మార్కెట్‌లో నిన్ను పడగొట్టే బండి ఇంకా పుట్టలేదు మామ..! ఇప్పటికీ నువ్వే నెం.1
దేశీయ దిగ్గజ కంపెనీ హీరో మోటార్‌కార్ప్(Hero Motorcorp) ఇండియాలో టూవీలర్ విభాగంలో అగ్రస్థానంలో ఉందన్న విషయం తెలిసిందే. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ బైకులు, స్కూటర్ల అమ్మకాల్లో ఇతర కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే కంపెనీ తాజాగా తన సేల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, అక్టోబర్ నెలలో హీరో మోటార్‌కార్ప్ ఇతర కంపెనీలైన టీవీఎస్ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తూ పండుగ సీజన్‌లో బలమైన అమ్మకాలను నమోదు చేసింది. డేటా ప్రకారం, హీరో మోటార్‌కార్ప్ అక్టోబర్ నెలలో మొత్తం 6,79,091 టూవీలర్‌లను విక్రయించింది. కేవలం ఒక్క నెలలోనే ఈ రేంజ్‌లో అమ్మకాలు చోటుచేసుకోవడం మామూలు విషయం కాదు.
అక్టోబర్ సమయంలో దసరా, దీపావళి పండుగలు కంపెనీ టూవీలర్ల అమ్మకాలు పెరగడానికి బాగా దోహదపడ్డాయి. మొత్తం టూవీలర్ అమ్మకాల్లో బైక్‌లు, స్కూటర్లు రెండు ఉన్నాయి. డేటా ప్రకారం, 2023లో ఇదే అక్టోబర్ నెలలో జరిగిన 5,74,930 యూనిట్లతో గత నెలలో అమ్మకాల వృద్ధి 18.12 శాతంగా నమోదైంది.

నెలవారీగా చూసినట్లయితే సెప్టెంబర్‌లో విక్రయాలు 6,37,050 యూనిట్లుగా ఉండగా, పండుగ నెలలో వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అక్టోబర్‌లో ఇది 6.60 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా హీరో కంపెనీ స్కూటర్ల కంటే బైకులను ఎక్కువ మంది కొనుగోలు చేశారు.
అక్టోబర్ నెలలో మొత్తం 6,35,787 యూనిట్లను కస్టమర్లకు సరఫరా చేసింది. ఇది గత ఏడాది 2023లో విక్రయించిన 5,29,341 యూనిట్లతో పోలిస్తే 20.11 శాతం వృద్ధిగా ఉంది. పండుగ సమయంలో కంపెనీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌ల, బ్యాంక్ ఆఫర్లను ఇవ్వడం ద్వారా అమ్మకాలు పెరిగాయి.

ఇదే సమయంలో స్కూటర్ల అమ్మకాలు మాత్రం మందకొడిగా ఉన్నాయి. అక్టోబర్‌లో వీటి విక్రయాలు కేవలం 43,304 యూనిట్లుగా ఉన్నాయి. అయితే బైకుల విభాగంలో ఈ రేంజ్‌లో అమ్మకాలు సాధించడానికి హీరో కంపెనీకి ప్రధానంగా ఉపయోగపడిన మోడల్ 'స్ప్లెండర్(splendor)'. ఈ బైకు ఇండియాలో అందరి ఫేవరెట్ బైక్.
దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కూడా స్ప్లెండర్‌ను ఎంతో మంది వాడుతున్నారు. ఈ మోడల్ దాదాపు అన్ని ఊర్లలో కూడా కనిపిస్తుంది. ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా కంపెనీ ట్రెండ్‌కు అనుగుణంగా పలు మార్పులు చేస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ధర కూడా అందరూ కొనే రేంజ్‌లో ఉండటం, అలాగే మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుండటంతో స్ప్లెండర్ మిడిల్ క్లాస్‌తో పాటు అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్ప్లెండర్ ప్లస్ ధర రూ.76,356 నుండి రూ. 77,496 ఎక్స్-షోరూమ్ వరకు అందుబాటులో ఉంది. లక్షలు పెట్టి కొనుగోలు చేసే కంటే అన్ని రకాల రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోయే, లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 కి.మీ వరకు మైలేజ్ అందించే ఈ బైకు అత్యుత్తమమైనదిగా భావిస్తూ దీన్నే అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో వస్తుంది. దీనితో పాటు హీరో సూపర్ స్ప్లెండర్( (super splendor)కూడా ప్రముఖ బైక్. ఇది రూ.82,298 నుండి రూ.86,298.(ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. దీనిలో 124.7 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ని అందించారు.
ఈ ఇంజిన్ 10.7 PS హార్స్ పవర్, 10.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు లీటర్ పెట్రోల్‌కు 69 కి.మీ మైలేజ్ ఇస్తుంది. వీటిలో పాటు ఈ పండుగల సమయంలో హీరో సూపర్ స్ప్లెండర్ XTEC బైక్ కూడా బాగా అమ్ముడుపోయింది. ఇది 124.7 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
మరో బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC కూడా ఎక్కువ డిమాండ్ ఉన్న బైకుల జాబితాలో చేరింది. దీని ధర రూ. 97,089 నుండి రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వీటితో పాటు మరిన్ని హీరో బైకులు కూడా అక్టోబర్‌లో మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications








