భారీ డిమండ్ ఉన్న టూవీలర్స్.. ఒక్క నెలలోనే విపరీతంగా పెరిగిన సేల్స్.. పెర్ఫామెన్స్‌కు అందరు పడిపోయారు
ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థగా పెరుగాంచిన రివోల్ట్ మోటార్స్ వాహనాల విక్రయాల్లో క్రమంగా దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. తన మార్కెట్‌ను పెంచుకోడానికి ఇతర ఈవీ తయారీదారుల కంటే వినూత్నంగా ఆలోచిస్తూ, సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను లాంచ్ చేస్తూ సేల్స్ పరంగా దూసుకుపోతోంది. రివోల్ట్‌కు చెందిన టూవీలర్లు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు, పట్టణాల్లో సైతం ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో కంటే రివోల్ట్ నుంచి విడుదలైన మోటార్‌సైకిళ్లకు దేశంలో మంచి ఆదరణ లభిస్తుంది. ఈవీ విభాగంలో ఉన్న ఇతర తయారీదారుల కంటే వేగంగా మార్కెట్‌ను సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కంపెనీ తన అమ్మకాల వివరాలు వెల్లడించింది. కంపెనీ విక్రయాలు పెరిగినట్లు పేర్కొంది. ప్రధానంగా రివోల్ట్ దేశీయ వినియోగదారులకు చేరడానికి తక్కువ ధరల్లోనే తన వాహనాలను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెరిగాయి.
రివోల్ట్ వెల్లడించిన డేటా ప్రకారం, గత ఏడాది (2023) నవంబర్ నెలలో మొత్తం అమ్మకాలు 671 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది (2024) నవంబర్‌లో మొత్తం వాహన అమ్మకాలు 1,994 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ గణాంకాలను చూసినట్లయితే రివోల్ట్ కంపెనీ పట్ల ప్రజల్లో మంచి డిమాండ్ ఉందని తెలుస్తుంది. అలాగే ఈ ఏడాది అక్టోబర్‌లో విక్రయాలు 952 యూనిట్లుగా కాగా నెల రోజుల వ్యవధిలోనే 1000కు పైగా పెరగడం గమనార్హం.

ముఖ్యంగా రివోల్ట్ వాహన విక్రయాలు గత ఏడాది కంటే ఎక్కువ పెరగడానికి ప్రధానంగా RV1,RV1+ మోటార్‌సైకిళ్లు కీలక పాత్ర పోషించాయి. ఈ రెండింటిని కంపెనీ భారతీయ కస్టమర్లకు అనుగుణంగా విడుదల చేయడంతో పాటు ధర కూడా మిగతా వాటి కంటే బడ్జెట్‌లో ఉండటంతో ఇవి ఎక్కువగా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం వీటికి కస్టమర్ల నుంచి బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి. వీటి డిజైన్ కూడా సాధారణ బైకుల్లాగే ఉంటాయి.
ఈ ఈవీ మోటార్‌సైకిళ్ల విషయానికి వస్తే, RV1,RV1+ ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి. RV1 ఈవీ ధర రూ.84,990 గా ఉంది. ఇది 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది బేస్ వేరియంట్. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 100 కి.మీ దూరం వరకు ప్రయాణిస్తుంది. పట్టణాల్లో లేదా నగరాల్లో లోకల్ ప్రయాణాలకు, రోజువారీ అవసరాలకు బాగా సెట్ అవుతుంది.

రివోల్ట్ RV1లో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ముందు 6-అంగుళాల డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, రివర్స్ మోడ్, మల్టిపుల్ స్పీడ్ మోడ్స్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లుయ ఉంటాయి. ఇది దాదాపు 250 కిలోల బరువును కూడా ఈజీగా మోసుకెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కి.మీగా ఉంటుంది. బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి 4.5 గంటల సమయం పడుతుంది.
ప్రీమియం వెర్షన్ RV1+ మోడల్ ధర రూ.99,990 గా ఉంది. ఇది 3.24 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో లభిస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 160 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సుమారు 3.30 గంటల సమయం పడుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కి.మీ. ఇది బ్లాక్ నియాన్ గ్రీన్, బ్లాక్ మిడ్‌నైట్ బ్లూ, టైటాన్ రెడ్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్ రెడ్ కలర్స్‌లలో లభిస్తుంది.

రివోల్ట్ మోటార్స్ వివిధ నగరాలు, పట్టణాల్లో 154 డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. తన వ్యాపారాన్ని మరింత పెంచడానికి కంపెనీ 2024 చివరి నాటికి మరో 14 కొత్త డీలర్‌షిప్‌లను ఓపెన్ చేయడానికి ప్రణాళికలు చేసినట్లు గతంలోనే ప్రకటించింది. ప్రధానంగా వీటిని అర్బన్, సెమీ అర్బన్ ఏరియాల్లో ఏర్పాటు చేయనుంది.


Click it and Unblock the Notifications








