ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే అదిరిపోతున్న హీరో కొత్త మోడల్‌పై ఓ లుక్కేయండి
ప్రపంచం మొత్తం కూడా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి క్రమంగా ఎలక్ట్రిక్ వైపు మళ్ళుతుంది. కార్లు, బైకులు అన్ని ఇతర వాహనాలు కూడా ఎక్కువగా ఈవీలలో వస్తున్నాయి. భారతదేశం కూడా ధోరణి మార్చుకుంటుంది. అన్ని ఆటోమొబైల్ తయారీదారులు ఈవీల ఉత్పత్తిపై ప్రధానంగా ఫోకస్ చేశారు. ప్రజల నుంచి కూడా డిమాండ్ సానుకూలంగా ఉండటంతో టాప్ ఆటోమేకర్లు మార్కెట్లోకి వరుస పెట్టి కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఈవీలను విడుదల చేయని కంపెనీలు సైతం డిమాండ్‌కు అనుగుణంగా, అధునాతన ఫీచర్లతో పోటా పోటీగా లేటెస్ట్ ఈవీలను తీసుకొస్తున్నాయి. ఇటీవల హొండా తన ఫెవరేట్ మోడల్ అయినటువంటి యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొచ్చి, మార్కెట్లో ఈవీ విభాగంలో పోటీని మరింత పెంచింది. ఇప్పటికే టీవీఎస్ మోటార్, ఓలా ఎలక్ట్రిక్, బజాజ్, ఈథర్ ఎనర్జీ వంటి కంపెనీలు తమ ఎలక్ట్రిక్ టూవీలర్స్‌తో దేశీయంగా సందడి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వీటికి పోటీగా భారత్‌లో ప్రముఖ టూవీలర్ తయారీదారుగా ఉన్నటువంటి హీరో మోటోకార్ప్(hero motocorp) కొత్త ఈవీ స్కూటర్‌ను తాజాగా విడుదల చేసింది. కంపెనీ బుధవారం సరికొత్త విడా వి2(Vida v2) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం హీరో దేశీయంగా విడా సిరీస్‌లో వి1 ప్లస్, వి1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుంది. రోజు రోజుకు వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

ఈ నేపథ్యంలో తన సేల్స్‌ను మరింతగా పెంచుకోడానికి కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ఈవీని విడుదల చేసింది. హీరో విడా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధానంగా V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. వీటిలో వినియోగదారులకు అవసరమయ్యే అన్ని ఫీచర్లను అందించారు. కొత్తగా ఈవీ స్కూటర్ కొనాలనుకునే వారికి హీరో విడా V2 సరిగ్గా సెట్ అవుతుంది.
వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరలు వేరు వేరుగా ఉంటాయి. వినియోగదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా నచ్చిన వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. కొత్త విడా వీ2 మోడల్ పాత విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగా ఉంటుంది. ఇది గ్లోసీ స్పోర్ట్స్ రెడ్,నెక్సస్ బ్లూ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. విడా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీ పలు ఆఫర్లను కూడా అందిస్తుంది.

హీరో మోటోకార్ప్ తన విడా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 5 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది. బ్యాటరీపై 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. లోకల్ ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా దాదాపు 250కి పైగా ప్రాంతాల్లో ఉన్నటువంటి 3,100కు పైగా హీరో ఛార్జింగ్ సెంటర్ల వద్ద ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
హీరో విడా వీ2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ (kWh) బ్యాటరీ కెపాసిటీతో వచ్చింది. దీని ధర రూ.96,000 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 94 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇది ప్రధానంగా రైడ్, ఎకో రైడింగ్ మోడ్స్‌ను కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 69 కి.మీగా ఉంది.
హీరో విడా వి2 ప్లస్ వేరియంట్ 3.44 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. ఇది ఒక్కఛార్జింగ్‌తో దాదాపు 143 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్ స్పీడ్ గంటకు 85 కి.మీ. ఈ ఈవీ ఎకో, రైడ్, స్పోర్ట్ అనే రైడింగ్ మోడ్స్‌లను కలిగి ఉంది. వి2 ప్రో 3.94 (kWh) బ్యాటరీతో ధర రూ.1.35 లక్షలు(ఎక్స్-షోరూమ్).
ఈ ఈవీ సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 165 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ. ఇది ప్రధానంగా ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ అనే నాలుగు మోడ్స్‌లను కలిగి ఉంది. ఈ మూడు వేరియంట్లలో డజన్ల కొద్ది లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. టర్న్-బై-టర్న్ నావిగేషన్,7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లను అందించారు.


Click it and Unblock the Notifications








