మళ్ళీ మారిన Bajaj CNG బైక్ లాంచ్ డేట్ - ఇప్పుడు మరింత తొందరగా..
ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో సంచలనం సృష్టించడానికి వస్తున్న బజాజ్ సీఎన్‌జీ బైక్ లాంచ్ డేట్ మళ్ళీ మారింది. గతంలో బజాజ్ తన సీఎన్‌జీ బైకును జూన్ 18న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత జూలై 17న లాంచ్ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పుడు తాజాగా వచ్చే నెల 5న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో చెప్పినదాని కంటే (జూలై 17).. 12 రోజులు ముందుగానే లాంచ్ చేయాలని కంపెనీ సంకల్పించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీఎన్‌జీ బైక్ పేరు 'బ్రూజర్' (Bruzer). ఇప్పటి వరకు ఒక్క భారాటుదేశంలో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా సీఎన్‌జీతో నడిచే బైక్ లేదు. కంపెనీ మొదటిసారి సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసి నవశకానికి నాందిపలుకనుంది. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే ఈ సీఎన్‌జీ బైక్ ఎంతో అవసరం.

ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ బజాజ్ బ్రూజర్ సీఎన్‌జీ చూడటానికి సాధారణ బైకుల మాదిరిగానే ఉన్నప్పటికీ.. సింగిల్ పీస్ సీటు విశాలంగా విస్తరించి ఉండటం చూడవచ్చు. బజాజ్ తన సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసిన తరువాత బైక్ వినియోగదారులు ఇంధనానికి చేసే ఖర్చులో సుమారు 65 శాతం ఆదా చేయవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే సీఎన్‌జీ ధర.. పెట్రోల్ ధరల కంటే చాలా తక్కువ.
త్వరలో లాంచ్ కానున్న కొత్త బజాజ్ సీఎన్‌జీ బైక్ 110 - 150 సీసీ సెగ్మెంట్‌లో ఉండే విధంగా రూపొందించినట్లు సమాచారం. రోజు వారీ వినియోగానికి, బైక్ వినియోగదారుల ఖర్చులను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా బజాజ్ ఆటో ఈ కొత్త సీఎన్‌జీ బైక్ లాంచ్ చేస్తోంది. ఇది తప్పకుండా బైక్ ప్రేమికులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. కంపెనీ ఈ బైక్ మైలేజ్ వివరాలను లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడించనుంది.

టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ బైక్.. డిజైన్ పరంగా రౌండ్ హెడ్‌ల్యాంప్, టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు డిస్క్ బ్రేక్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ సీఎన్‌జీ బైకును ఒక స్టాండర్డ్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ మాదిరిగా కనిపించేలా చేస్తాయి. సీటు మరియు హ్యాండిల్‌బార్‌ల మధ్య కూర్చొని ఉన్న ఫిల్లర్ క్యాప్ కూడా ఇప్పటికే వెల్లడైన టీజర్ ఫోటోలలో కనిపించింది.
బజాజ్ యొక్క కొత్త సీఎన్‌జీ బైకుకి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఇది సీఎన్‌జీ ట్యాంకుతో డబుల్ క్రేడిల్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇందులోని ఫీచర్స్ గురించి కూడా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇవన్నీ కంపెనీ బైకును అధికారికంగా లాంచ్ చేసినప్పుడు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ బైకులోని రైడర్లకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండనున్నాయి.
బజాజ్ సీఎన్‌జీ బైక్ CNG ట్యాంక్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని పొందుతుంది. ఈ బైకులో చిన్న పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుందని సమాచారం. ఇంజిన్ వివరాలు, పర్ఫామెన్స్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలను కంపెనీ జూన్ 5న వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము. మొత్తం మీద బజాజ్ సీఎన్‌జీ బైక్ తప్పకుండ బైక్ ప్రేమికులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








