కొత్త ఏడాది జనవరిలో వస్తున్న అదిరిపోయే టూవీలర్స్.. మార్కెట్లో ఇక జాతరే..
ఈ ఏడాదిలో ఆటోమొబైల్ రంగం మంచి వృద్ధిని కనబరిచింది. దేశీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన వాహన తయారీ కంపెనీలు 2024లో అధునాతన ఫీచర్లతో కూడిన టూవీలర్లను విడుదల చేశాయి. ఇవి సేల్స్ పరంగా కూడా మెరుగైన గణంకాలను నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే ఊపును కొనసాగించడానికి రాబోయే ఏడాదిలో కూడా లేటెస్ట్ ఫీచర్లను కలిగిన బైక్స్, స్కూటర్లను విడుదల చేయడానికి తయారీ కంపెనీలు ప్రణాళికలు వేశాయి. ఇప్పటికే రాబోయే కొన్ని మోడళ్ల గురించిన టీజర్‌లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా 2025 జనవరి నెలలో దేశీయ మార్కెట్లోకి హోండా(Honda), రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal enfield), హీరో (Hero), టీవీఎస్ (Tvs) కంపెనీల నుంచి కొత్త మోడల్స్ లాంచ్ రాబోతున్నాయి. కొత్త ఏడాదిలో ఇవి వినియోగదారులను అలరించబోతున్నాయి. ఈ కంపెనీల నుంచి లాంచ్ కాబోతున్న టూవీలర్ల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం..
Honda Activa e: హోండా కంపెనీకి అత్యంత కీలకం అయిన యాక్టివా ఇ వెర్షన్ జనవరిలో లాంచ్ కాబోతుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్. 3kwh బ్యాటరీ ప్యాక్‌లో లభిస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే 102 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీలుగా ఉంది. మార్కెట్ వర్గాల ప్రకారం, ఇది రూ.1.30 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంటుందని సమాచారం.

Honda QC1: హోండా క్యూసీ1 ఎలక్ట్రిక్ మోడల్ 1.5 kwh బ్యాటరీ ఆప్షన్‌లో రాబోతుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌తో దాదాపు 80 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. రోజువారి అవసరాలకు ఇది అత్యంత అనువైన మోడల్. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిమీలు. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 4.30 గంటల సమయం పడుతుంది. అంచనాల ప్రకారం ఈ మోడల్ ధర రూ.1 లక్ష వరకు ఉండే అవకాశం ఉంది.
2025 TVS Ronin: 2025 TVS రోనిన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది. దీన్ని ఇంతకుముందు గోవాలో జరిగిన మోటోసౌల్ 2024 అనే ఈవెంట్‌లో ఆవిష్కరించారు. దీని ధర రూ.1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉందని తెలుస్తుంది. రోనిన్ 225cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 20 bhp పవర్, 19.9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను కలిగి ఉంది.

Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 ధర రూ. 2.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా అంచనా. ఇది 443 cc ఇంజిన్‌తో వస్తుంది. 25.2 ps పవర్, 34 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి. LED హెడ్‌లైట్, డ్యూయల్-ఛానల్ ABS సిస్టం వంటివి ఉన్నాయి. ఇది ఐదు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Hero XPulse 210: హీరో ఎక్స్‌పల్స్ 210 మోడల్ జనవరి 2025లో విడుదల కాబోతుంది. ఇది 210cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 24.8 PS పవర్, 20.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో అధునాతన ఫీచర్స్ ఉంటాయి. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల మధ్య ఉండవచ్చు.

ఈ మోడల్స్ మాత్రమే కాకుండా ఇతర టూవీలర్ కంపెనీల నుంచి కూడా కొత్త బైక్స్, స్కూటర్లు, ఈవీ వేరియంట్లు 2025 ఏడాదిలో రాబోతున్నాయి. 2024 ఏడాదితో పోలిస్తే కొత్త ఏడాది ఆటోమొబైల్ రంగానికి అత్యంత కీలకం కానుంది. ఈ ఏడాదిలో జరిగిన సేల్స్ కంటే వచ్చే ఏడాదిలో మరిన్ని మెరుగైన అమ్మకాలను సాధించడానికి కంపెనీలు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications








