దేశంలోనే మొట్ట మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
హోండా మోటార్‌సైకిల్ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ను విడుదల చేసింది. దీన్ని హోండా CB300F పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకటి కంటే ఎక్కువ ఫ్యూయల్ మిశ్రమంతో ఇది రన్ అవుతుంది. వాతావరణాన్ని కాపాడటానికి గ్రీన్ ఎనర్జీ ఇంధనాల వాడకం పెరుగుతున్న తరుణంలో హోండా కంపెనీ తొలిసారిగా E85 ఫ్యూయల్ ఆధారంగా నడిచే బైక్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్- షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. కస్టమర్లు తమకు దగ్గరగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌లలో సంప్రదించి ఈ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు. అక్టోబర్ చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది.
ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో భాగంగా హోండా CB300F బైక్ E85 (పెట్రోల్+ ఇథనాల్) వ్యూయల్‌తో రన్ అవుతుంది. ఈ మిశ్రమంలో 85 శాతం ఇథనాల్+ 15 శాతం పెట్రోల్ ఉంటుంది. ఇది తక్కువ స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడంతో పాటు, ఇతర హానికరమైన గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించడంలో, వాతావరణాన్ని కాపాడటంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇథనాల్‌ను వరి గడ్డి, చెరకు గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేస్తారు.

ఇంజిన్-సామర్థ్యం: ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ 293.52సీసీ, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ పీజీఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 24.88 హెచ్‌పీ పవర్ వద్ద 25.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6- స్పీడ్ గేర్ బాక్స్‌ను జోడించారు. ఇంకా, అసిస్టెంట్ స్లిప్ క్లచ్‌ను కలిగి ఉంది.
రెండు చివర్లలో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్(ABC) సిస్టం, రెండు డిస్క్‌బ్రేక్‌లు ఉన్నాయి. ఇవి బైక్‌ను స్కిడ్ కాకుండా చూడటానికి ఉపయోగపడుతాయి. ముందు యూఎస్‌డీ ఫోర్క్స్, 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. వీటి ద్వారా ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా సులభంగా రైడింగ్ చేయవచ్చు.

ఫీచర్లు: చీకట్లో మంచి వెలుతురు కోసం LED లైటింగ్ ఈ బైక్‌లో ఉంది. ముందు డిస్‌ప్లేలో స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్ వంటివి రైడర్లు చూడవచ్చు. ముఖ్యంగా దీనిలో ఇథనాల్ ఇండికేటర్‌ను ప్రత్యేకంగా అమర్చారు. దీంతో బైకులో ఇథనాల్ కంటెంట్ 85% కంటే ఎక్కువ ఉంటే ఇండికేటర్ మెరుస్తుంది. బైక్ మైలేజ్ 30 కి.మీ వరకు వస్తుంది.
ఇంకా, USB-C ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్, స్ప్లిట్ సీట్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. బైక్ స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. దీని డిజైన్ స్టాండర్డ్ CB300F బైక్‌తో సమానంగా ఉంటుంది. లేటెస్ట్ ఫ్యూయల్ టెక్నాలజీతో వచ్చిన ఈ బైక్ హోండా కంపెనీకి కీలకం కానుంది.
ప్రతి నెలా హోండా కంపెనీ బైక్‌లు, స్కూటర్లు దేశీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతన్నాయి. ఇలాంటి టైంలో 300సీసీ సెగ్మెంట్‌లో హోండా CB300Fకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కంపెనీ గత నెల (సెప్టెంబర్ 2024) మొత్తం 5,83,633 యూనిట్ల టూవీలర్లను విక్రయించింది. 2023లో ఇదే కాలంలో విక్రయించిన 5,26,998 యూనిట్లతో పోల్చితే, ఏడాది ప్రాతిపదికన వృద్ధి 10.75%.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








