రూ. 39,999 లకే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. సింగిల్ ఛార్జ్‌లో 112 కి.మీ రేంజ్
ఓలా ఎలక్ట్రిక్ (Ola EV) తక్కువ ధరలో స్కూటర్లను లాంచ్ చేసింది. కేవలం రూ.39,999 ప్రారంభ ధరతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను గిగ్ (Gig), ఎస్1 జెడ్ (S1 Z) విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ఇది సహకరిస్తుందని ఓలా అభిప్రాయపడింది. ప్రస్తుతం ఓలా స్కూటర్లు మార్కెట్‌లో నంబర్.1 గా కొనసాగుతున్నాయి. ఓలా ఈవీ లైనప్స్ విస్తరణలో భాగంగా గిగ్, గిగ్+, ఎస్ 1 జెడ్, ఎస్ 1 జెడ్ ప్లస్ వంటి లైనప్స్‌ని తీసుకువచ్చింది. వీటికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.
తాజాగా ఓలా మార్కెట్‌లో విడుదల చేసిన స్కూటర్లు కేవలం రూ.39,999 నుంచి రూ.64,999 మధ్య అందుబాటులో ఉండనున్నాయి. వీటి కొనుగోలుపై ఆసక్తిగల కస్టమర్లు కేవలం రూ. .499 చెల్లించి స్కూటర్‌ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ లైనప్ డెలివరీలు 2025 ఏప్రిల్, మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మాస్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ ఈ స్కూటర్లను ఓలా ప్రవేశపెట్టింది.

ఓలా గిగ్: ఇది బేస్ వేరియంట్‌గా ఉంది. దీని ధర రూ.39,999 ల నుంచి ప్రారంభం అవుతుంది. ఇ-కామర్స్, ఇతర డెలివరీ వర్కర్ల కోసం ఈ స్కూటర్ సరిపోతుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 112 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్ గంటకు కేవలం 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో రిమూవబుల్ 1.5 కిలోవాట్ల బ్యాటరీ కెపాసిటీతో వస్తుుంది.
ఈ గిగ్ స్కూటర్‌లో చిన్నపాటి లోడ్లు తీసుకెళ్లవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఇదొక మోపెడ్‌లా పనిచేస్తుంది. ఇక ఓలా గిగ్ ప్లస్ ధర రూ .49,999 లుగా ఉంది. ఈ స్కూటర్ డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్‌తో వస్తుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 157 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్ గంటకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

Ola S1 Z: దీనిని సిటీ ప్రయాణికుల కోసం విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ .59,999గా ఉంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 146 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్ రెగ్యూలర్ స్కూటర్ల మాదిరిగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. యువకులు, విద్యార్థులు, పెద్దలు ఈ స్కూటర్ రోజువారి ప్రయాణం కోసం ఎంచుకోవచ్చు. పైన తెలిపిన ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
మరో స్కూటర్ ఓలా ఎస్ 1 జెడ్ ప్లస్ ధర రూ. 64,999 గా నిర్ణయించారు. ఇది ఎస్1 జెడ్ మాదిరిగానే రేంజ్, వేగాన్ని కొనసాగిస్తుంది. మెరుగైన మన్నిక, మంచి పేలోడ్ సామర్థ్యం కోసం మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు. ఓలా నుంచి ప్రస్తుతం ఎస్1 సిరీస్, రోడ్‌స్టర్ సిరీస్ స్కూటర్లు రూ. 74,999 నుంచి రూ. 1,99,999 మధ్య కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.

ఈ స్కూటర్లతో పాటు ఓలా రూ .9,999 ధర కలిగిన పోర్టబుల్ ఇన్వర్టర్ పవర్‌పాడ్‌ని విడుదల చేసింది. దీని ద్వారా రిమూవబుల్ బ్యాటరీలను, ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, టీవీలను వినియోగించవచ్చు. దీనిని మూడు గంటల వరకు బ్యాక్‌అప్‌గా పెట్టుకోవచ్చు. విద్యుత్ సరఫరా తక్కువగా ఉండే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ పవర్‌పాడ్ ఉపయోగపడుతుంది.
ఓలా ఈవీ ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వినియోగాన్ని ప్రతీ మూలకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ స్కూటర్లను తీసుకువచ్చినట్లు ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ తెలిపారు. భవిష్యత్తులో దేశీయంగా ఎలక్ట్రిక్ ఉత్పత్తుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఓలా గిగ్ & ఎస్ 1 జెడ్ రేంజ్ స్కూటర్లను విడుదలతో మాస్ మార్కెట్‌కి మరింత చేరువ అయ్యే అవకాశం దొరికిందని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications








