దూసుకుపోతున్న ఈవీ టూ-వీలర్ సేల్స్.. టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే..
దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా కూడా ఎలక్ట్రిక్(EV) వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఒక డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన సెప్టెంబర్ నెలలో 40.45% పెరిగింది. సెప్టెంబర్ 2023లో విక్రయించిన 64,086 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది ఇదే నెలలో మొత్తం విక్రయాలు 90,007 యూనిట్లకు చేరాయి. ఇది అంతకుముందు ఆగస్టు నెలలో విక్రయించిన 88,472 యూనిట్లతో పోలిస్తే 1.74 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా పండుగల సీజన్ నడుస్తుండటంతో కంపెనీలు ప్రత్యేకంగా ధరల తగ్గింపు, పలు ఆఫర్లు ఇవ్వడం ద్వారా వీటి అమ్మకాలు పెరిగాయి.
ఈవీ టూ వీలర్ అమ్మకాల్లో ప్రముఖ కంపెనీ ఓలా(ola)ఎలక్ట్రిక్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అనేక సర్వీస్, బ్యాటరీ సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఈ కంపెనీ 2024 సెప్టెంబరులో 24,679 యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 18,711 యూనిట్లతో పోలిస్తే 31.90 శాతం వృద్ధిని సాధించింది. అలాగే, ఈ ఏడాది ఆగస్టు నెలలో విక్రయాలు 10.31 శాతం క్షీణించాయి.

దీని తరువాత బజాజ్ చేతక్ ఈవీ టూ వీలర్ అమ్మకాల్లో రెండవ కంపెనీగా నిలిచింది. ఇది 19,137 యూనిట్ల అమ్మకాలతో ఓలా తర్వాత స్థానాన్ని ఆక్రమించి, సంవత్సరానికి 169.27 శాతం వృద్ధిని సాధించింది. మరో దిగ్గజ కంపెనీ టీవీఎస్ సెప్టెంబర్ 2023లో 15,616 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 15.96 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఏథర్ ఎనర్జీ కూడా తన అమ్మకాలలో బాగా పుంజుకుంది. సెప్టెంబర్ 2023లో విక్రయించిన 7,195 యూనిట్లతో నుంచి ఈ ఏడాది ఇదే నెలలో 76.76 శాతం పెరుగుదలను నమోదు చేసి 12,718 యూనిట్లను విక్రయించింది. ముఖ్యంగా ఏథర్ ఎనర్జీ అమ్మకాలు పెరగడానికి రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ గణనీయంగా తోడ్పాటు అందించింది.
Hero MotoCorp Vida ఎలక్ట్రిక్ అమ్మకాలలో ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 708.63 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత నెలలో 4,310 యూనిట్లను విక్రయించగా, సెప్టెంబర్ 2023లో 533 యూనిట్ల నుండి భారీగా తన అమ్మకాలను పెంచుకుంది. పెద్ద కంపెనీలతో పాటు BGauss ఎలక్ట్రిక్, బౌన్స్(Bounce) వంటివి కూడా ఈవీ టూ వీలర్ అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి.
BGauss Electric అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 32.30% పెరిగి 1,237 యూనిట్లకు చేరుకున్నాయి. బౌన్స్ కంపెనీ అమ్మకాలు మాత్రం 1,205 పెరిగి ఏకంగా 687.58% వృద్ధిని నమోదు చేసింది. ఈ గణాంకాలు భారత్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి కొత్త కొనుగోలుదారులు పెరగడాన్ని సూచిస్తుంది. మరోవైపు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ (ఆంపియర్), రివోల్ట్ కంపెనీల అమ్మకాలు క్షీణించాయి.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఏడాది ప్రాతిపదికన అమ్మకాలలో 23.14% తగ్గుదలను నమోదు చేయగా, నెలవారీగా అయితే 1.38% స్వల్పంగా తగ్గింది. రివోల్ట్(Revolt) అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 21.46%, నెలవారీగా 3.05% తగ్గాయి. మార్కెట్లో గట్టి పోటీ మధ్య ఈ బ్రాండ్‌లు తమ మార్కెట్ వాటాను కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ప్రజలు తమ రోజు వారి ప్రయాణాల కోసం సాంప్రదాయ ఇంధన వాహనాలపై కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో ఈవీ టూ-వీలర్ సెగ్మెంట్ అమ్మకాలపై తయారీ కంపెనీలు భారీ అంచనాలను పెట్టుకున్నాయి. ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్‌గా సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అందించడంతో పాటు ఈవీ పరిశ్రమకు అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తయారీదారులు సవాళ్లను అధిగమిస్తూ, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధికి కృషి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








