Poise Grace - Rs. 1,04,000
(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, కర్ణాటక)
ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా విక్రయించనుంది. వాటి ధరలు ఆయా రాష్ట్రాలలో అందించే సబ్సిడీలను బట్టి వేరుగా ఉంటాయి.

పోయెస్ స్కూటర్లు - డిజైన్
ముందుగా Poise NX-120 ఇ-స్కూటర్ డిజైన్‌ను గమనిస్తే, ఇది షార్ప్ బాడీ లైన్స్‌తో మరియు యాంగిల్స్‌తో చాలా స్పోర్టీ అండ్ అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యవతను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన ఇ-స్కూటర్‌లా అనిపిస్తుంది. అయితే, Poise Grace ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం, దాని పేరు సూచించినట్లుగానే, కాంపాక్ట్ డిజైన్‌తో క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది.

పోయెస్ స్కూటర్లు - వేరు చేయగల బ్యాటరీ
పోయెస్ ఎన్ఎక్స్-120 మరియు పోయెస్ గ్రేస్ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు వేరు చేయగల బ్యాటరీలను కలిగి ఉంటాయి మరియు వీటిని సాధారణ హోమ్ అవుట్‌లెట్‌లను ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ హోమ్ ఎలక్ట్రిక్ యాక్ససరీస్ మాదిరిగానే తగిన 220 వోల్ట్ పవర్ సాకెట్ సాయంతో అపార్ట్‌మెంట్‌లలో కూడా సులువుగా ఛార్జ్ చేయగల సులభ పోర్టబుల్ బ్యాటరీతో కంపెనీ వీటిని రూపొందించింది. బేస్‌మెంట్‌లో చార్జింగ్ సౌకర్యం లేని, అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారికి ఈ ఫీచర్ చాలా అనుకూలంగా ఉంటుంది.

పోయెస్ స్కూటర్లు - బ్యాటరీ మరియు రేంజ్
ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ ఒకేరకమైన బ్యాటరీ ప్యాక్‌తో విక్రయిస్తోంది. ఇందులో NMC (నికెల్, మాంగనీస్ మరియు కోబాల్ట్) ఆధారిత లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీలను ఉపయోగించారు. అలాగే, ఈ రెండింటిలోనూ ఒకేరకమైన 2kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. రేంజ్ విషయానికి వస్తే, Poise NX-120 పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 110 కి.మీ నుండి 140 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. గ్రేస్ స్కూటర్ కూడా ఇంచు మించు ఇదే రేంజ్ ను కలిగి ఉంటుంది. కాగా, ఇవి రెండూ గరిష్టంగా గంటకు 55 కి.మీ వేగంతో ప్రయాణించగలవు.

పోయెస్ స్కూటర్లు - ఫీచర్లు
పోయెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, వీటిలో పూర్తి ఎల్ఈడి లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్‌లు, డిస్క్ బ్రేకులు మరియు ఫ్రంట్ అండ్ రియర్ కాంబి-బ్రేక్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు విశాలమైన లెగ్‌రూమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పోయెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇద్దరు పెద్దలు హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు. ఇవి ఐదు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటాయి.

ఎన్ఎక్స్-120 మరియు గ్రేస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రత్యేకమైన అంశం ఏంటంటే, వాటి వాడుకలో సౌలభ్యంగా ఉండటం. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లు మరియు P2P ఛార్జింగ్ పార్టనర్‌లతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ఎప్పుడైన మరియు ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే వెసలుబాటు కల్పిస్తుంది.

గంటకు 90 కిమీ వేగంతో వెళ్లే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇదిలా ఉంటే, పోయెస్ స్కూటర్స్ గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై కూడా పనిచేస్తోంది. ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు పోయెస్ జుయింక్ (Poise Zuink). ప్రస్తుతానికి ఈ స్కూటర్ అభివృద్ధి దశలో ఉంది, త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఓలా ఎస్1, ఏథర్ 450ఎక్స్ వంటి స్కూటర్లకు ధీటుగా ఉంటుంది. పోయెస్ స్కూటర్స్ ప్రస్తుతం బెంగుళూరులోని యశ్వంత్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది.


Click it and Unblock the Notifications








