రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోయే నెక్స్ట్ బైక్ ఇదే.. హంటర్ 350 (Royal Enfield Hunter 350)
భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్లో కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, అమ్మకాల పరంగా తన మార్కెట్ వాటాను ఎప్పటికప్పుడు పెంచుకుంటోంది. ప్రస్తుతం బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350. కాగా, ఇప్పుడు ఈ 350సీసీ విభాగంలో కంపెనీ మరొక కొత్త స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ ను విడుదలచేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ గతంలో ఆవిష్కరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ప్లాట్‌ఫారమ్ (రాయల్ ఎన్‌ఫీల్డ్ J-ప్లాట్‌ఫారమ్) ఆధారంగా తయారవుతున్నదే ఈ హంటర్ 350 మోటార్‌సైకిల్. తాజాగా ఈ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు మొదటి చిత్రాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌కు సంబంధించి లీక్ అయిన సమాచారం ప్రకారం, దాని ధర మరియు ప్రారంభ తేదీ వంటి కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. కొత్త హంటర్ బైక్ ను కంపెనీ ఇప్పటికే టెస్ట్ రన్ చేస్తున్న సమయంలో పలుమార్లు కెమరాకు చిక్కింది.

కాగా, ఇప్పుడు తాజా లీకైన చిత్రాలు రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ గురించి మరిన్ని ఆసక్తకర విషయాలను వెల్లడిస్తున్నాయి. తాజా చిత్రాలను బట్టి చూస్తే, కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టియర్-డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, పొడవైన సింగిల్-పీస్ సీటు, గుండ్రటి హెడ్‌ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్‌లు, రియర్-వ్యూ మిర్రర్‌లు మరియు వెనుక బాగం డిజైన్ కొద్దిగా పైకి లేపబడినట్లుగా ఉండి ఇది స్క్రాంబ్లర్-టైప్ మోటార్‌సైకిల్ అని స్పష్టంగా తెలియజేస్తుంది.

అంతే కాకుండా, చిత్రాలు లో సీటింగ్ పొజిషన్, వెడల్పాటి హ్యాండిల్‌బార్లు మరియు కొద్దిగా మధ్యలో అమర్చిన ఫుట్ పెగ్‌లను కూడా వెల్లడి చేస్తున్నాయి. రాబోయే హంటర్ మోటార్‌సైకిల్ లోని ఈ రైడింగ్ పొజిషన్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లైన మీటియోర్, క్లాసిక్, బుల్లెట్ మరియు మరికొన్ని ఇతర మోడళ్లతో పోల్చితే కొంచెం స్పోర్టియర్ రైడింగ్ లక్షణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఈ బ్రాండ్ యొక్క పాపులర్ J-ప్లాట్‌ఫారమ్ మరియు స్క్రాంబ్లర్ లాంటి స్టైలింగ్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ ప్రస్తుత రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కెల్లా అత్యంత తేలికైనదిగా ఉంటుంది. అంతేకాకుండా, కంపెనీ దీని తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు ప్రస్తుత మీటియోర్ 350 మకియు క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్ల మాదిరిగానే అదే 349సీసీ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

అంటే కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ లోని అదే ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ యొక్క గేర్ నిష్పత్తులలో ఈ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ క్యారెక్టర్ కు తగినట్లుగా ఏవైనా మార్పులు చేర్పులు చేస్తుందో లేదో ప్రస్తుతానికి ఖచ్చితంగా తెలియదు.

అంతేకాకుండా, రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ 'J1C1' మరియు 'J1C2' అనే కోడ్‌నేమ్‌తో రెండు వేరియంట్‌లలో అందించబడుతుందని కూడా లీక్ అయిన సమాచారం వెల్లడిస్తోంది. ఈ రెండు మోడళ్లలో, 'J1C1' మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది, అయితే 'J1C2' ను అగ్రెసివ్ ధరతో విక్రయించడానికి కంపెనీ దీనిని బేసిక్ ఫీచర్లతో విక్రయిస్తుందని భావిస్తున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ మార్కెట్లో విడుదలైనప్పుడు దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.30 లక్షల నుండి రూ. 1.40 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇది ఈ విభాగంలో యమహా ఎఫ్‌జెడ్25, సుజుకి జిక్సర్ మరియు బజాజ్ పల్సర్ 250 వంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలుస్తుంది. అంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం ఐకానిక్ క్లాసిక్ డిజైన్ మోడళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, ఆధునిక మోటార్‌సైకిళ్లతో సైతం పోటీపడేలా ఈ హంటర్ 350 బైక్‌ని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సమాచారం ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ జూలై మధ్యలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది మరియు దాని డెలివరీలు ఒక నెల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మే 2022 నెలలో 133 శాతం పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్..
ఇదిలా ఉంటే, భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం మైలేజీకి ప్రాధాన్యతనివ్వకుండా ఈ ప్రీమియం మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. దీంతో గత నెలలో ఈ బ్రాండ్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కంపెనీ విడుదల చేసివ వివరాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన మే 2022 నెలలో మొత్తం 63,643 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

మే 2021 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయించిన 27,294 మోటార్‌సైకిళ్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 133 శాతం పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ అమ్మకాలు మందగించాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. మే 2022 నెలలో కంపెనీ మొత్తం 10,118 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేసింది. బుల్లెట్ 350, క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350 వంటి వాటితో సబ్ 350 సీసీ మోటార్‌సైకిళ్లు మార్కెట్లో జోరుగా అమ్ముడవుతున్నాయి.
Source: Bikewale


Click it and Unblock the Notifications








