2022 మే నెలలో 'సుజుకి మోటార్‌సైకిల్' అమ్మకాలు ఇలా ఉన్నాయి..!!
ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' (Suzuki Motorcycle India) ఎట్టకేలకు తన 2022 మే నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం గత నెలలో కంపెనీ మొత్తం 71,526 యూనిట్ల బైక్స్ మరియు స్కూటర్లను విక్రయించినట్లు తెలిపింది. కంపెనీ యొక్క అమ్మకాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

'సుజుకి మోటార్‌సైకిల్' అందించిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నెలకంటే కూడా మే నెలలో విక్రయాలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. మే నెలలో అమ్మకాలు ఏప్రిల్ నెలకంటే 0.6% తగ్గుదలను నమోదు చేశాయి. ఏప్రిల్ నెలలో కంపెనీ అమ్మకాలు 71,987 యూనిట్లు (మే నెలలో మొతం అమ్మకాలు 71,526 యూనిట్లు).

2022 మే నెలలో విక్రయించిన 71,526 యూనిట్లలో కంపెనీ దేశీయ మార్కెట్లో 60,518 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. కంపెనీ యొక్క దేశీయ అమ్మకాలలో మే నెల అమ్మకాలు మునుపటి నెలకంటే కూడా 11.4% పెరిగినట్లు తెలుస్తుంది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి ఇటీవల విడుదల చేసిన సుజుకి వి-స్ట్రోమ్ ఎస్‌ఎక్స్ చాలా వరకు సహాయపడిందని తెలుస్తుంది.

ఇక ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ 2022 మే నెలలో 11,008 యూనిట్లను ఎగుమతి చేసింది. 2022 ఏప్రిల్ నెలలో 17,660 యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు ఏప్రిల్ నెలకంటే కూడా మే నెలలో 37.7% తగ్గాయి.

భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా విజృంభించిన కారణంగా దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ కారణంగా కంపెనీ 2021 మే నెలలో తన అమ్మకాల గణాంకాలను వెల్లడించలేదు. కావున గత సంవత్సరం మే నెలలో ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి అనేది స్పష్టంగా తెలియదు.

కంపెనీ యొక్క అమ్మకాలపైనా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఎండి 'సతోషి ఉచిడా' మాట్లాడుతూ.. కంపెనీ కరోనా మహమ్మారి సమయంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ముందుకు సాగింది, అయితే ప్రస్తుతం అమ్మకాలు కొంత మెరుగుపడ్డాయి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

సుజుకి కంపెనీ భారతీయ మార్కెట్లో తన వి-స్టోర్మ్ ఎస్ఎక్స్ 250 అడ్వెంచర్ బైక్ విడుదల చేసింది. దీని ధర రూ. 2.11 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కంపెనీ యొక్క జిక్సర్ 250 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడింది. భారతీయ మార్కెట్లో ఈ అడ్వెంచర్ బైక్ కెటిఎమ్ 250 అడ్వెంచర్, బెనెల్లీ టిఆర్కె 251 మరియు యెజ్ది అడ్వెంచర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇదిలా ఉండగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా చిన్న ఇంజిన్ గల మోటార్‌సైకిళ్ల ఎగుమతికి భారతదేశాన్ని ప్రధాన ఎగుమతి కేంద్రంగా మార్చాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటువైపుగా కూడా తన ప్రయాణం వేగవంతం చేసింది. కావున రానున్న రోజుల్లో చిన్న కెపాసిటీ (125-300 సిసి) మోటార్‌సైకిళ్లకు ప్రధాన తయారీ కేంద్రంగా భారత్ అవతరిస్తుందని ఆశిస్తున్నాము.

సుజుకి మోటార్‌సైకిల్స్ యొక్క ఎగుమతులు గత ఏడాది విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరం కంపెనీ 1,45,000 యూనిట్ల ఎగుమతులను నమోదు చేసింది. ప్రస్తుతం కంపెనీ భారతదేశానికి సమీపంలోని నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు భూటాన్ వంటి దేశాలకు మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా మరియు జపాన్ వంటి దేశాలకు కూడా తన వాహనాలను విరివిగా ఎగుమతి చేస్తోంది.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంట్‌లో 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. కావున ఉత్పత్తి మరియు విక్రయాలు కూడా రానున్న రోజుల్లో మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా కూడా ప్రస్తుతం ఇతర వాహన తయారీ కంపెనీల మాదిరిగానే ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ గత కొన్ని రోజులుగా బర్గ్‌మ్యాన్ మ్యాక్సీ స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను టెస్ట్ చేస్తోంది. కావున ఇది త్వరలోనే భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది.


Click it and Unblock the Notifications








