ఎలక్ట్రానిక్ దిగ్గజం Acer నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు అదరహో..
దేశీయ మార్కెట్లో ఇప్పటికే స్టార్టప్‌లు ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా, ప్రముఖ ఆటో కంపెనీలు కూడా ఈవీలను రూపొందిస్తున్నాయి. ఈవీల తయారీలో అత్యధికంగా టెక్ దిగ్గజాలే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో ఎలక్ట్రానిక్ దిగ్గజం చేరనుంది.
తైవాన్‌కు చెందిన MNC హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏసర్(Acer) ఎలక్ట్రిక్ వాహనాల జాబితాలోకి తాజాగా చేరింది. ల్యాప్‌టాప్ ప్రొడక్షన్ రంగంలో టాప్‌లో కొనసాగుతున్న ఏసర్.. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, MUVI- 125 4G లాంచ్‌తో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది.

గురువారం(సెప్టెంబర్ 14) గ్రేటర్ నోయిడాలో జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2023లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఏసర్ ఆవిష్కరించింది. దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ అయిన eBikeGo భాగస్వామ్యంతో Acer ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తోంది. ఈ స్కూటర డిజైన్, తయారీని భారతీయ కంపెనీ eBikeGo నిర్వహిస్తుంది. MUVI 125 4G దేశీయ మార్కెట్లో ఏసర్ బ్రాండ్ పేరుతో మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా మారనుంది.
భవిష్యత్తులో ఇ బైక్‌లు, ఇ స్కూటర్లు ఇంకా ఇ ట్రైక్స్ వంటి మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. పట్టణ కమ్యూటర్లను లక్ష్యంగా చేసుకుని Acer ప్రధానంగా MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టనుంది.
ఈ స్కూటర్ డిజైన్‌ను పరిశీలిస్తే.. ఇది తేలికపాటి ఛాసిస్‌తో వస్తుంది. 16 అంగుళాల వీల్స్‌పై నడుస్తుంది. ముందు వైపున హైడ్రాలిక్ ఫోర్క్, వెనుక వైపున అధునాతన షాక్ అబ్జార్బర్ సిస్టమ్‌తో వస్తుంది. తద్వారా రైడర్‌కు అనుకూలంగా ఉంటుందని Acer కంపెనీ స్పష్టం చేసింది.
తేలికపాటి డిజైన్‌తో పూర్తి చేసిన MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 83 కిలోలు మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 48V 35.2Ah యొక్క రెండు స్వాపబుల్ బ్యాటరీలు ఉన్నాయి. ఇవి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌పై 80 కి.మీ రేంజ్ ఇస్తుంది.
Acer MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 75 km వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ పూర్తి ఛార్జ్ అవ్వడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఇందులో స్వాపబుల్ బ్యాటరీ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి స్కూటర్‌ను ఛార్జింగ్ చేయడానికి కస్టమర్లకు ఈజీగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.
దీని వల్ల మీరు ఎక్కడ ఉన్నా కూడా ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీని సులభంగా తొలగించి ఛార్జ్ చేసుకోవచ్చు. దేశంలో బ్యాటరీ మార్పిడి స్టేషన్ నెట్‌వర్క్ విస్తరిస్తుండటంతో.. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలను సెకన్లలో మార్చవచ్చు. దీని ద్వారా రైడర్లు ఏ టెన్షన్ లేకుండా ఈజీగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
ఇందులో 3 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 125 cc స్కూటర్‌లతో సమానంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. 2021లో, ఫ్రెంచ్ కంపెనీ టోరోట్ ఉత్పత్తి అయిన Muvi 125 4G స్కూటర్ తయారీ హక్కులను eBikeGo సొంతం చేసుకుంది. ఇప్పటికే ఐరోపా మార్కెట్‌లో విక్రయిస్తున్న ఈవీలు ఏసర్ ద్వారా భారత్‌కు రానున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు కాన్ఫిగరేషన్‌లలో బ్లూ టూత్‌తో 4-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంది. దేశీయ మార్కెట్లో దీపావళి సందర్భంగా నవంబర్‌లో MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నారు.
ఈ స్కూటర్ హీరో ఎలక్ట్రిక్, ఆంపియర్, ఒకినావా, జాయ్ ఇ బైక్, హోప్, రివర్ మరియు ప్యూర్ ఎలక్ట్రిక్ బ్రాండ్‌ల ఉత్పత్తులతో పోటీపడనుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దాని ఎర్గోనామిక్ డిజైన్, ఎకో-ఫ్రెండ్లీ పనితీరు మరియు స్వాప్ చేయగల బ్యాటరీతో EV మార్కెట్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








