వంట గ్యాస్‌తో నడిచే స్కూటర్లు రెడీ.. కేవలం రూ.15,500ల కిట్‌తో మీ బండిని కూడా త్వరగా మార్చేసుకోండి
దేశంలో త్వరలోనే గ్యాస్‌తో నడిచే టూవీలర్స్ అందుబాటులోకి రానున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన కేఆర్ ఫ్యూయల్స్ (KR Fuels) ద్విచక్ర వాహనాల్లో LPG కిట్లను అమర్చేందుకు అనుమతి లభించింది. ఈ సర్టిఫికేషన్ పొందిన మొదటి కంపెనీగా ఈ సంస్థ నిలిచింది. ఈ LPG కిట్లను BS4 స్కూటర్లలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇది తక్కువ ఉద్గారాలను విడుదల చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దీనివల్ల వినియోగదారులకు ఖర్చులు కూడా కలిసి రానున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.110గా ఉంది. అయితే దానితో పోల్చుకుంటే ఎల్‌పీజీ కిట్‌ని ఏర్పాటు చేసుకంటే ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ని విడుదల చేసేందుకు బజాజ్ యత్నిస్తోంది. ఈ బైక్ జూలై 5న లాంచ్ అవ్వనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వార్తలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే దాని కంటే ముందే LPGకిట్‌లకు అనుమతి లభించింది. తొలిసారిగా ఈ కిట్‌లను అమర్చేందుకు కేఆర్ ఫ్యూయెల్స్‌కి సర్టిఫికేట్ అందింది. ఈ కిట్ ధర మరియు దీని పనితీరుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

KR ఫ్యూయెల్స్ అందించే కిట్ ధర రూ.9,500-10,500 మధ్య ఉండే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఛార్జీలతో కలిపి దాదాపు రూ.15,500 వరకు తీసుకోనున్నారు. తమిళనాడులోని తిరుచ్చిలోని తన ప్లాంట్‌లో ఈ కిట్లను ఆ సంస్థ తయారు చేస్తోంది. ఈ కిట్‌లో 5 లీటర్ల ట్యాంకు, ఈసీయూ వైరింగ్, ఇంజెక్టర్లు అన్నీ అంతర్గతంగా రానున్నాయి. దీనికి అవసరమైన అన్ని అనుమతులు సర్టిఫికేషన్‌లో వివరంగా వెల్లడించారు.
దీంతో ఈ కిట్లను దేశమంతటా పంపిణీ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. కొత్త LPG కన్వర్షన్ కిట్ల ఉత్పత్తి ఇప్పటికే ఆ సంస్థ ప్లాంట్‌లో ప్రారంభమైంది. తొలి విడతగా 8 వేల కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కేఆర్ ఫ్యూయల్స్ తమిళనాడు వ్యాప్తంగా 73 ఆటో LPG స్టేషన్లు, 7 రెట్రోఫిట్‌మెంట్ సెంటర్లను నిర్వహిస్తోంది.
అయితే కంపెనీ తన నెట్‌వర్క్‌ని ఇతర రాష్ట్రాలకు విస్తరించే యోచనలో ఉందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఎల్‌పీజీ కిట్ సర్టిఫికేషన్‌పై ఇండియన్ ఆటో LPG డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రోత్సాహకాలు శుభ పరిణామంగా ఆయన వ్యాఖ్యానించారు. వాహన ఉద్గారాలను తగ్గించే దిశగా ఆటో ఎల్‌పీజీతో ఒక కీలకమైన అడుగు పడినట్లు ఆయన తెలిపారు.
ఒక్క తమిళనాడులోనే 25 మిలియన్లకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని.. వీటిని అమర్చడం వల్ల గాలి కాలుష్యం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కిట్లను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. అలాగే మేకిన్ ఇండియాలో భాగంగా జీఎస్టీని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలా చేయడం వల్ల భవిష్యత్తులోనూ ఇలాంటి ఇన్నోవేషన్లకు బీజం పడుతుందని ఆయన తెలిపారు.
అయితే ఈ రెట్రోఫిట్ కిట్లకు సంబంధించిన సేఫ్టీ విషయాను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. స్కూటర్లలో ప్రత్యామ్నాయ ఇంధన కిట్లను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. 2017 లోనే హోండా యాక్టివాలో సీఎన్‌జీ కన్వర్షన్ కిట్‌ని రెట్రోఫిట్ చేయడానికి ప్రయోగాలు చేశారు. అయితే ఇప్పుడు బజాజ్ పూర్తిస్థాయి సీఎన్జీతో నడిచే మొదటి మోటార్‌సైకిల్‌ని విడుదల చేసే పనిలో ఉంది. ఇది కూడా భారతదేశంలో కీలక అడుగుగా భావించవచ్చు.
తక్కువ ధరలో ఎక్కువ ఉపయోగాలు కలిగించేలా ఈ కిట్ ఉండనుంది. ఒక్కసారి మార్కెట్‌లోకి వచ్చాక దాని పనితీరు నిర్వహణ ఇతర ఖర్చులను చూసిన తర్వాతే జనాలు దీనిని కొనే అవకాశం ఉంది. అయితే పూర్తిస్థాయిలో గ్యాస్‌తో నడిచే స్కూటర్ కావడంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా అనే కోణంలో జనాలు ఆలోచిస్తారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్నో జరగాలని పలువురు ప్రకృతి ప్రేమికులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications








