బ్యాటరీ పేలిన ఘటన నేపథ్యంలో 2000 ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి పిలిపిస్తున్న ప్యూర్ ఈవీ!
తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో నిన్న జరిగిన ప్యూర్ ఈవీ అగ్ని ప్రమాదం కారణంగా, ఓ 80 ఏళ్ల వృద్ధుడు మరియు మరో ముగ్గురికి గాయాలు కావడం ఘటనపై ప్యూర్ ఈవీ (Pure EV) సంస్థ అప్రమత్తమైంది. గత నెలలో చెన్నైలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి నమోదు కావడంతో ప్యూర్ ఈవీ ఇప్పుడు తాము విక్రయించిన ETrance Plus మరియు EPluto 7G మోడల్‌లకు చెందిన 2,000 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రీకాల్ చేసిన స్కూటర్లలో బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ వ్యవస్థను కంపెనీ ఉచితంగా తనిఖీ చేయనుంది.

ప్యూర్ ఈవీ ప్రకటన ప్రకారం, తమ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీలు యొక్క ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయబడతాయని, ఏదైనా అసమతుల్యత సమస్యల కోసం తాను బ్యాటరీని తనిఖీ చేస్తామని మరియు తమ BaTRics Faraday (లిథియం అయాన్ బ్యాటరీలలోని లోపాలను స్వయంచాలకంగా గుర్తించి మరియు సరిచేయగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హార్డ్‌వేర్) పరికరం ద్వారా వాటిని సరిచేస్తామని ప్యూర్ తమ ప్రకటనలో తెలిపింది. వీటికి అదనంగా BMS మరియు ఛార్జర్ క్యాలిబ్రేషన్ కూడా అవసరమైన విధంగా నిర్వహించబడతాయని ప్యూర్ ఈవీ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

గురువారం నాడు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇంటిలో చార్జ్ చేస్తున్న ప్యూర్ ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలడంతో 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం, వీరు స్కూటర్ నుండి బ్యాటరీని వేరు చేసి, ఇంటి గదిలో విడిగా ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని బి రామస్వామిగా గుర్తించారు. అతని కుమారుడు బి ప్రకాష్ ఏడాది కాలంగా ప్యూర్ ఈవీ (Pure EV) కి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు తండ్రిని కాపాడే క్రమంలో కుమారుడు ప్రకాష్, భార్య కమలమ్మ, కోడలు కృష్ణవేణి లకు కూడా కాలిన గాయాలయ్యాయి.

ఈ ఘటనలో నిజామాబాద్ పోలీసులు ప్యూర్ ఈవీ కంపెనీతో పాటుగా సంబంధిత డీలర్‌పై కూడా కేసు నమోదు చేశారు. వారిపై భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 304ఏ (నిర్లక్ష్యం కారణంగా మరణానికి కారణం కావడం) కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సదరు స్కూటర్ యూజర్ అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో బ్యాటరీని ఛార్జింగ్ పెట్టేందుకు వదిలేశానని, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అది పేలిపోయి తన తండ్రి, తల్లి, కొడుకులకు గాయాలయ్యాయని ప్రకాష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తండ్రి ఆస్పత్రిలో మరణించారు.

కాగా, ఈ సంఘటనపై ప్యూర్ ఈవీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో "తాము ఈ సంఘటనపై తీవ్రంగా చింతిస్తున్నామని మరియు బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని, తమ కస్టమర్ డేటాబేస్‌లో ఈ వాహనం లేదా దానికి సర్వీస్ చేసిన దాఖలాలు లేవని, ఒకవేళ దీనిని సెకండ్ హ్యాండ్ సేల్ ద్వారా ఏమైనా కొనుగోలు చేశారా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ తెలిపింది. "మా కస్టమర్ డేటాబేస్ నుండి, మీడియాలో కోట్ చేయబడిన వినియోగదారునిని ప్యూర్ ఈవీ నుండి నేరుగా విక్రయం లేదా సర్వీస్‌కి సంబంధించిన రికార్డులు మా వద్ద లేవు. ఒకవేళ మా డీలర్ వాహనాన్ని ఎవరైనా మొదటి కొనుగోలుదారుల నుండి అతను సెకండ్ హ్యాండ్ సేల్ ద్వారా కొనుగోలు చేసి ఉంటారనే కోణంలో అన్వేషిస్తున్నాము" అని ప్యూర్ ఈవీ పేర్కొంది.

కాగా, ప్యూర్ ఈవీ ప్రకటించిన ఈ రీకాల్ గురించి తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా కస్టమర్లందరికీ తెలియజేస్తామని, ఈ క్యాంపైన్ లో భాగంగా సర్వీస్ సెంటర్లకు తీసుకువచ్చే అన్ని ప్యూర్ ఈవీ వాహనాలను జాగ్రత్తగా తనిఖీ చేసి, ప్రమాదాలకు గల కారణాలు ఏవైనా ఉంటే అన్వేషిస్తామని మరియు వాటిని ఉచితంగా సరిచేస్తామని కంపెనీ తెలిపింది. ప్యూర్ ఈవీ ప్రమాదంలో వ్యక్తి మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన కంపెనీ, స్థానిక దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. ఫిర్యాదుదారు నుండి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టాలని తమ డీలర్‌ను ఆదేశించినట్లు కంపెనీ తెలిపింది.

ప్యూర్ ఈవీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఇప్లూటో, ఇప్లూటో 7జి, ఇట్రాన్స్ నియో మరియు ఇట్రాన్స్ ప్లస్ అనే నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇప్లూటో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.8 కిలోవాట్అవర్ పోర్టబల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 85 కిమీ రేంజ్ ని ఆఫర్ చేస్తుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 25 కిమీగా మాత్రమే ఉంటుంది. అదే ఇప్లూట్ 7జి విషయానికి వస్తే, ఇందులో 2.5 కిలోవాట్అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 90-120 కిమీ రేంజ్ ను అందిస్తుంది మరియు ఇది గరిష్టంగా గంటకు 60 కిమీ వేగంతో పరులుగు తీస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.76,999 మరియు రూ.88,999 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

ప్యూర్ ఇట్రాన్స్ నియో విషయానికి వస్తే, ఇందులో 2.5 కిలోవాట్అవర్ ఆల్ట్రా పెర్ఫార్మెన్స్ సెల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 90-120 కిమీ రేంజ్ ను అందిస్తుంది మరియు ఇది గరిష్టంగా గంటకు 60 కిమీ వేగంతో పరులుగు తీస్తుంది. ఇది 150 కేజీల వరకూ పేలోడ్ ను మోయగలదు. అదే ఇట్రాన్స్ ప్లస్ విషయానికి వస్తే, ఇందులో 1.8 కిలోవాట్అవర్ ఆల్ట్రా పెర్ఫార్మెన్స్ సెల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 85 కిమీ రేంజ్ ని ఆఫర్ చేస్తుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 25 కిమీగా మాత్రమే ఉంటుంది. ఇది 120 కేజీల పేలోడ్‌ను మోయగలదు. వీటి ధరలు వరుసగా రూ.83,999 మరియు రూ.72,999 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








