Ampere New E Scooter ఆంపియర్ నుంచి త్వరలో కొత్త ఇ స్కూటర్ లాంచ్.. కశ్మీర్ టు కన్యాకుమారి టెస్ట్ రన్.!!
దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీల్లో ఆంపియర్(Ampere) ఒకటి. కాగా ఆంపియర్ నుంచి త్వరలో అతి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్(Ampere Electric Scooter)ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త ఇ స్కూటర్ భారీ టెస్ట్ రన్‌లో ఉందని నివేదికలు వెల్లడించాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత మార్కెట్లో ఆంపియర్ త్వరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) మోడల్‌ను లాంచ్ చేయనుంది. NXG అనే పేరుతో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేయనుంది. కాగా ఆంపియర్ కంపెనీ ఈ స్కూటర్ టెస్టింగ్‌ను ఇటీవల ప్రారంభించగా.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 1,500 కిలోమీటర్ల మేర యాత్రను చేపట్టింది.

ఈ భారీ టెస్ట్ రన్ ద్వారా దేశంలోని అన్ని రకాల భూభాగాలు మరియు రహదారులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నిరూపించడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఆంపియర్ నుంచి వస్తున్న స్కూటర్ NXG ఈ సుదూర ప్రయాణంలో పాల్గొంది. ఇప్పటికే తన ప్రయాణాన్ని ప్రారంభించిన NXG ఆంపియర్.. ఇటీవలే వాహనాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసింది.
ఆంపియర్ యొక్క తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ NXG ఈ సుదూర ప్రయాణాన్ని త్వరలో పూర్తి చేయనుంది. 45 రోజుల్లో మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని సంస్థ తెలిపింది. ఈ టెస్ట్ రన్ విజయవంతంగా పూర్తయితే.. ఈ వాహనం భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో పెద్ద విప్లవాన్ని సృష్టిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

కాగా NXG ఈ ఇ-స్కూటర్‌ను ఆంపియర్ పూర్తి ఫీచర్లతో రూపొందించింది. ఆధునిక ఫీచర్ల ప్యాక్‌గా ఈ స్కూటర్ రానుంది. అయితే ఆ ఫీచర్లు ఏంటి అనేది సంస్థ వెల్లడించలేదు. లాంచ్‌కు ముందు ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే అధిక పనితీరు, కొత్త డిజైన్, ఆకర్షణీయమైన లుక్‌తో వస్తున్న ఈ స్కూటర్‌ను ఫ్యామిలీ స్కూటర్‌గా సంస్థ పేర్కొంది.
ఇంకా కొత్త NXG ఇ స్కూటర్‌లో వీల్స్‌ను స్టైలిష్, స్పీడ్ పరంగా అధునాతనంగా సంస్థ రూపొందించింది. అంతే కాకుండా ఈ వాహనంలో టచ్‌స్క్రీన్ లాంటి ఆధునిక ఫీచర్లను అందించనున్నట్లు తెలిపింది. ఈ స్క్రీన్ ద్వారా నావిగేషన్‌తో పాటు కనెక్టివిటీని పొందవచ్చని పేర్కొంది. దీని ద్వారా రైడర్‌కు రైడింగ్ అనుభవం మరింత మెరుగుపడుతుందని స్పష్టం చేసింది.

కాగా ఆంపియర్ స్కూటర్ యొక్క తాజా ఫీచర్లను NexIO మరియు Nex.Armourగా సంస్థ వర్గీకరించింది. అయితే ఇవి స్వదేశీ ఉత్పత్తులు. Nex.io క్లస్టర్ యొక్క మెదడు మరియు సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తుండగా.. Nex.Armor అనేది స్కూటర్ యొక్క ఫ్రేమ్, మోటార్, బ్యాటరీ మరియు డిజైన్‌ను సూచిస్తుందని తెలిపింది.
అలాగే, ఆంపియర్ ఆర్కిటిక్ టెర్న్ ఆధారంగా NXG ఇ స్కూటర్‌ను రూపొందించారు. దీని లుక్ భారతీయుల ఫేవరెట్ స్కూటర్ మోడల్ యాక్టివాను పోలి ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ స్కూటర్ యాక్టివాకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో యువతను లక్ష్యంగా చేసుకుని వారిని ఆకర్షించే డిజైన్ సూత్రాలను ఇందులో ఉపయోగించినట్లు సంస్థ పేర్కొంది.

దీంతో కొత్త NXG ఇ స్కూటర్ యూత్ ఫేవరెట్‌గా ఉంటుందని ఆంపియర్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్‌లు ఇప్పటికే దేశంలో ప్రారంభం కాగా.. త్వరలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కొత్త స్కూటర్ ధర రూ. 1.20 లక్షల లోపే ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications








