పండుగకు మిస్.. కానీ తర్వాత గురితప్పదు.. నవంబర్ 7న వచ్చేస్తున్న అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
దేశంలో ప్రసిద్ధ పండుగ అయిన దీపావళి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కొత్త వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే చాలా కంపెనీలు కార్లు, బైకులను లాంచ్ చేయగా, పండుగకు ముందు జనాలు విపరీతంగా కొన్నారు. అయితే ఒక కంపెనీ మాత్రం దీపావళికు ముందు కాకుండా ఆ తర్వాత కొత్త ఈవీ బైకును తీసుకురావాలని చూస్తుంది. దాని పేరే 'ఓబెన్ ఎలక్ట్రిక్(Oben electric)'. ఇది రోర్ ఈజెడ్(rorr-ez) అనే ఎలక్ట్రిక్ బైకును మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ఇటీవల రాబోయే తన కొత్త బైకుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
రోర్ ఈజెడ్ ఈవీ బైక్ నవంబర్ 7న విడుదల చేస్తామని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ రోజువారీ వినియోగానికి అనువైనదిగా ఉంటుంది. దీపావళికి ముందు చాలా మంది కొత్త బైక్‌ను కొనుగోలు చేయగా, ఇది కొంత ఆలస్యంగా వస్తుండటంతో పండుగ తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాబోతుంది.

ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్ అధిక పనితీరు గల LFP రకం బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, బ్యాటరీ హీట్ అవ్వడం లాంటి సమస్యలు ఉండవు. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని కూడా బ్యాటరీ సమర్థంగా పనిచేస్తుంది. ఎక్కువ సమయం పనిచేసిన కూడా హీట్ సమస్యలు ఉత్పన్నం కావు. ప్రస్తుతం విక్రయిస్తున్న ఒబెన్ రోర్ మాదిరిగానే రోర్ ఈజెడ్‌లో కూడా అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఒబెన్ రోర్(Oben Rorr) సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 187 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇది 4.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో కేవలం 3 సెకన్లలో 0-40 kmph వేగంతో దూసుకు పోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా 2 గంటల్లో బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే కంపెనీ రోర్ ఈజెడ్ టీజర్‌ను విడుదల చేసినప్పటికి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఈ ఎలక్ట్రిక్ బైక్ రోజువారీ వినియోగానికి అనువైన వాహనంగా ఉంటుందని, మెరుగైన రైడ్ అనుభవాన్ని అందించగలదని, మరింత సామర్థ్యాన్ని విడుదల చేయగలదని మాత్రమే పేర్కొంది. ఫీచర్ల పరంగా, రైడ్ వైటల్స్, రిమోట్ డయాగ్నస్టిక్స్, జియోఫెన్సింగ్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటి మరిన్ని ఉన్నాయి.
ఒబెన్ రోర్ ఈవీ బైక్ 200 మిమి గ్రౌండ్ క్లియరెన్స్, 230 మిమి వాటర్-వేడింగ్ కెపాసిటీని కలిగి ఉండగా, రోర్ ఈజెడ్‌లో కూడా ఇదే విధంగా సదుపాయాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విక్రయిస్తున్న ఒబెన్ రోర్ ధర రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), అయితే రోర్ ఈజెడ్ ధర రూ.1 లక్షకు దగ్గరగా ఉండవచ్చని తెలుస్తుంది.

రోర్ ఈజెడ్ అన్ని రకాల రోడ్లపై కూడా సులభంగా ప్రయాణిస్తుంది. దీని కోసం పాత మోడల్ కంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ముందు, వెనుకు మెరుగైన సస్పెన్షన్‌ను అందించారు. ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. ఉద్యోగాలకు, కాలేజ్‌లకు, షాపింగ్ వంటి రోజువారీ ప్రయాణాలకు ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది.
ఒబెన్ ఎలక్ట్రిక్ ఇండియన్ మార్కెట్లో ఈవీ వాహనాలను విడుదల చేస్తూ మరింత దూకుడును ప్రదర్శిస్తుంది. తన వ్యాపారాన్ని విస్తరించడానికి కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 50 అవుట్‌లెట్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి, త్రివేండ్రం, పూణె, మరిన్నింటితో సహా అనేక ప్రధాన మెట్రోలలో ఉనికిని కలిగి ఉంది.



Click it and Unblock the Notifications








