53 కి.మీల మైలేజ్.. రూ.71 వేల ప్రారంభ ధరలో ఇండియాలో లభించే బెస్ట్ స్కూటర్స్ ఇవే..
ఒకప్పుడు బైకుల వాడకం ఎక్కువగా ఉండేది, ఇప్పుడు రాను రాను స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది. బైకులు పురుషులు నడపడానికి అనువుగా ఉంటాయి. అదే స్కూటర్లు మాత్రం పురుషులతో పాటు, మహిళలు కూడా నడపడానికి అనుకూలంగా ఉంటాయి. వీటిని డ్రైవింగ్ చేయడం చాలా సులభం కాబట్టి చాలా మంది తమ కుటుంబ అవసరాలకు వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పైగా ఇవి మైలేజ్ కూడా 50 కిమీల పైనే ఇవ్వడంతో పాటు, సామాన్లను కూడా తీసుకెళ్ళడానికి అనువుగా ఉంటాయి. సీటు క్రింది భాగంలో హెల్మట్‌తో పాటు ఇతర లగేజీ పెట్టుకోడానికి సరిపడినంత స్థలం ఉంటుంది. బైకులతో పోలిస్తే స్కూటర్లు కంఫర్ట్‌గా ఉంటాయి. దేశంలో టూవీలర్ తయారీ కంపెనీ బైకులతో పాటు స్కూటర్లను కూడా అధికంగా విడుదల చేస్తున్నాయి. హోండా (Honda), హీరో (Hero) ,టీవీఎస్ (Tvs) వంటి కంపెనీలు అధిక మైలేజ్‌ను ఇచ్చే స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి.
ఈ కంపెనీల నుంచి విడుదలైన మోడళ్లు మార్కెట్లో విజయవంతంగా మంచి సేల్స్‌ను సాధిస్తున్నాయి. హోండా నుంచి వచ్చిన యాక్టివా 6జీ, హీరో కంపెనీ జూమ్, టీవీఎస్ నుంచి స్కూటీ జెస్ట్ ఇటీవల కాలంలో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ సంపాదిస్తున్నాయి. ఇంతలా అందరి అభిమానాన్ని పొందడానికి ప్రధాన కారణం వీటి మైలేజ్ ఎక్కువగా ఉండటంతో పాటు ధర తక్కువగానే ఉంటుంది. ఈ మోడళ్ల గురించి మరిన్ని వివరాలు క్రింద తెలుసుకుందాం..

టీవీఎస్ స్కూటీ జెస్ట్ (Tvs scooty zest) గురించి తెలుసుకున్నట్లయితే ఈ మోడల్ 109.7 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 7.8 PS పవర్, 8.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.74,676 నుంచి రూ.76,439 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 48 కి.మీల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
ఈ స్కూటర్ బరువు దాదాపు 103 కిలోల వరకు ఉంటుంది. ముందు 130mm డ్రమ్ బ్రేక్ సెటప్, వెనుక 110mm డ్రమ్ బ్రేక్‌ను అందించారు. ఇది మ్యాట్ బ్లూ, మ్యాట్ బ్లాక్, మ్యాట్ పర్పుల్‌తో పాటు ఇతర కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్ల వరకు ఉంది. ముఖ్యంగా బరువు తక్కువగా ఉండటం వలన మహిళలకు రైడింగ్ చాలా ఈజీగా ఉంటుంది.

హోండా యాక్టివా 6జీ (Honda activa 6g) విషయానికి వస్తే, ఇండియాలో స్కూటర్ అనగానే చాలా మందికి మొదటగా గుర్తుకు వచ్చే మోడల్ యాక్టివానే. కంపెనీ ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా కొత్త కొత్త మార్పులు చేస్తూ మార్కెట్లోకి యాక్టివా వెర్షన్లను విడుదల చేస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన 6జీ చాలా అధునాతనమైనది. దీని ధర మార్కెట్లో రూ. 76,684 నుంచి రూ. 82,684 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.
యాక్టివా 6జీ 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఇది 7.84 PS హార్స్ పవర్, 8.90 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా దీని మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్‌కు దాదాపు 59.5 కిమీల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ACG స్టార్టర్, ఇంటిగ్రేటెడ్ పాస్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్, మెరుగైన సస్పెన్షన్ సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

హీరో జూమ్ (Hero xoom) స్కూటర్ 110.9 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.15 PS హార్స్ పవర్, 8.70 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర మార్కెట్లో రూ. 71,484 నుండి రూ. 80,967 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. లీటర్ పెట్రోల్‌కు 53.4 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. జూమ్ స్కూటర్ USB ఛార్జింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి వాటిని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








