గోదావరి ఎలక్ట్రిక్ నుంచి మరో కొత్త స్కూటర్ విడుదల.. 110 కి.మీ రేంజ్, 3 ఏళ్లు లేదా 30 వేల కి.మీ వారంటీ!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊపందుకుంది. అందులో భాగంగా చాలా వరకు మార్కెట్‌లో కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. సరసమైన ధరలో అధిక రేంజ్, అదిరిపోయే ఫీచర్లను అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే స్టార్టప్‌లలో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ (Godavari Electric Motors) ఒకటి. 2019లో స్థాపించబడిన ఈ కంపెనీ 2023 ఆగస్టులో ఇబ్లూ ఫియో (Eblu Feo) అయే స్కూటర్‌ని విడుదల చేసింది. ఇది మంచి సక్సెస్‌ని సాధించి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. దీని కొనసాగింపుగా కంపెనీ కొత్త ఇబ్లూ ఫియో ఎక్స్ (Eblu Feo X) ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది.
ఈ గోదావరి ఎలక్ట్రిక్ కంపెనీ ఎలక్ట్రిక్ త్రిచక్ర, సైకిల్స్, స్కూటర్లను తయారు చేస్తుంది. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన భారత్ గ్లోబల్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో ఇబ్లూ ఫియో ఎక్స్‌ని తొలిసారిగా ఆవిష్కరించింది. తాజాగా ఈ స్కూటర్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. భారీ స్టోరేజీ స్పేస్‌తో స్కూటర్లను ఈ కంపెనీ ప్రవేశ పెడుతుంది. దీంతో వీటిపై సులభంగా సరుకులను కూడా రవాణా చేయవచ్చు.

ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.36 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 110 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 60 వోల్ట్స్ హోమ్ ఛార్జర్‌ని కూడా అందించనున్నారు. దీనితో 5 గంటల 25 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ-స్కూటర్ ఎకానమీ, నార్మల్, పవర్ అనే మూడు రైడ్ మోడ్లతో వస్తుంది.
ఇబ్లూ ఫియో ఎక్స్ 1140 మిమీ ఎత్తు, 1850 మిమీ పొడవు, 1345 మిమీ వీల్‌బేస్, 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, డెలీ గ్రే మరియు ట్రాఫిక్ వైట్ అనే 5 ఆకర్షణీయమైన పెయింట్ ఆప్షన్లలో లభిస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్-ట్యూబ్ షాకర్ ఉన్నాయి.

బ్రేకింగ్ కోసం ముందు మరియు వెనుక చక్రాలను సీబీఎస్ (కాంబీ బ్రేక్ సిస్టమ్) డిస్క్ బ్రేక్ ద్వారా నియంత్రించవచ్చు. ఇక రాత్రి వేళలో సులువుగా ప్రయాణించేలా స్కూటర్ ముందు భాగంలో హై రిజల్యూషన్ AOH ఎల్ఈడీ హెడ్‌లైట్స్, వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. స్కూటర్ ఆన్ చేయగానే సైడ్ స్టాండ్‌లో ఉంటే అలర్ట్ చేసేందుకు సెన్సార్ ఇండికేటర్‌ని అందించారు.
ఈ స్కూటర్ 12 ఇంచెస్ వీల్స్‌తో వస్తుంది. వీటికి ట్యూబ్ లెస్ టైర్లను అమర్చారు. హ్యాండిల్ బార్ మధ్యలో 7.4 అంగుళాల డిజిటల్ ఫుల్ కలర్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ ను బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు, ఇందులోనే డ్రైవర్‌కి అవసరమైన వివరాలు, నావిగేషన్‌ని పొందవచ్చు. దీంతోపాటు మొబైల్ ఫోన్‌ని ఛార్జ్ చేసుకునే పోర్ట్ సదుపాయాన్ని కల్పించారు.

దీని సీటు కింద 28 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీనిపై షాపింగ్‌కి వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సరుకులను తీసుకురావచ్చు. ఇది ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే చాలా ఎక్కువే అని చెప్పాలి. ఈ కొత్త ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999గా నిర్ణయించారు. దీనిని కొనేందుకు ఫైనాన్స్ ఆప్షన్‌ని కూడా కంపెనీ అందిస్తుంది.
ఇక గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ దేశవ్యాప్తంగా 74 డీలర్‌షిప్ షోరూమ్‌లను కలిగి ఉంది. 2025 మార్చి నాటికి వీటిని 100కు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల, ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం దాని సేవలను పొందడం చాలా సులభం. ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








