ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర రూ.1.55 లక్షలు మాత్రమే..!
దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), భారత మార్కెట్లో తమ సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క ధర, ఫీచర్లు, బ్యాటరీ మరియు రేంజ్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
Recommended Video
హైదరాబాద్ కేంద్రగా పనిచేస్తున్న ప్యూర్ ఈవీ, గడచిన మార్చ్ నెలలో వెల్లడించిన తమ ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను ఇప్పుడు అధికారికంగా అమ్మకానికి అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్లో ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,54,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ప్యూర్ ఈవీ ఇప్పటికే భారత మార్కెట్లో వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, ఈట్రిస్ట్ 350 అనేది కంపెనీ లైనప్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా మరియు కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంటుంది.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసి, తయారు చేయబడిన మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను హైదరాబాద్‌లోని ప్యూర్ ఈవీ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రారంభ దశలో భాగంగా ఈట్రిస్ట్ 350 ఇ-బైక్ ను భారతదేశంలోని టైర్ I నగరాల్లో అందుబాటులో ఉంటుందని, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 100 డీలర్‌షిప్‌లలో ఈ ఎలక్ట్రిక్ బైక్ లభిస్తుందని ప్యూర్ ఈవీ పేర్కొంది.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్, దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంటుంది. కాబట్టి, ఈ ఎలక్ట్రిక్ బైక్ నడపడానికి తప్పనిసరిగా లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరం. ఇందులో పెద్ద 3.5kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను కూడా ప్యూర్ ఈవీ స్వయంగా తయారు చేసింది మరియు ఈ బ్యాటరీకి AIS 156 సర్టిఫికేట్ కూడా లభించింది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో ప్రధానంగా చెప్పుకోదగినది దాని బ్యాటరీ ప్యాక్ గురించి. ఈ బ్యాటరీ ఎటువంటి కఠినమైన ప్రయాణ వాతావరణాన్ని తట్టుకునేలా నిర్మించబడింది. అందుకే ప్యూర్ ఈవీ ఈట్రిస్ట్ 350 ఇ-బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్‌పై 5 సంవత్సరాల లేదా 50,000 కిమీ వారంటీని (ఏది ముందుగా ముగిస్తే అది) అందిస్తోంది. అంతేకాకుండా, ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఇ-బైక్ ప్రత్యేకించి భారతీయ రోడ్లకు అనుగుణంగా ఉండేలా అభివృద్ధి చేయబడిందని, భారత రోడ్లపై దీనిని విస్తృతంగా పరీక్షించిన తర్వాతనే ప్రజల ముందుకు తీసుకువచ్చామని కంపెనీ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ పరంగా, సాంప్రదాయ 150సీసీ పెట్రోల్ మోటార్‌సైకిళ్లకు పోటీగా ఉంటుంది. ఈట్రిస్ట్ 350 బైక్ లోడ్ కెపాసిటీ 150 కిలోలు. ఇది 84V 8A ఛార్జర్‌తో వస్తుంది, దీని సాయంతో ఇ-బైక్ ను పూర్తిగా చార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పంచ్ బ్లాక్, టాన్ రెడ్ మరియు సీ బ్లూ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ లో మొత్తం మూడు రైడ్ మోడ్స్ ఉంటాయి. వీటిలో మొదటిది డ్రైవ్ మోడ్, ఇది ఇ-బైక్ గరిష్ట వేగాన్ని గంటకు 60 కిలోమీటర్లకు పరిమితం చేస్తుంది. ఇకపోతే, రెండవ మోడ్‌ను క్రాస్ ఓవర్ అని పిలుస్తారు మరియు ఇది గరిష్ట వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లకు పరిమితం చేస్తుంది. ఇక మూడవది థ్రిల్ మోడ్, ఇది రైడర్‌కు ఇ-బైక్ యొక్క గరిష్ట శక్తిని అందిస్తుంది మరియు గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

రోజువారీ ఉపయోగం కోసం ప్యూర్ ఈట్రిస్ట్ 350 చాలా అనుకూలంగా ఉంటుందని ప్యూర్ ఈవీ పేర్కొంది. ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఓ సాధారణ ఎలక్ట్రిక్ బైక్‌గా మాత్రమే కాకుండా అధిక పనితీరు గల ఇ-బైక్‌గా కూడా అభివృద్ధి చేయబడింది. కాబట్టి, తక్కువ ధరలో శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న యువతరానికి ఈ ఇ-బైక్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఈ విభాగంలో Revolt RV400 మరియు Tork Kratos వంటి ఎలక్ట్రిక్ బైక్‌లతో పోటీపడనుంది.

ప్యూర్ ఈవీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఇప్లూటో 7జి (ePluto 7G) మరియు ఇట్రాన్స్ నియో (eTrance Neo) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. ఈ సంస్థకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. ప్యూర్ ఈవీలో అంతర్గత బ్యాటరీ తయారీ సౌకర్యం మరియు ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ఆధారంగా ఒక రీసెర్చ్ సెటప్ కూడా ఉంది. కంపెనీకి బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యొక్క ప్రధాన ప్రాంతాలపై పనిచేసే ప్రత్యేక ఆర్ అండ్ డి బృందాన్ని కూడా కలిగి ఉంది. భవిష్యత్తులో అనేక కొత్త మోడళ్లకు దారితీసే దీర్ఘ-శ్రేణి మరియు అధిక-పనితీరు గల లిథియం బ్యాటరీలను అభివృద్ధి చేయడం ఈ ఆర్ అండ్ డి యొక్క ప్రధాన లక్ష్యం.


Click it and Unblock the Notifications








