ఈ ఏడాది దుమ్మురేపిన ఓలా.. ఆశ్చర్యపరుస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్.. మొత్తం ఎన్నంటే..
ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో దిగ్గజ కంపెనీ ఓలా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజలను ఒకచోట నుంచి మరో చోటకు డ్రాప్ చేయడానికి రైడింగ్ సంస్థగా మొదలైన ఓలా ప్రయాణం దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీదారుగా రూపాంతరం చెందింది. దేశంలోని అన్ని ఏరియాల్లో కూడా ఈ స్కూటర్లు కనిపిస్తున్నాయి. వీటి వాడకం అంతలా పెరగడానికి ఓలా చేసిన కృషి ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు అందుబాటు ధరల్లో పలు మోడళ్లను విడుదల చేస్తూ ఈవీ మార్కెట్లో అధిక వాటా సాధిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఓలా ఈ స్కూటర్లపై పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా బ్యాటరీ సమస్యలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఓలా స్కూటర్లు మార్కెట్లోకి వచ్చిన ప్రారంభంలో రోడ్లపైనే కాలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే, ఓలా సర్వీస్ సెంటర్ల సిబ్బంది తమ సమస్యలపై స్పందించడం లేదని షోరూమ్‌కు తాళాలు వేసిన ఘటనలు కూడా జరిగాయి.
ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓలా ఈ ఏడాదిలో జరిపిన అమ్మకాలను చూసినట్లయితే షాక్‌కు గురవుతారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వాహన్ పోర్టల్ ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ 2024 ఏడాదిలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈవీ టూవీలర్స్ అమ్మకాల్లో భారీగా దూసుకుపోయింది. ఓలా ఎలక్ట్రిక్ జనవరి నుంచి ఈ డిసెంబర్ 15వ తేదీ వరకు దాదాపు 4 లక్షల ఈవీ టూవీలర్స్‌ను విక్రయించింది.

ఇది 2023 ఏడాదితో పోలిస్తే సంవత్సరం ప్రాతిపదికన దాదాపు 50 శాతానికి పైగా పెరిగింది. వరుసగా కస్టమర్ల నుంచి పలు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న తరుణంలో అమ్మకాలు క్షీణిస్తాయని అందరు అంచనా వేసినప్పటికి కూడా అవన్నీ తలక్రిందులు అయి దేశంలో ఈవీ టూవీలర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ ఇతర తయారీదారుల కంటే అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ డిసెంబర్ 2021లో అమ్మకాలను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈవీలను వరుసగా విడుదల చేస్తూనే ఉంది.
ఇండియా మార్కెట్లో విక్రయాలను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ మొత్తం రిటైల్ అమ్మకాలు 7,75,000 మార్కును చేరాయి. సేల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 7 లక్షల మంది పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడం మామూలు విషయం కాదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే మొత్తం విక్రయాల్లో ఎక్కువ భాగం ఈ ఏడాదిలో జరిగినవే ఉన్నాయి. 2024 సంవత్సరం ఓలాకు బాగా కలిసి వచ్చింది.

డేటా ప్రకారం, 2021 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అమ్ముడుపోయిన ఈవీ టూవీలర్లలో ఓలా ఎలక్ట్రిక్ వాటా దాదాపు 30 శాతం ఉంటుంది. దేశంలోని అందరికి ఈవీలు చేరడానికి ఎంతో కృషి చేసిన ఓలా ఈ సగ్మెంట్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇదే విభాగంలో మార్కెట్లో ఉన్నటువంటి ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్ కంపెనీల కంటే ఓలా ఎలక్ట్రిక్ బలమైన అమ్మకాలను సాధించింది.
దేశంలో మొత్తం ఈవీ టూవీలర్ అమ్మకాలను చూసినట్లయితే 11,09,432 యూనిట్లుగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్ విక్రయాలు భారీగా పుంజుకుంటున్నాయి. మొత్తం విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్ 36 శాతం వాటా సాధించగా, టీవీఎస్ కంపెనీ 19 శాతం, బజాజ్ ఆటో 17 శాతం, ఏథర్ కంపెనీ 11 శాతం మార్కెట్ వాటాను సాధించాయి.
2024 ఏడాదిలో నెల వారీగా ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల డేటాను చూసినట్లయితే నవంబర్ నెలలో 40 శాతం వరకు తగ్గాయి. ఇటీవల ఓలా స్కూటర్లపై పలు ఆందోళనలు రావడం కారణంగా అమ్మకాలు పడిపోయాయి. ఇదే సమయంలో ప్రత్యర్థి కంపెనీలు బజాజ్ 12 శాతం పడిపోగా, టీవీఎస్ 13.4 శాతం తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








