డీలర్ స్టాక్ యార్డులో కనిపించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350), లాంచ్‌కు సిద్ధమైనట్లేనా..?
భారతదేశపు ప్రీమియం టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త మోటార్‌సైకిల్ హంటర్ 350 (Hunter 350). గత కొంత కాలంగా భారత రోడ్లపై టెస్టింగ్ దశలో కనిపించిన ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు హఠాత్తుగా ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్ స్టాక్ యార్డులో ప్రత్యక్షమైంది. ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా, కస్టమర్లకు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉండే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిళ్లు సదరు డీలరు వద్ద చాలానే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు ఇందుకు సంబంధించిన స్పై ఫొటో ఒకటి ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది. దీన్నిబట్టి చూస్తుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) భారత మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటి వరకూ క్లాసిక్ మోటార్‌సైకిళ్లు, క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు మరియు కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిళ్లను కూడా అందించింది. ఈ బ్రాండ్ తొలిసారిగా ఓ స్క్రాంబ్లర్ టైప్ లైట్ వెయిట్ మోటార్‌సైకిల్ ను ఇప్పుడు హంటర్ 350 రూపంలో మన ముందుకు తీసుకురాబోతోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుండి మనం ఇలాంటి డిజైన్ తో ఉన్న మోటార్‌సైకిల్ ను ఇదివరకెన్నడూ చూడలేదు. కంపెనీ ఈ కొత్త రకం మోటార్‌సైకిల్ ను తమ డీలర్ స్టాక్ యార్డులలో స్టాక్ చేయడాన్ని చూస్తుంటే, మార్కెట్లో దీని విడుదల చేసిన వెంటనే డెలివరీలకు సిద్ధంగా ఉండేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోయే అత్యంత చవకైన మోటార్‌సైకిల్ అనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో, కంపెనీ డిమాండ్ ను భారీ స్థాయిలో అంచనా వేస్తోంది.

అందుకే, డిమాండ్ కు తగినట్లుగా సప్లయ్ అందుబాటులో ఉంచేందుకు కంపెనీ హంటర్ 350 ముందుగా డీలర్ల వద్ద స్టాక్ చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 డిజైన్ పరంగా మాత్రమే కొత్త మోటార్‌సైకిల్. ఎందుకంటే, ఇది దాని ఫ్రేమ్, ఇంజన్ వంటి అనేక ఇతర పరికరాలు మరియు విడిభాగాలను ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Meteor 350) తో పంచుకుంటుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ యొక్క స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి.

ఈ స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యంత తేలికైన మరియు అతి చురుకైన మోటార్‌సైకిల్ అని తెలుస్తోంది. ఈ బైక్ లో తగ్గిన ఫీచర్ల కారణంగా, దీని ధర కూడా తక్కువగా ఉండొచ్చని అంచనా వేయబడింది. బహుశా ఇది (హంటర్ 350) రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్ లోనే అత్యంత సరసమైన మోటార్‌సైకిల్ గా ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ యొక్క తాజా ఫొటోలను చూస్తుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నిటారుగా ఉండ్ స్పోర్టి రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మోటార్‌సైకిల్ లో మిడ్-సెట్ ఫుట్ పెగ్‌లు, వెడల్పాటి హ్యాండిల్ బార్, షార్ట్ ఎగ్జాస్ట్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్, గుండ్రటి టెయిల్ ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్‌లు మరియు రియర్-వ్యూ మిర్రర్లు, స్క్లాంబ్లర్ లుక్ ని తెచ్చిపెట్టే సింగిల్ పీస్ సీట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ను కంపెనీ గతంలో విడుదల చేసిన క్రూయిజర్ బైక్ మీటియోర్ 350 ని తయారు చేసిన అదే ప్లాట్‌ఫారమ్ (రాయల్ ఎన్‌ఫీల్డ్ J-ప్లాట్‌ఫారమ్) పై ఆధారపడి తయారు చేయనున్నారు.

ఇటీవల ఆన్‌లైన్ లో ఈ కొత్త మోటార్‌సైకిల్ కు సంబంధించి లీకైన స్పెసిఫికేషన్‌ల ప్రకారం, హంటర్ 350 బైక్ కేవలం 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు మరియు 1,055 మిమీ ఎత్తును మాత్రమే కలిగి ఉండి, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కెల్లా పరిమాణంలో అతి చిన్నదిగా ఉంటుంది. అంతేకాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ వీల్‌బేస్ కూడా కేవలం 1,370 మిమీగా మాత్రమే ఉంటుంది. అయితే, ఈ వాహనం యొక్క స్థూల బరువు (గ్రాస్ వెయిట్) సుమారు 360 కేజీలుగా రేట్ చేయబడింది.

ఇదే J-ప్లాట్‌ఫామ్ ను పంచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ తో పోలిస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ 85 మిమీ తక్కువ పొడవును, 45 మిమీ తక్కువ వెడల్పును, 85 మిమీ తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది మరియు దీని వీల్‌బేస్ కూడా 35 మిమీ తక్కువగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ కొలతల కారణంగా, హంటర్ 350 బరువు మీటియోర్ 350 బరువు కన్నా 11కిలోలు తక్కువగా ఉంటుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ సింగిల్-ఛానల్ ఏబిఎస్ తో వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్‌ను అందిస్తుందో లేదో ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.

ఆన్‌లైన్ లో లీకైన పత్రాలు హంటర్ 350 యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడి చేశాయి. కంపెనీ ఇందులో మీటియోర్ 350 మరియు క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన అదే 349.34 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ను ఉపయోగించింది. ఈ ఇంజన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 19.94 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. అయితే, మోటార్‌సైకిల్ యొక్క స్పోర్టీ క్యారెక్టర్‌కు సరిపోయేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇందులో గేర్ రేషియోలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందో తెలియదు. ఇక ధర విషయానికి వస్తే, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసినప్పుడు దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.30 లక్షల నుండి రూ. 1.40 లక్షలుగా ఉండొచ్చని అంచనా. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








