రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411) విడుదల; ధర తెలిస్తే వావ్ అనాల్సిందే..!
ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ "రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411" (Royal Enfield Scram 411) ను కంపెనీ నేడు దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత విపణిలో కొత్త స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ ధరలు రూ.2.03 లక్షల నుండి రూ.2.08 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ సరికొత్త స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ ను మార్కెట్లో విడుదల చేయడానికి ముందే, భారత రోడ్లపై దీనిని విస్తృతంగా పరీక్షించింది. పలు సందర్భాల్లో ఈ మోడల్ యొక్క స్పైచిత్రాలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ అయిన హిమాలయన్ (Himalayan) ను ఆధారంగా చేసుకొని కొత్త స్క్రామ్ 411 (Scram 411) ను రూపొందించారు. కాబట్టి, ఈ రెండు మోడళ్లలో డిజైన్, ఇంజన్ మరియు పరికరాలలో కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి.

అయితే, చాలామంది మొదటి చూపులో ఈ కొత్త బైక్‌ను అప్‌డేటెడ్ చేయబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ అని పొరపాటు పడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇదొక కొత్త (స్క్రాంబ్లర్) బాడీ టైప్ తో వచ్చిన మోడల్ మరియు ఇది పేరు సూచించినట్లుగానే కొత్త స్క్రామ్ 411 ఒక స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్. స్క్రామ్ 411 చూడటానికి ప్రస్తుత రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan) యొక్క టోన్-డౌన్ వెర్షన్ గా ఉంటుంది. కాకపోతే, ఈ రెండు మోడళ్లను వేరు చేసే ఫీచర్లు ఇందులో చాలానే ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 లో ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్, ఫోర్క్ గైటర్‌లు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ వంటి డిజైన్ లు కూడా హిమాలయన్ మోడల్ ను తలపిస్తాయి. అయితే, ఇందులోని హెడ్‌ల్యాంప్ యూనిట్ హిమాలయన్‌లోని ఫిక్స్‌డ్ యూనిట్‌లా కాకుండా హ్యాండిల్‌బార్‌తో పాటుగా కదిలే ఫ్లెక్సిబల్ యూనిట్‌గా ఉంటుంది. ఇక ఇందులోని ఇతర మార్పులను గమనిస్తే, ముందు వైపున చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ష్రౌడ్‌లు మరియు వెనుకవైపు సింపుల్-పీస్ గ్రాబ్ రైల్ ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411ని రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ నుండి వేరు చేయడానికి కంపెనీ ఇందులో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోల్చితే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మరింత రోడ్-ఫోకస్డ్ వెర్షన్ కావడంతో, కంపెనీ ఇందులో ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ 21 ఇంచ్ ఫ్రంట్ వీల్‌కు బదులుగా రోడ్-బయాస్డ్ మరియు ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ అయిన 19 ఇంచ్ స్పోక్డ్ ఫ్రంట్ వీల్‌ను మరియు వెనుక వైపు 17 ఇంచ్ స్పోక్డ్ వీల్‌ను జోడించింది. ఈ రెండు చక్రాలపై ఇటు ఆఫ్-రోడ్ మరియు అటు ఆన్-రోడ్ ప్రయోజనం కోసం ఉపయోగపడేలా సియట్ గ్రిప్ డ్యూయల్ పర్పస్ టైర్‌లను అమర్చారు.

ఇక ఇందులో లభించే ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, స్క్రామ్ 411 బైక్‌లో ట్విన్-పాడ్ అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో ఒకటి ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కోసం ఉపయోగించబడుతుంది. మీటియోర్ 350 (Meteor 350) లో ఉపయోగించిన టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్‌ను ఈ స్క్రామ్ 411లో కూడా చూడొచ్చు. కాకపోతే, ఈ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మేక్ ఇట్ యువర్స్ (Royal Enfield Make It Yours) ప్రోగ్రామ్ ద్వారా ఆప్షనల్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మెకానికల్స్ విషయానికి వస్తే, ముందువైపు 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ కూడా డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. అలాగే, ముందు వైపు 190 మిమీ ట్రావెల్‌తో కూడిన 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు 180 మమీ వీల్ ట్రావెల్‌తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి. దీని మొత్తం బరువు కేవలం 185 కేజీలు మాత్రమే ఉంటుంది (హిమాలయన్ బరువు 190 కేజీలు).

ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, హిమాలయన్ లో ఉపయోగించిన అదే 411సిసి ఇంజన్ ను ఈ కొత్త మోడల్ లో కూడా ఉపయోగించారు. ఇందులోని 411 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ స్లిక్-షిఫ్టింగ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 కంపెనీ ఏడు ఆకర్షణీయమైన రంగులలో విక్రయిస్తోంది. కలర్ ఆప్షన్ ను బట్టి వాటి ధరలు మారుతూ ఉంటాయి.
స్క్రామ్ 411 ధరల వివరాలు:
గ్రాఫైట్ రెడ్ - రూ. 2.03 లక్షలు
గ్రాఫైట్ బ్లూ - రూ. 2.03 లక్షలు
గ్రాఫైట్ యల్లో - రూ. 2.03 లక్షలు
వైట్ ఫ్లేమ్ - రూ. 2.08 లక్షలు
సిల్వర్ స్పిరిట్ - రూ. 2.08 లక్షలు
బ్లేజింగ్ బ్లాక్ - రూ. 2.05 లక్షలు
స్కైలైన్ బ్లూ కలర్ - రూ. 2.05 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)


Click it and Unblock the Notifications








