ఆవుపేడతో నడిచే బైక్ వచ్చేస్తుంది.. త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు బజాజ్ ఆటో CEO ప్రకటన!
ప్రపంచంలో మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ని బజాజ్ ఆటో మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ని ఫ్రీడమ్ 125 పేరుతో జూలై 05న మార్కెట్‌లో బజాజ్ ఆటో విడుదల చేసింది. ఈ సరికొత్త మోటార్‌సైకిల్ ఆవిష్కరణ నుంచే మార్కెట్‌లో అంచనాలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ అదరగొడుతోంది. ఈ మోటార్ సైకిల్ పెట్రోల్ మోడ్‌లోనూ నడుస్తుంది. ఈ బైక్‌ని ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం రూ.95,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో ప్రవేశపెట్టింది. దీని గరిష్ట ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. దీంతో ఈ బైక్ అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీని సాధించింది.
పైన చెప్పిన విధంగా ఈ బైక్ పెట్రోల్ + సీఎన్‌జీ ఫ్యూయల్స్‌తో నడుస్తుంది. అయితే త్వరలో పూర్తిగా సీబీజీ (Compressed BioGas)తో నడిచే మోటార్‌సైకిల్‌ని తీసుకురావాలని బజాజ్ యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి బలం చేకూరుస్తూ బజాజ్ ఆటో సీఈవో రాజీవ్ బజాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరుగుతున్న అమూల్ క్లీన్ ఫ్యూయల్ బయో సీఎన్‌జీ కార్ ర్యాలీలో పూర్తి స్థాయిలో CBGతో నడిచే బైక్‌ని తీసుకురానున్నట్లు తెలిపారు.

సీబీజీతో నడిచే బైక్‌ని పూర్తి స్థాయిలో విజయవంతమైతే పూర్తిస్థాయిలో సీబీజీతో నడిచే వాహనాలను వినియోగంలోకి తెస్తామని తెలిపారు. దేశంలోనే డైరీ రంగంలో టాప్‌లో కొనసాగుతున్న అమూల్ సంస్థ ప్రస్తుతతం బయో సీఎన్‌జీ ఉత్పత్తిలో నిమగ్నమైంది. ఆవు పేడ నుంచి బయోగ్యాస్‌ని ఉత్పత్తి చేసే పనిలో కంపెనీ నిమగ్నమైంది. ఇందుకు సంబంధించిన ప్లాంట్ గుజరాత్‌లోని బనస్కాంతలో నెలకొల్పింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సీబీజీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఆటోరంగం పూర్తిగా సీఎన్‌జీ నుంచి బయోగ్యాస్ వైపుకి షిఫ్ట్ అయ్యేలా అమూల్ ఇప్పటికే మారుతి సుజుకితో జతకట్టింది. ఇప్పుడు బజాజ్ సీబీజీ బైక్‌ని తయారు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదే జరిగితే సీఎన్‌జీ వాహనాలన్నీ సీబీజీలోకి మారే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు 2 నుంచి 3 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది.

ఇక సీఎన్‌జీ మాదిరిగానే సీబీజీ కూడా తక్కువ ధరలో లభించనుంది. ఇది పెట్రోల్ కంటే చాలా తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంది. అందుకే ఈ సీబీజీ వాహనాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో బజాజ్ ఆటో సంస్థ రెగ్యూలర్ వెహికిల్స్‌తో పాటు, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ మార్కెట్‌ని కలిగి ఉంది. ఇప్పుడు సీబీజీ ప్రకటనతో మరోసారి అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా తొలి స్థానంలో ఉంది. తాజాగా బజాజ్ టీవీఎస్‌ని వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఓలా సేల్స్ కాస్త తగ్గాయి. దీనిని బజాజ్ ఎలక్ట్రిక్ ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే మరిన్ని ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉత్పత్తితో ఈవీ మార్కెట్‌ని సైతం శాసించే అవకాశం ఉంది. ఇదే జరిగితే వివిధ రకాల టూవీలర్ సెగ్మెంట్స్‌లో అతిపెద్ద తయారుదారుగా అవతరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

ఇక ఫ్రీడమ్ సీఎన్‌జీ అమ్మకాల్లో దూసుకెళ్తుంది. విడుదలైన తొలి రోజుల్లో కేవలం గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైన వీటి సేల్స్.. క్రమంగా దేశమంతటా ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు 27,000లకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ బైక్ పెట్రోల్, సీఎన్‌జీ ఫుల్ ట్యాంక్‌పై 330 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇతర సాంప్రదాయ బైక్‌లతో పోల్చితే దీని వినియోగం వల్ల మీ ఖర్చులు 30 శాతం ఆదా అవుతాయి.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: భారతదేశంలో సీఎన్‌జీ వెహికిల్స్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. టూవీలర్స్‌లో బజాజ్ ఫ్రీడమ్ 125 అదరగొడుతోంది. ఈ బైక్ మాదిరిగానే సీఎన్‌జీ ఆధారిత స్కూటర్లు కూడా అమ్మకానికి రానున్నాయి. ఇక టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్‌ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక త్వరలో సీబీజీతో నడిచే టూవీలర్స్ కూడా అందుబాటులోకి రావడం శుభసూచీకం.


Click it and Unblock the Notifications








