జూలై 1నుంచి పెరగనున్న టూ వీలర్స్ ధరలు.. పూర్తి వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో కొత్త మోడల్స్ మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు ఉన్నాయి. అంతే కాకుండా ద్విచక్ర వాహన విభాగంలో సీఎన్జీ బైక్ కూడా త్వరలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో దేశీయ విఫణిలో అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన 'హీరో మోటోకార్ప్' (Hero Motocorp) వచ్చే నెల 1 నుంచి ప్రారంభం నుంచే తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. కంపెనీ ఎంత ధరలను పెంచనుంది. ఏ మోడల్ మీద పెంచనుంది? అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
హీరో మోటోకార్ప్ 2024 జూలై 1నుంచి తన మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలను పెంచనుంది. కంపెనీ యొక్క ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో వాహనాల ధరలను పెంచనున్నట్లు.. ధరల పెరుగుదలకు కారణాన్ని వెల్లడించింది. కంపెనీ తన వాహనాల మీద గరిష్టంగా రూ. 1500 పెంచనున్నట్లు సమాచారం. అయితే ఏ మోడల్ మీద కంపెనీ ఎంత పెంచనుంది అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను పెంచడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా హీరో మోటోకార్ప్ 2023 జులై, 2023 అక్టోబర్ నెలలలో కూడా తన బైకులు మరియు స్కూటర్ల ధరలను పెంచింది. ఆటో పరిశ్రమకు కావలసిన ముడి పదార్థాల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండటం వల్ల వాహన తయారీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ధరల పెరుగుదలను కంపెనీ మరో సారి ప్రకటించింది.
కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత కొన్ని దేశాల్లో ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. ఆ సమయంలోను వాహనాల సరఫరా మరియు ఉత్పత్తులు బాగా తగ్గాయి. 2023లో స్టీల్ ధరలు కూడా భాగా పెరిగాయి. ఇది వాహన తయారీ సంస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా బ్యాటరీ ఉత్పత్తులలో ప్రధానమైన 'నికెల్' ధరల పెరుగుదలను భరించాల్సి వచ్చింది.

2023 పూర్తయ్యి 2024 మొదలైనప్పుడు కూడా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య వాహనాల సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికి కూడా ఈ పరిస్థితి కొన్ని దేశాల్లో అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని అంతరాయాలు ఉన్నప్పటికీ హీరో మోటోకార్ప్ మాత్రం తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో ధరల పెరుగుదల కూడా తప్పనిపరిస్థితుల్లో ప్రకటించినట్లు తెలుస్తోంది.
హీరో మోటోకార్ప్ అమ్మకాలు 2022 అర్థభాగం నుంచి 2023 మొదలయ్యే వరకు బాగా తగ్గాయి. కానీ 2023 ప్రారంభం నుంచి కంపెనీ మళ్ళీ తన పూర్వ వైభవం పొందుతూ.. ఉత్తమ అమ్మకాలను పొందుతూ ఎంతోమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించింది. కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరగటానికి ప్రధాన కారణం కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం అని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం కొంత ఆశాజనకంగా ముందుకు వెతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో రాగి, ఉక్కు వంటి లోహాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వాహనాలను తయారు చేసే కంపెనీలు.. అవసరమైన లోహాలను దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో కంపెనీ ధరలను స్వల్పంగా పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలకు సంబంధించిన వివరాలు వచ్చేనెల ప్రారంభంలో తెలుస్తాయని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








