ఇండియన్ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ లాంచ్ - పూర్తి వివరాలు
ఆధునిక కాలంలో బైక్ ప్రియులు ఎప్పటికప్పుడు కొత్త ఇకులను ఉపయోగించడానికి సుముఖత చూపిస్తున్నారు. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థలు కూడా కొత్త బైకులు లేదా అప్డేటెడ్ బైకులను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki) ఎట్టకేలకు ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర ఎంత, డిజైన్ మరియు ఫీచర్లలో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
కవాసకి ఇండియా లాంచ్ చేసిన బైక్ నింజా 300 (Ninja 300). ఈ బైక్ ఒక దశాబ్ద కాలంగా మార్కెట్లో ఉంది. అయితే ఇప్పుడు ఇది కొన్ని ఆధునిక హంగులతో లాంచ్ అయింది. ఈ బైక్ ధర రూ.3.43 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). కంపెనీ సుమారు 10 సంవత్సరాలకు ముందు దీన్ని రూ. 3.50 లక్షల ధరతో ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఈ బైక్ ధర తగ్గినట్లు తెలుస్తోంది.

కొత్త కవాసకి నింజా 300 బైక్ ఇప్పుడు ఏబీఎస్ ఫీచర్ పొందటమే కాకుండా రెండు కొత్త రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి క్యాండీ లైమ్ గ్రీన్ మరియు మెటాలిక్ మూండస్ట్ గ్రే కలర్స్. ఇవి రెండు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. డిజైన్ పరంగా ఇది దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అదే లైటింగ్ ఆప్షన్, బ్రాండ్ లోగో వంటివన్నీ అలాగే ఉండటం చూడవచ్చు.
ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. బైక్ స్పీడ్, ఫ్యూయెల్ ఇండికేటర్ మొదలైన వివిరాలను తెలుపడానికి ఇందులో అదే డిస్ప్లే కలిగి ఉంటుంది. పొట్టి రైడర్లకు కూడా అనుకూలంగా ఉండటానికి ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 780 మిమీ వరకు ఉంటుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

కవాసకి నింజా 300 బైక్ 296-సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 11000 rpm వద్ద 39 హార్స్ పవర్ మరియు 11000 rpm వద్ద 26.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి రైడర్ బెస్ట్ రైడింగ్ అనుభూతిని పొందవచ్చని భావిస్తున్నాము. పర్ఫామెన్స్ పరంగా ఇది దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది.
నింజా 300 బైక్ డైమండ్ ఫ్రేమ్ కలిగి ఉంటుంది. ఇందులో 37-మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపు గ్యాస్ ఛార్జ్డ్ మోనోశాక్ అబ్జార్బర్ ఉంటుంది. ముందు భాగంలో 290మిమీ పెటల్ డిస్క్, వెనుకవైపు 220మిమీ పెటల్ డిస్క్ వంటివి ఉన్నాయి. సుమారు 179 కేజీల బరువున్న ఈ బైక్ 110/70-17సెక్షన్ ఫ్రంట్ టైర్, 140/70-17సెక్షన్ రియర్ టైర్ పొందుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 140 మిమీ కావడం గమనించదగ్గ విషయం.

భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త కవాసకి నింజా 300 బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310, ఏప్రిలియా ఆర్ఎస్ 457, కేటీఎమ్ RC 390 మరియు యమహా కంపెనీ యొక్క ఆర్3 బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈహే ఈ బైక్ కవాసకి ప్రేమికులను తప్పకుండా ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








