మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు 130కి.మీ హాయిగా వెళ్లవచ్చు!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. అయితే ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల కంటే జనాలు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ నంబర్ వన్ కంపెనీగా ఉంది. వీటితో పాటు ప్రముఖ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు నేడు మార్కెట్‌లో బెస్ట్ స్కూటర్లను అందిస్తున్నాయి. దేశీయ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా లెక్ట్రిక్స్ ఈవీ (Lectrix EV) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రవేశపెట్టింది.
లెక్ట్రిక్స్ ఈవీ అనేది SAR గ్రూప్‌కి చెందిన ఇ-మొబిలిటీ విభాగం. ఇండియాలో టాప్ 10 ఈవీ కంపెనీల్లో లెక్ట్రిక్స్ ఒకటిగా ఉంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కంపెనీ క్రమం తప్పకుండా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తోంది. తాజాగా లెక్ట్రిక్స్ ఎల్‌ఎక్స్‌ఎస్ 2.0 (Lectrix lxs 2.0)కి కొనసాగింపుగా లెక్ట్రిక్స్ 3.0 lxs ఈవీని ఆ సంస్థ విడుదల చేసింది.

ఈ కొత్త మోడల్ లెక్ట్రిక్స్ ఈవీ3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 1 నుంచి డెలివరీ ప్రారంభమవుతుందని లెక్ట్రిక్స్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న లెక్ట్రిక్స్ ఈవీ అవుట్‌లెట్స్ ద్వారా ఈ స్కూటర్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఈ స్కూటర్ 1200 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. పనితీరు వైపు చూస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి కేవలం 10.5 సెకన్లు పడుతుంది. మెరుగైన వేగం మరియు స్మూత్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ సాధించడానికి ఈ స్కూటర్ ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంది.
కొత్త లెక్ట్రిక్స్ lxl 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో భారీ అధునాతన ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలోని అన్ని రకాల భూభాగాలకు అనువైన వాహనంగా దీనిని రూపొందించినట్లు తయారీదారులు పేర్కొన్నారు. ఈ స్కూటర్ ధర మరియు ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన కీలక వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను కంపెనీ త్వరలో తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించనుంది.
ప్రస్తుతం lxs G2.0 హై స్పీడ్, lxs 2.0 హై-స్పీడ్, lxs సబ్‌స్క్రిప్షన్, lxs హై-స్పీడ్, sx 25 స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇటీవలె లెక్ట్రిక్స్ lxs 2.0 మోడల్‌ని ఆ కంపెనీ లాంచ్ చేసింది.
ఈ lxs 2.0 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.79,999గా ఉంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 98 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ల (2.9bhp) BLDC హబ్ మోటార్‌ని కలిగి ఉంది. ఇది గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
లెక్ట్రిక్ lxs 2.0 ఇ-స్కూటర్‌లో 25 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ స్పేస్, 90/110 ఫ్రంట్, 110/90 వెనుక భాగంలో 10-అంగుళాల టైర్లు మరియు ఫాలో-మీ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించే విధంగా లెక్ట్రిక్స్ ఈవీ రూపొందించింది. ఇటీవల ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఈవీ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
ప్రారంభ ఆఫర్ కింద ఈ స్కూటర్ కొనుగోలుపై రూ. 5000 డిస్కౌంట్‌ని ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తుంది. అయితే మునుపటి మోడళ్ల మాదిరిగానే, లెక్ట్రిక్స్ కొత్త మోడల్‌ని భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్రియులు ఆదరిస్తారని లెక్ట్రిక్స్ భావిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర ఎలక్ట్రిక్ సంస్థకు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, సహా ఇతర 14 రాష్ట్రాల్లో 60 డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉంది.


Click it and Unblock the Notifications








