పాత రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చిన అభిమాని.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీ రేంజ్..
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా.. ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. ఆటో మేకర్లు పోటాపోటీగా అధునాతన ఫీచర్లతో ఈవీలను తయారుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ బ్రాండ్‌లు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
భవిష్యత్తులో భారతదేశంలో ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కాగా అంతవరకూ వేచిచూడటం కష్టంగా ఉందని భావించాడేమో ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమాని తన పాత క్లాసిక్ మోడల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు.

బెంగళూరుకు చెందిన బుల్లెటీర్ కస్టమ్స్ ఈ పాత రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనంగా మార్చింది. పాత రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఈవీగా అద్భుతంగా మార్చిన ఈ ప్రయోగం వెనుక సూత్రధారి బైక్ యజమాని రికీ. 1984 రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టాండర్డ్ బైక్ గతంలో రికీ తండ్రికి చెందినది.
రికీకి చెందిన పాత రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇది ఇప్పుడు కొత్త లుక్‌తో ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చబడింది. దీని ధరను చూసుకుంటే బ్యాటరీ పరిమాణం, ఎంచుకున్న మోటారు శక్తి ఆధారంగా ధర ఉంటుందని రికీ వెల్లడించారు. అంచనా వ్యయం రూ. 3 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు పైగానే ఖర్చవుతుందని పేర్కొన్నారు.

ఈవీగా మాడిఫికేషన్ తర్వాత ఈ బైక్‌లో ఎలక్ట్రిక్ ఫీచర్లు మాత్రమే కాకుండా, అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇది హ్యాండిల్‌బార్‌లపై స్టైలిష్ క్లిప్, కస్టమ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ యూనిట్, మెషిన్ ఫినిష్డ్ వీల్స్, రెండు చివర్లలో సింగిల్ డిస్క్ సెటప్‌లు, ఫ్యాట్ టైర్లు మరియు రౌండ్ హెడ్‌లైట్‌లను కలిగి ఉంది.
ఒరిజినల్ ఛాసిస్ క్రింద ఇంజిన్ స్థలంలో ఫుల్ బ్యాటరీ ప్యాక్‌తో ఈ బైక్‌ను మార్పులు చేశారు. ఇంధన ట్యాంక్ స్థానంలో బ్యాటరీ, మోటార్ కంట్రోలర్‌ను అమర్చారు. ఈ బైక్‌లో 5 KW రేర్ హబ్ మోటార్‌ను పొందు పరిచారు. కాగా ఈ మాడిఫికేషన్ బైక్‌లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని రికీ తెలిపారు. ఒక్కో ఛార్జ్‌కు 90 కి.మీల రేంజ్‌ను అందజేస్తుందని వెల్లడించారు.

వారంలోపే బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చినట్లు రికీ పేర్కొన్నారు. క్రోమ్ ఫినిషింగ్ వింగ్స్‌తో కూడిన భారీ ఇంజిన్‌ను పోలి ఉండే 'కస్టమ్ మేడ్ బ్యాటరీ కవర్' బైక్ లుక్‌ను మరింత పెంచింది. ఈ బైక్ రైడింగ్ పొజిషన్ హార్లే డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ 750ని గుర్తుకు తెస్తుందనడంలో సందేహం లేదు. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ లుక్, డిజైన్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఏదేమైనా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది దాని ఇంజిన్ మరియు సౌండ్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఎగ్జాస్ట్ నోట్ లేకపోతే అభిమానులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. పర్యావరణ హితమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీవైపు ఆటో మేకర్లు మొగ్గు చూపుతుండగా, వినియోగదారులు సైతం పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.


Click it and Unblock the Notifications








